న్యూఢిల్లీ : ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు దినేష్ అరోరా స్టేట్‌మెంట్ మినహా సిసోడియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించింది. నగదు ఎవరి నుండి ఎవరికి ఎలా చేరిందనే అంశంపై పూర్తి సాక్ష్యాధారాల లింకులను సమర్పించలేదని పేర్కొంది. లిక్కర్ గ్రూపుల నుండి మనీస్ సిసోడియాకు ముడుపులు అందాయని దర్యాప్తు సంస్థ పేర్కొందని, అయితే ఆ నగదు ఎలా చేరిందని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించింది.
''మీరు రూ.100 కోట్లు, రూ.30 కోట్లు అని రెండు అంకెలు చెప్పారు. వారికి ఇది ఎవరు చెల్లించారు. నగదు చాలా మంది చెల్లించవచ్చు. మద్యానికి సంబంధించినదే కానవసరంలేదు. సాక్ష్యం ఎక్కడ ఉంది. దినేష్ అరోరా కూడా నగదు తీసుకున్న వ్యక్తే. గ్రహీత. ఒక్క దినేష్ అరోరా ప్రకటన తప్ప.. ఈ కేసులో సరైన రుజువులు ఏవి '' అని జస్టీస్ ఖన్నా ప్రశ్నించారు.
ఈ కేసులో విజయ్ నాయర్ మాత్రమే ఉన్నారని, మనీష్ సిసోడియా పాత్ర లేదని ధర్మాసనం ప్రశ్నించింది. మనీలాండరింగ్ చట్టం కింద సిసోడియాను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించింది. అప్రూవర్‌గా మారిన ఓ వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలాన్ని సాక్ష్యంగా పరిగణించలేమని వ్యాఖ్యానించింది. ఈ కేసులో సిసోదియాకు వ్యతిరేకంగా సరైనా ఆధారాలను చూపించలేకపోయారని కోర్టు స్పష్టం చేసింది.
అయితే ఈ కేసులో నిందితుడిగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్ ) పేరును చేర్చేందుకు ఈడి కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై న్యాయసలహాలు కూడా తీసుకుంటున్నాయని సమాచారం. న్యాయవాదుల నుండి అభిప్రాయాలను సేకరించిన తర్వాత ఈడి ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనుందని ఆ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో మనీష్ సిసోడియా కేసులో పూర్తి సాక్ష్యాధారాలు సమర్పించలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించడం గమనార్హం.










