Aug 23,2022 06:10
  • అంటే ఈ పరిస్థితి నయా ఉదారవాద వ్యవస్థకు పెద్ద ఎదురుదెబ్బ అయిందన్నమాట. బహుళ పక్ష ఒప్పందాలను రుద్దడం ఆ వ్యవస్థ యొక్క సారాంశం. అమెరికా నాయకత్వంలో పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలు డాలర్‌కున్న ఆధిక్యత ఆధారంగా తక్కిన దేశాలమీద రుద్దిన ఒప్పందాలవి. డాలర్‌ ఆధిక్యతను నిలబెట్టుకోడం ద్వారా మాత్రమే ఆ దేశాలు తమ ఆధిపత్యాన్ని నిలుపుకోగలవు. ఇప్పుడు ఆ ఆధిపత్యానికే సవాలు ఎదురౌతోంది.

ప్రపంచంలో సంపద కలిగివున్న వారంతా (వ్యక్తులు, సంస్థలు) డాలర్‌ ను ''బంగారంతో దాదాపు సమానమైన'' కరెన్సీగా పరిగణిస్తారు. గతంలో డాలర్‌ ను బంగారంతో మారకం చేసే ధర స్థిరంగా ఉండేది. ఇప్పుడు ఖచ్చితంగా అదే స్థితి లేదు. అయినప్పటికీ, డాలర్‌ ఆధిపత్యం మాత్రం అదే విధంగా కొనసాగుతోంది. సంపదను నిల్వ పెట్టుకునే వ్యక్తులు, సంస్థలు, లేదా కేంద్ర బ్యాంకులు తమ తమ విదేశీ మారకపు నిల్వలను ప్రధానంగా డాలర్ల రూపం లోనే ఉంచుతారు. దీనికి కారణం బంగారం ధర లోని హెచ్చుతగ్గులు సరుకుల, సేవల ధరలను బట్టి ఉంటాయి. సరుకుల, సేవల ధరలు డాలర్‌ లెక్కల్లో దాదాపు స్థిరంగా ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటుందన్న ప్రశ్నకు సమాధానంగా అమెరికాలో కార్మికుల వేతనాల రేట్లు డాలర్ల లెక్కల్లో దాదాపు స్థిరంగా కొనసాగేలా అదుపు చేయగలుగుతున్నారని, ఆ విధంగా అదుపు చేయడం కోసం అమెరికాలో రిజర్వు కార్మిక సైన్యం (నిరుద్యోగులను) అవసరమైన మోతాదులో ఉండేలా చూసుకుంటున్నారని భావిస్తున్నారు. అంతే గాక, అత్యంత ప్రధానమైన ముడిసరుకు అయిన చమురు ధర దీర్ఘ కాల వ్యవధిలో-మధ్య మధ్యలో హెచ్చుతగ్గులు వస్తున్నప్పటికీ -డాలర్‌ లెక్కల్లో స్థిరంగా ఉండేటట్టు చేయగలుగుతున్నారు. చమురు ఉత్పత్తిదారుల మీద అమెరికా తన పట్టు కలిగివుండడం దీనికి కారణం అని అంటున్నారు.

  • అదనపు కారణాలు

వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు (మన రిజర్వు బ్యాంక్‌ వంటివి) తమ నగదు నిల్వలను ప్రధానంగా డాలర్ల లోనే ఉంచుతున్నారు. దీనికి కారణం అంతర్జాతీయంగా వివిధ దేశాల నడుమ సాగే వాణిజ్య ఒప్పందాలు అన్నింటికీ నగదు మాధ్యమంగా డాలర్‌ ఉంటూ వస్తోంది.అదే రెండు దేశాల మధ్య జరిగే వాణిజ్య ఒప్పందంలో ఆ రెండు దేశాల కరెన్సీల పరస్పర విలువల ప్రాతిపదికన ఒప్పందం చేసుకోవచ్చు. ఆ రెండు కరెన్సీల విలువలలో మార్పులు ఉన్నా, కొంత కాలం గడిచేసరికి ఆ తేడాలు సర్దుకుపోతాయి అన్న విశ్వాసం ఉన్నప్పుడు ఆ విధంగా చేసుకోవచ్చు. కాని రెండు కన్నా ఎక్కువ దేశాల నడుమ జరిగే బహుళ పక్ష వాణిజ్య ఒప్పందాలలో ఆ విధంగా సాధ్యం కాదు. అందుచేత అందరికీ ఆమోదయోగ్యమైన ఒక కరెన్సీ అవసరం అవుతుంది. ఆ విధంగా ఉండదగ్గ కరెన్సీ విలువ సరుకుల విలువలతో పోల్చినప్పుడు అనూహ్యంగా పడిపోయేదిగా ఉండకూడదు. అందుచేత అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలలో కరెన్సీ మాధ్యమంగా డాలర్‌ ఎంపిక కావడం ఆశ్చర్యం కలిగించదు.
ఐతే ఈ పరిస్థితి క్రమంగా మారుతోంది. ఉక్రెయిన్‌ యుద్ధం సందర్భంగా రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత ఈ మార్పు మరింత వేగం పుంజుకుంది. ఆ ఆంక్షల కారణంగా చమురు, సహజ వాయువుల ధరలు పెరిగిపోయాయి. వాటి ఎగుమతిదారులలో రష్యాది ఒక ముఖ్యమైన స్థానం. ఐతే, ఈ చమురు, సహజ వాయువుల కొరత మాత్రం ఏదీ లేదు. ఐనా వాటి ధరలు పెరిగిపోయాయి. దీనికి కారణం స్పెక్యులేషన్‌ మాత్రమే. రష్యా నుండి కొనుగోలు చేయడం పై అమెరికా ఆంక్షలు విధించింది కాబట్టి చమురు, సహజ వాయువుల ధరలు రానున్న కాలంలో పెరిగిపోవచ్చునన్న అంచనాలపై ఆధారపడి ఈ స్పెక్యులేషన్‌ యావత్తూ నడుస్తోంది. దీని వలన అమెరికన్‌ ఆయిల్‌ కంపెనీల లాభాలు గణనీయంగా పెరిగాయి. దానితోబాటు ద్రవ్యోల్బణం వేగంగా పెరిగేందుకు ఇది దోహదం చేసింది. అంతర్లీనంగా కొనసాగుతున్న డాలర్‌-చమురు విలువ బంధం తెగిపోయింది. దాంతో డాలర్‌ విలువ ఒత్తిళ్ళకు లోనవుతోంది. దీనికి పూర్తి విరుద్ధ దిశలో రూబుల్‌ ఒక 'ఆమోదయోగ్యమైన' కరెన్సీగా ముందుకొస్తోంది. చమురు ధరను రూబుల్‌తో స్థిరీకరించడమే దీనికి కారణం. ఇప్పుడు 'రూబుల్‌ అంటే చమురుతో సమానం' అనే పరిస్థితి వచ్చింది. ఇక రూబుల్‌ అంటే బంగారంతో సమానం అనే పరిస్థితి వైపు అడుగులు పడుతున్నాయి.
దీనికి తోడు తనకు రూబుళ్ళలో చెల్లిస్తేనే కొనుగోలుదారులకు చమురు, సహజవాయువు అమ్ముతానని రష్యా పట్టుబడుతోంది. అందుచేత రష్యా నుండి చమురు కొనేందుకు తమ వద్ద డాలర్ల నిల్వలు ఎంత ఉన్నా అందువలన కొనుగోలుదారులకు ఉపయోగం ఏమీ లేదు. కొనుగోలుదారులు డాలర్లకు బదులు రూబుళ్ళను కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు.
ఐతే ఈ రెండు కారణాలే మొత్తం పరిస్థితిని పూర్తిగా వివరించవు. రష్యా తో ద్వైపాక్షిక ఒప్పందాలను పలు దేశాలు ఇప్పుడు పునరుద్ధరించుకుంటున్నాయి. వాటిలో ఇండియా కూడా ఉంది. గతంలో సోవియట్‌ యూనియన్‌ ఉనికిలో ఉండేటప్పుడు ఈ విధమైన ద్వైపాక్షిక ఒప్పందాలు ఆ సోవియట్‌ యూనియన్‌ తో కుదుర్చుకునేవారు. ఆ సోవియట్‌ యూనియన్‌ పతనంతో ఆ విధమైన ఒప్పందాలు ముగిసిపోయాయి. ఆ తరహా ఒప్పందాలలో అమెరికన్‌ డాలర్‌కు ఏ విధమైన పాత్రా ఉండేది కాదు. ఒప్పందం కుదుర్చుకునే రెండు దేశాల కరెన్సీలను మార్పిడి చేసుకునే రేటును నిర్ణయించుకునేవారు. రెండు దేశాల నడుమ జరిగే వాణిజ్యంలో ఏ దేశం బకాయి పడుతుందో, ఆ దేశం రెండో దేశానికి ముందుగా ఒప్పందం కుదుర్చకున్న రేటు ప్రకారం తమ కరెన్సీని చెల్లించాలి. (ఉదా: ఒక రూబుల్‌ రెండు రూపాయలతో సమానం అని ముందు ఒప్పందం కుదిరిందనుకుందాం. భారతదేశం రష్యాకు 1000 రూబుళ్ళ మేరకు బకాయి పడిందనుకుందాం. ఆ బకాయి చెల్లించే సమయానికి రూపాయి విలువ ఒక రూబుల్‌కు మూడు రూపాయలు అయిందనుకుందాం. అప్పుడు మూడు వేల రూపాయలు చెల్లించాలి. రూపాయి విలువ పడిపోకుండా ఉంటే ఒప్పందం నాటి రేటుకే, అంటే రెండువేల రూపాయిలు చెల్లించాలి-అను) ద్వైపాక్షిక వాణిజ్యంలో మిగులు ఉన్న దేశానికి తన మిగులు విదేశీ కరెన్సీ నిల్వ లాంటిదే అవుతుంది. కేవలం డాలర్‌ నిల్వలే కాకుండా ఇతర కరెన్సీల నిల్వలు కూడా ఏర్పడతాయి. రష్యాతో వాణిజ్యం నడిపితే అప్పుడు డాలర్‌ మాదిరిగానే రూబుల్‌ నిల్వలు కూడా ప్రాధాన్యత సంతరించుకుంటాయి.
పైన చెప్పిన కారణాలన్నింటిరీత్యా డాలర్‌తో పోల్చినప్పుడు రూబుల్‌కు డిమాండ్‌ పెరిగింది. రష్యా మీద ఆంక్షలు విధించగానే అమాంతం రూబుల్‌ మారకపు రేటు పడిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు అదే రూబుల్‌ రేటు గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువ స్థాయికి చేరుకుంది. ఆగస్టు 2021 నాటికి ఒక డాలర్‌ దాదాపు 72 రూబుళ్ళకు సమానంగా ఉండేది. ఆంక్షలు విధించగానే అమాంతం అది 136 రూబుళ్ళయింది. కాని ఆ తర్వాత రూబుల్‌ విలువ పుంజుకుంది. ఆగస్టు 2022 నాటికి ఒక డాలర్‌ సుమారు 61 రూబుళ్ళతో సమానం అయింది (ఖచ్చితంగా చెప్పాలంటే ఒక డాలర్‌ 60.6957 రూబుళ్ళకు సమానం). అంటే ఆగస్టు 2021, ఆగస్టు 2022 మధ్య కాలంలో డాలర్‌ తో పోల్చితే రూబుల్‌ విలువ 22 శాతం పెరిగింది.

  • ద్వైపాక్షిక ఒప్పందాల ఆవశ్యకత

ఆంక్షల ప్రతికూల ప్రభావం కింద ఎక్కువగా నలుగుతున్నవి యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు. రష్యాపై ఆంక్షలను ఆ దేశాలు సమర్ధించాయి. ఆ నిర్ణయం వాటివరకు ''సెల్ఫ్‌ గోల్‌'' అయింది. ఆ దేశాలకే కాదు, అమెరికా కూడా అంతే అయింది. పైగా బహుళపక్ష వాణిజ్య ఒప్పందాల వైపు నుండి ద్వైపాక్షిక ఒప్పందాల వైపుగా ఇప్పుడు ఎక్కువ దేశాలు నడుస్తున్నాయి.
అంటే ఈ పరిస్థితి నయా ఉదారవాద వ్యవస్థకు పెద్ద ఎదురుదెబ్బ అయిందన్నమాట. బహుళ పక్ష ఒప్పందాలను రుద్దడం ఆ వ్యవస్థ యొక్క సారాంశం. అమెరికా నాయకత్వంలో పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలు డాలర్‌కున్న ఆధిక్యత ఆధారంగా తక్కిన దేశాలమీద రుద్దిన ఒప్పందాలవి. డాలర్‌ ఆధిక్యతను నిలబెట్టుకోడం ద్వారా మాత్రమే ఆ దేశాలు తమ ఆధిపత్యాన్ని నిలుపుకోగలవు. ఇప్పుడు ఆ ఆధిపత్యానికే సవాలు ఎదురౌతోంది.
పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలు ఈ విధంగా ''సెల్ఫ్‌ గోల్‌'' ఎందుకు చేసుకున్నాయి ? ఆ దేశాలు వేసుకున్న లెక్కలు తప్పాయి. ఆంక్షలు విధించగానే రష్యా దిగివస్తుందని, ఉక్రెయిన్‌ పై సైనిక చర్యకు తెర పడుతుందని, అంతేగాక, రష్యాలో ప్రభుత్వ మార్పు కోసం చర్చ మొదలౌతుందని వాళ్ళు భావించారు. కాని అది వాస్తవరూపం దాల్చలేదు. ఈ విధంగా ఆంక్షలు విధించడం అంటే బహుళపక్ష ఒప్పంద స్ఫూర్తిని ఉల్లంఘించడమే. బహుళ పక్షం లోనుంచి ఒక దేశాన్ని వేరు చేసి ఒంటరిపాటు చేయడం ద్వారా ఆ దేశాన్ని త్వరగా లొంగదీసుకోవచ్చునన్న సామ్రాజ్యవాదుల ఆశ దీనికి కారణం. కాని అలా లొంగిపోతుందన్న అంచనా తారుమారైతే, ఆ తర్వాత వరసగా అందరూ బహుళ పక్ష ఒప్పందం లోంచి బైటకు రావడం మొదలుపెడతారు. దాంతో మొత్తం ఆ బహుళపక్ష ఒప్పంద వ్యవస్థే కుదేలౌతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది.
ఇంతవరకూ చెప్పినదానిని బట్టి, ఇక డాలర్‌ పతనం ఖాయం అన్న నిర్ధారణకు రావడం అపరిపక్వత అనిపించుకుంటుంది. ఇప్పటికీ, ప్రపంచంలో సంపదను నిల్వ ఉంచుకున్న వ్యక్తులకు, సంస్థలకు డాలర్‌ అత్యంత ఆకర్షణీయంగా కొనసాగుతోంది. గతంలో అమెరికాలో వడ్డీ రేట్లు దాదాపు సున్నాగా ఉండిన కాలంలో పెట్టుబడులు ఎక్కువ వడ్డీలు వచ్చే మూడో ప్రపంచ దేశాలకు తరలిపోయాయి. ఇప్పుడు అమెరికాలో ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీ రేట్లు పెంచారు. దాంతో తిరిగి పెట్టుబడులు అమెరికా లోకి ప్రవహించడం మొదలైంది. కేవలం అమెరికాలో మాత్రమే గాక తక్కిన దేశాలలోనూ వడ్డీ రేట్లు పెంచారు. అయినప్పటికీ, అమెరికా వైపే పెట్టుబడులు ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. ప్రస్తుత సంక్షోభ సమయంలో, పరిస్థితులు అనిశ్చితిలో కొనసాగుతున్నందున తమ స్వంత దేశంలో పెట్టుబడులు దాచుకోవడమే క్షేమం అని భావించడం దీనికి కారణం. అందుచేత ఈ పరిస్థితుల్లో అప్పుడే డాలర్‌ పని అయిపోయిందనుకుని దానికి సంతాపం ప్రకటించేయడం మరీ తొందరపాటు మాత్రమే కాక హాస్యాస్పదం కూడా ఔతుంది.
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రెండు ధోరణులు కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి. తన దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం కోసం అమెరికా వడ్డీ రేట్లు పెంచినందువలన మూడో ప్రపంచ దేశాల నుండి పెట్టుబడులు అమెరికా వైపు పరుగులు తీస్తున్నాయి. ఇంకోవైపు క్రమంగా ద్వైపాక్షిక ఒప్పందాల దిశగా వాణిజ్యం విస్తరిస్తోంది. దాని ఫలితంగా డాలర్‌ నిల్వల ప్రాధాన్యత తగ్గుతోంది. ఈ రెండు పరిణామాలలో మొదటిది డాలర్‌ విలువను పెంచడానికి దోహదం చేస్తే రెండోది డాలర్‌ విలువను తగ్గించడానికి తోడ్పడుతుంది. మొదటి పరిణామం ప్రస్తుతానికి ప్రధానంగా కనిపిస్తోంది. రెండో పరిణామం-అంటే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు-రానున్న కాలంలో ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ, బహుళపక్ష ఒప్పందాలను రుద్ది ఆధిపత్యం చెలాయించిన నయా ఉదారవాద విధానాలకు కాలం చెల్లే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
( స్వేచ్ఛానుసరణ )