- ఏపిలో 30,196 మంది అదృశ్యం
- తెలంగాణలో 42,561 మంది - కేంద్రం వెల్లడి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులు అదృశ్యమవుతున్న కేసులు పెరిగిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి కేసుల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల తీవ్ర చర్చకు తెరదీసిన మహిళలు, చిన్నారుల మిస్సింగ్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ 14వ స్థానంలోనూ, తెలంగాణ 11వ స్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 30,196 మంది మహిళలు, చిన్నారులు అదృశ్యమయ్యారు. రాజ్యసభలో ఒక ఎంపి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజరు కుమార్ మిశ్రా ఈ వివరాలు వెల్లడించారు. 2019-2021 మధ్య మూడు ఏళ్లలో ఏపిలో మొత్తం 7,918 మంది బాలికలు, 22,278 మహిళలు కనిపించడం లేదని కేసులు నమోదైనట్లు మంత్రి తెలిపారు. 2019లో 2,186 మంది బాలికలు, 6,252 మంది మహిళలు, అలాగే 2020లో 2,374 మంది బాలికలు, 7,057 మంది మహిళలు, 2021లో 3,358 మంది బాలికలు, 8,969 మంది మహిళలు అదృశ్యమైనట్లుగా కేసులు నమోదయ్యాయన్నారు. 2019 నుంచి 2021 వరకు మూడు ఏళ్లలో తెలంగాణలో మొత్తం 8,066 మంది బాలికలు, 34,495 మంది మహిళలు అదృశ్యమైనట్లు మంత్రి తెలిపారు. 2021లో మహారాష్ట్రలో 56,498 మంది, మధ్యప్రదేశ్‌లో 55,704 మంది, పశ్చిమ బెంగాల్‌లో 50,998 మంది, ఒరిస్సాలో 29,582 మంది, రాజస్థాన్‌లో 25,247 మంది, ఢిల్లీలో 21,871 మంది, ఛత్తీస్‌గఢ్‌లో 18,135 మంది, తమిళనాడులో 18,015 మంది, గుజరాత్‌లో 13,747 మంది, కర్ణాటకలో 12,964 మంది, తెలంగాణలో 12,834 మంది, హర్యానాలో 10,345 మంది, ఉత్తరప్రదేశ్‌లో 9,035 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 8,969 మంది మహిళలు మిస్సింగ్ అయినట్లు కేసులు నమోదయ్యాయని మంత్రి వివరించారు. కాగా 2021లో పశ్చిమ బెంగాల్‌లో 13,278 మంది, మధ్యప్రదేశ్‌లో 13,034 మంది, బీహార్‌లో 9,808 మంది, ఢిల్లీలో 7,805 మంది, ఒరిస్సాలో 6,399 మంది, తమిళనాడులో 5,949 మంది, రాజస్థాన్‌లో 4,935 మంది, ఛత్తీస్‌గఢ్‌లో 3,991 మంది, మహారాష్ట్రలో 3,937 మంది, ఏపిలో 3,358 మంది, తెలంగాణలో 2,994 మంది చిన్నారులు కనిపించడం లేదంటూ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.










