Sep 22,2020 16:28

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) 2020లో తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై సునాయస విజయాన్ని అందుకుని ఉత్సాహంగా ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. షార్జా క్రికెట్‌ స్టేడియంలో 7.30 గంటలకు ప్రత్యర్థి జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌తో ఢకొీనేందుకు ఎంఎస్‌ ధోనీ సేన సిద్ధంగా ఉంది. రాజస్తాన్‌ రాయల్స్‌పై గెలిచి రెండో విజయంతో తన జైత్రయాత్రను కొనసాగించాలని చెన్నై ఉవ్విళ్లూరుతోంది. కాగా, ఐపిఎల్‌ 2020 లీగ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ఇది మొదటి మ్యాచ్‌. ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ సారథ్యంలో రాజస్తాన్‌ రాయల్స్‌ మొదటి మ్యాచ్‌ నెగ్గి భోణీ కొట్టాలని చూస్తోంది. కాగా బలమైన జట్టుగా ఉన్న ముంబైపై చెన్నై సునాయసంగా విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో సరైన ఫలితాలు అందడంతో ఈ రోజు కూడా అదే టీమ్‌తో ధోనీ స్టేడియంలోకి అడుగుపెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. గత మ్యాచ్‌లో వాట్సన్‌, మురళీ విజరు ఓపెనింగ్‌లో నిలదొక్కుకుంటే స్కోరు పరుగులు పెడుతుంది. మిడిల్‌ ఆర్డర్‌లో అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ధోనీ తో జట్టు పటిష్టంగా ఉంది. కరోనా బారిన పడిన రుతురాజ్‌ గైక్వాడ్‌ జట్టులోకి రావడంతో ఆ జట్టు బలాన్ని మరింత పెంచింది. అయితే అతను తుది జట్టులో ఉంటాడా లేడా చూడాలి.
స్టీవ్‌ స్మిత్‌, మిల్లర్‌పైనే భారం..
ఇప్పటి వరకు తొలి మ్యాచ్‌ ఆడతాడా లేదా అనుకున్న రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అందుబాటులోకి వచ్చాడు. ఇక ఆస్ట్రేలియా టూర్‌ ముగిసిన అనంతరం జోస్‌ బట్లర్‌ నేరుగా దుబారు రావడంతో క్వారంటైన్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రాడు. స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఇంకా జట్టుతో చేరలేదు. దీంతో స్మిత్‌, మిల్లర్‌పైనే జట్టు ఆధారపడి ఉంది. సంజూ శాంసన్‌, రాబిన్‌ ఉతప్ప, యశశ్వి జైస్వాల్‌ చెలరేగితే రాజస్తాన్‌కు తిరుగుండదు. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్‌, జయదేవ్‌ ఉనాద్కట్‌, వరుణ్‌ ఆరోణ్‌, టామ్‌ కరన్‌తో బలంగానే ఉంది. జోఫ్రా ఆర్చర్‌ రెచ్చిపోతే గనుక అతని బంతులు ఎదుర్కోవడం ప్రత్యర్థి జట్టుకు కష్టమే.