Nov 12,2023 10:10
  • శుభ్‌మన్‌ గిల్‌, సూర్యపై ఫోకస్‌

బెంగళూర్‌ : 2023 ఐసీసీ ప్రపంచకప్‌ వేటను అద్భుతంగా సాగిస్తున్న టీమ్‌ ఇండియా.. గ్రూప్‌ దశ చివరి మ్యాచ్‌లో నేడు పసికూన నెదర్లాండ్స్‌తో తలపడనుంది. అగ్ర జట్లను పిండి చేసి సగర్వంగా సెమీఫైనల్లో అడుగుపెట్టిన భారత్‌ నేడు నామమాత్రపు మ్యాచ్‌లో పరుగుల వరదపై దృష్టి నిలిపింది. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌, ఎక్స్‌ ఫ్యాక్టర్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌లు పరుగుల వేటలో మెరువాలని జట్టు మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. బుమ్రా, కుల్దీప్‌లకు విశ్రాంతి లభించనున్న తరుణంలో అశ్విన్‌, ప్రసిద్‌ కృష్ణలు చిన్నస్వామిలో బంతి అందుకునే అవకాశం కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా, శ్రీలంకపై విజయాలు సాధించిన నెదర్లాండ్స్‌ ఇతర మ్యాచుల్లోనూ మెప్పించింది. నేడు భారత్‌తో మ్యాచ్‌లోనూ అభిమానుల హృదయాలకు హత్తుకునే ఆటతీరుతో రాణించాలని డచ్‌ శిబిరం ఆశిస్తోంది.
          శుభ్‌మన్‌ దంచేనా..? : 2023 ఐసీసీ ప్రపంచకప్‌లో పరుగుల మోత మోగించిన టాప్‌-3 బ్యాటర్లలో శుభ్‌మన్‌ గిల్‌ ఉంటాడని అభిమానులు, క్రికెట్‌ పండితులు అంచనా వేశారు. ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో భీకర ఫామ్‌లో ఉన్న గిల్‌ అదే జోరులో వరల్డ్‌కప్‌కు వచ్చాడు. కానీ ఆరంభంలోనే డెంగీ జ్వరం బారిన పడిన శుభ్‌మన్‌ గిల్‌ తొలి రెండు మ్యాచులకు దూరమయ్యాడు. డెంగీ జ్వరం కారణంగా బరువు తగ్గిన గిల్‌.. ఆరు ఇన్నింగ్స్‌ల్లో రెండు అర్థ సెంచరీలే సాధించాడు. గిల్‌ నుంచి అభిమానులు, జట్టు మేనేజ్‌మెంట్‌ ఆశించింది ఇది కాదు. టాప్‌ ఆర్డర్‌లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి పరుగుల వరదలో గిల్‌ వైఫల్యం పెద్దగా కనిపించటం లేదు. కానీ కీలక సెమీఫైనల్స్‌ ముంగిట శుభ్‌మన్‌ గిల్‌ తనదైన జోరు అందుకోవటం భారత్‌కు కీలకం. పరుగుల వేటలో గిల్‌ సైతం దంచికొట్టడం మొదలుపెడితే ప్రత్యర్థులకు పగలే చుక్కలు కనిపించటం ఖాయం. ఇక డచ్‌తో మ్యాచ్‌లో ప్రణాళికలు, వ్యూహం పరంగా టీమ్‌ ఇండియాలో ఎటువంటి మార్పులు ఉండబోవు. కానీ బౌలింగ్‌ విభాగంలో ఏమైనా మార్పులు చేసే అవకాశం లేకపోలేదు. రవిచంద్రన్‌ అశ్విన్‌, ప్రసిద్‌ కృష్ణలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. సెమీఫైనల్‌ ముంగిట విలువైన మ్యాచ్‌ ప్రాక్టీస్‌కు దూరం కావటం సైతం అంతి మంచిది కాదు. బుమ్రా, షమి సహా కుల్దీప్‌ యాదవ్‌ విశ్రాంతి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో నేడు భారత్‌ తుది జట్టు కూర్పుపై కాస్త ఆసక్తి నెలకొంది.