బహుశా
కన్ను మూతపడి వుండి వుండదు పోరు డేరాకి
రెప్పకీ కన్నుకీ మధ్య నీటిముల్లుతో
రాత్రంతా కనురెమ్మల మీద
వాలి వుండకపోవొచ్చు కునుకుపిట్ట
పచ్చనాశల మీద వొచ్చిపడ్డ
మేఘాల మిడతల దండుతో
ఏ మోగన్నుక్షణంలోనో
కలలనిప్పులు రాజేసుకుని
వొళ్ళు వెచ్చబెట్టుకుందేమో
వానకు నానిన గుడారం
చలించవవి హలదేహాలు
హాలాహలమే వర్షమై కురిసినా
తడబడవవి పిడుగులే అడుగులైన మట్టిపాదాలు
మిన్ను విరిగి మీదపడినా
అవి వజ్ర సంకల్పాలు
ప్రకతి పరీక్షలు అలవాటైపోయినవి
నిత్యప్రమాదాలతో ఆటలాడుకునేవి
పోరాటం జీవలక్షణం
ప్రకతైనా ప్రభుత్వమైనా రెండూవొకటే వాటికి
పంటను కాపుకాసుకోవడానికీ
పొలాలను పసిబిడ్డల్లా చూసుకోవడానికీ
కష్టాలను ఎదిరించడం
కాలప్రవాహానికి ఎదురీదడం సర్వసాధారణం
చూడాలీరోజేమౌతుందో....
స్వప్నం ఫలించి పోరు ముగుస్తుందో..
సత్యం జ్వలించి డేరా మరింత తెగిస్తుందో..
* గంటేడ గౌరునాయుడు, 94414 15182