
- ప్రత్యామ్నాయాలపై చైనా దృష్టి
- ఎల్‌ఎన్‌జి కోసం యుఎఇతో జట్టు
షాంగై : ప్రపంచ వ్యాప్తంగా డాలర్ వాడకంలో తగ్గుదల చోటు చేసుకుంటుంది. వాణిజ్యంలో అమెరికన్ డాలర్ కాకుండా ఇతర అనుకూలమైన కరెన్సీల వినియోగంపై అనేక దేశాలు దృష్టి పెడుతున్నాయి. చైనా, ఇతర దేశాలు సరిహద్దు వాణిజ్యం కోసం స్థానిక కరెన్సీలను ఉపయోగించడం ద్వారా డాలర్‌పై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మల్టీపోలార్ అంతర్జాతీయ కరెన్సీ వ్యవస్థను రూపొందించడంపై దృష్టి పెడుతున్నాయని భావిస్తున్నారు. ఈ ఏడాది మార్చి చివరలో షాంఘై పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ఎక్సేంజ్ చైనా యువాన్‌ను ఉపయోగించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి సహజ వాయువును దిగుమతి చేసుకుంది. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జి) రెండో అతిపెద్ద దిగుమతిదారుగా ఉన్న చైనా తొలిసారి తన సొంత కరెన్సీని దీనికి వాడటం విశేషం. ప్రపంచ వస్తువుల వాణిజ్యంలో చాలా కాలంగా డాలర్ ఆధిపత్యం కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
చమురు ఎగుమతి చేసే దేశాలు అంతర్జాతీయ స్థాయిలో డాలర్ కంటే యువాన్ వంటి కరెన్సీలను ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతున్నాయని యుఎఇ ఎల్‌ఎన్‌జి ఒప్పందంతో తేలిందని స్విట్జర్లాండ్‌లోని ఫ్రిబోర్గ్ విశ్వవిద్యాలయంలోని స్థూల ఆర్థిక, ద్రవ్య ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ సెర్గియో రోస్సీ పేర్కొన్నారు. 'యుఎఇ-చైనా లావాదేవీల్లో డాలర్ నుండి వారి స్వంత కరెన్సీలకు మారడం ద్వారా ఇతర దేశాలను ప్రోత్సహిస్తుంది. దీని ద్వారా వాణిజ్య లేదా ఆర్థిక మార్కెట్లలో విదేశీ లావాదేవీలను పరిష్కరించవచ్చు.' అని రోస్సీ తెలిపారు. దీర్ఘకాల ఎల్‌ఎన్‌జి విక్రయం, కొనుగోలు ఒప్పందాల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో మరిన్ని యువాన్ ఆధిపత్య లావాదేవీలు జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ న్యాయ సంస్థ కింగ్ అండ్ వుడ్ మల్లేసన్స్‌లో భాగస్వామి అయినా డేవిడ్ ఫువా పేర్కొన్నారు. మలేషియాతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం ఇక రూపాయల్లో జరుగనుందని జనవరి తొలి వారంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రష్యా, మారిషాస్, శ్రీలంక దేశాలతో ఎగుమతులు, దిగుమతుల లావాదేవీలు రూపాయల్లో జరుగుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో మలేషియా వచ్చి చేరింది. ఇప్పుడు మలేషియాతో వాణిజ్యం ప్రస్తుతమున్న కరెన్సీలతో పాటు రూపాయల్లోనూ జరగనుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాణిజ్య లోటును ఎదుర్కోవడానికి ప్రపంచంలోని అనేక దేశాలు ఈ తరహా విధానాన్ని అనుసరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.