
న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2వేల నోట్లను ఉపసంహరించుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉండబోదని నీతి ఆయోగ్ మాజీ వైస్ ఛైర్మన్ అర్వింద్ పనాగరియా పేర్కొన్నారు. పెద్ద నోటును వెనక్కి తీసుకోవడంతో నగదు సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. ప్రస్తుతం ప్రజల వద్ద ఉన్న నగదులో రూ.2,000 కరెన్సీ నోట్లు 10.8 శాతానికి మాత్రమే సమానమని, ఇందులో ఎక్కువ భాగం అక్రమ లావాదేవీలకే వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. రూ.2వేల నోట్లు కలిగిన వారు 2023 సెప్టెంబర్ 30 కల్లా బ్యాంక్‌ల్లో మార్చుకోవాలని ఆర్‌బిఐ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పటి వరకు పెద్ద నోట్లు చెలామణిలో ఉంటాయి. ప్రజలు ప్రస్తుతం రూ.500 లేదా అంతకంటే తక్కువ విలువ కలిగిన నోట్లతో లావాదేవీలు చేయడానికి అలవాటు పడ్డారు, కాబట్టి రూ. 1,000 నోట్లను జారీ చేయవలసిన అవసరం కూడా లేదని పనాగరియా అభిప్రాయపడ్డారు. అమెరికాలో తలసరి ఆదాయం, అక్కడి అత్యధిక డినామినేషన్ నోటుతో పోల్చితే భారత్‌లో అత్యధిక డినామినేషన్ నోటు రూ.243గా ఉంటే సరిపోతుంది. కాబట్టి.. అత్యధిక డినామినేషన్ నోటుగా రూ.500 నోటు మనకు సరిపోతుందన్నారు.
ప్రయోజనకరమే : మాజీ సిఇఎ
రూ.2వేల నోట్ల ఉపసంహరణతో దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరమేనని ఆర్థిక శాఖ మాజీ సలహాదారు (సిఇఎ) కృష్ణమూర్తి సుబ్రమణియన్ పేర్కొన్నారు. మొత్తం రూ.2వేల నోట్లలో 20 శాతం మాత్రమే చలామణీలో ఉన్నాయన్నారు. మిగతా 80 శాతం అతికొద్ది మంది వద్ద ఉన్నాయన్నారు. ఇప్పుడు ఆ నగదును వెలికితీసేందుకు ఆర్‌బిఐ తాజా చర్య దోహదం చేయనుందన్నారు.