ఈ ఏడాది జూన్ 15న భారత్, చైనా సరిహద్దు లడఖ్ ప్రాంతం గాల్వాన్ లోయలో ఇరు దేశాల సైన్యాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల ఫలితంగా నెలకొన్న ఉద్రిక్తతలు విచారకరం కాగా... ఇరుగు పొరుగు దేశాలు ఉద్రిక్తతలకు ఆస్కారం లేకుండా సామరస్యపూర్వక చర్చలు జరపడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని... విదేశాంగ నిపుణులు, సిపిఎం సహా పలు రాజకీయ పార్టీలు సూచిస్తున్నాయి. ఇరు దేశాల ఆర్మీ, విదేశాంగ ప్రతినిధుల మధ్య దఫదఫాలుగా జరిగిన చర్చలు ఫలప్రదం దిశగా పయనిస్తున్నాయి. ఇదే సమయంలో సంయమనం పాటించాల్సిన ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులు ఎప్పటిలాగానే తమ సహజసిద్ధ రెండు నాల్కల విధానాన్ని బయటికి తీశారు. అదేంటంటే, ఒకటి- నయా ఉదారవాద విధానాల అమలులో కీలకంగా పరిగణించే కార్పొరేట్ల లాభాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కాకపోవడం. రెండవది- చైనా వ్యతిరేక భావజాలం ద్వారా తమ 'జాతీయత' సిద్ధాంతానికి పదును పెట్టడానికి కలిసొచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకపోవడం. ఈ రెండింటినీ ఏక కాలంలో అమలు పరిచే తంతు వ్యవసాయ రంగంలో కొనసాగిస్తోంది కేంద్ర బిజెపి ప్రభుత్వం. కొన్ని కాంట్రాక్టులు, కొన్ని యాప్‌లను నిషేధించడం ద్వారా దేశంలో చైనా వ్యాపారానికి చెక్ పెడుతున్నామని ప్రధాని, మంత్రులు చెబుతున్నారు. కాగా రాష్ట్రీయ క్రిషి వికాస్ యోజన (ఆర్‌కెవివై) సహా పలు పథకాలు వ్యవసాయంలో యాంత్రీకరణ చేపట్టేందుకు ఉద్దేశించినవి. వ్యవసాయ యాంత్రీకరణలో పవర్ టిల్లర్లు, వీడర్లు, స్ప్రేయర్లు వంటి చిన్న మధ్యతరహా మిషన్లలో అత్యధిక భాగం మనకు కొన్నేళ్లుగా చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. వ్యవసాయంలో వీటి పాత్ర రానురాను పెరుగుతోంది. కొన్ని యంత్రాలు తైనాన్, జపాన్, ఇత్యాది దేశాల నుంచి దిగుమతి అవుతున్నప్పటికీ చైనా యంత్రాల కంటే వాటి ధర కొంచెం ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వ పథకాల్లో, బహిరంగ మార్కెట్‌లో రైతుల నుంచి చైనా యంత్రాలపై ఆదరణ తక్కువ. మన్నిక కంటే కూడా అప్పటికి పని కానిచ్చేందుకు చౌక వస్తుల వైపు వినియోగదారులు మళ్లడం సహజం. వ్యవసాయ పనిముట్ల విషయంలోనూ అదే జరుగుతోంది. దాంతో దేశీయ కార్పొరేట్, ప్రైవేటు సంస్థలు సైతం రైతుల ఆలోచనలకు అనుగుణంగా తక్కువ ధరలకొచ్చే సాగు యంత్రాలను దిగుమతి చేసుకోవడమో, లేదంటే యంత్ర పరికరాలను తెచ్చుకొని అసెంబుల్ చేయడమో చేస్తున్నారు. కొన్ని సంస్థలైతే చైనాలో ఒక చిన్న కార్యాలయాన్ని తెరిచి, అక్కడే యంత్రాలను సమకూర్చుకొని, తమ బ్రాండ్ లోగో వేసి, ఇండియాకు దిగుమతి చేసుకొని, రైతులకు అమ్ముతున్నాయి. ప్రభుత్వ సబ్సిడీ యాంత్రీకరణ పథకాలకు సరఫరా చేస్తున్నాయి.
ధరల వ్యత్యాసం
చైనా, చైనాయేతర దేశాల సాగు యంత్రాల ధరల మధ్య వ్యత్యాసం ఎలా ఉందంటే, పంటలకు క్రిమి సంహారక మందులు, హెర్బిసైడ్‌ల వంటివి పిచికారీకి ఉపయోగించే స్ప్రేయర్ ధర చైనాదైతే లాండింగ్ రేటు రూ. ఐదారు వేలవుతుంది. అదే తైవాన్, జపాన్ స్ప్రేయర్ అయితే రూ.17-18 వేల వరకు ఉంటుంది. రవాణా, డీలర్ కమీషన్, అనధికారికంగా ప్రభుత్వంలోని వారికి ముట్టజెప్పే కమీషన్లు సరేసరి. అన్నీ కలుపుకుంటే సర్కారీ సబ్సిడీ పథకాలకు చైనా స్ప్రేయర్ రూ.8 వేలకు వస్తుంది. దానిలో యాభై శాతం సబ్సిడీ పోను రైతు వాటా రూ.4 వేలు. అదే తైవాన్, జపాన్ స్ప్రేయర్‌ను కంపెనీలు అన్ని ఖర్చులూ కలుపుకొని రూ.20 వేలకు ఇస్తే, ప్రభుత్వ రాయితీ యాభై శాతం పోను మిగతా రూ.పది వేలు రైతు పెట్టుకోవాలి. తక్కువ ధరకు వస్తుండటంతోనే రైతులు మన్నిక వంటి మరే ఇతర అంశాలూ చూడకుండా చైనా స్ప్రేయర్లు తీసుకుంటు న్నారు. వ్యాపార లాభాల కోసం మహేంద్ర, కిర్లోస్కర్ వంటి పెద్ద కార్పొరేట్లు సైతం చైనా యంత్రాలను, పరికరాలను దిగుమతి చేసుకొని మార్కెట్ చేసుకొని గరిష్ట లాభాలు గడిస్తున్నాయి. ఈ విధానం ఒక్క స్ప్రేయర్లకే పరిమితం కాలేదు. చాలా పరికరాలది ఇదే వరస. అయితే ప్రభుత్వ సబ్సిడీ పథకాలకు సరఫరా చేసే చైనా యంత్రాల రేట్లు అధికంగా ఉంటున్నాయని, నాసిరకానివి కూడా ఇస్తున్నారన్న అపవాదు లేకపోలేదు. అటువంటి అక్రమాలకు పాల్పడేది సైతం కార్పొరేట్లే.
విడదీయలేని సంబంధం
భారత వ్యవసాయ రంగంలో ప్రాధాన్యత వహించేంతగా చైనా ఉత్పత్తులు మారినందున, వాటిని దిగుమతి చేసుకునే దేశీయ కార్పొరేట్లు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నందున, ప్రభుత్వాధీశులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గాల్వాన్ సంఘటన తర్వాత వ్యవసాయ యంత్రాల అంశం ముందుకు వచ్చినప్పుడు, దేశానికి దిగుమతి అవుతున్న పవర్ టిల్లర్లలో 90 శాతం చైనావేనని తేలింది. వాటిని నిషేధించేస్తున్నామన్న కేంద్ర వాణిజ్య శాఖ, జులై 15న ఇచ్చిన నోటిఫికేషన్‌లో మాత్రం 'రోటరీ టిల్లర్, ఇతర టిల్లర్లను గతంలో స్వేచ్ఛగా ఎక్కడి నుంచైనా దిగుమతి చేసుకునేవారము. ఇక నుంచి వాటి దిగుమతులపై ఆంక్షలు ఉంటాయ'ని పేర్కొంది. నోటిఫికేషన్‌లో ఎక్కడా చైనా నుంచి పవర్ టిల్లర్ల దిగుమతులను నిషేధిస్తున్నట్లు పేర్కొనలేదు. చైనా వ్యతిరేకులు, చైనా యంత్రాలను ఆపేస్తే, తాము వ్యాపారం చేసుకోవచ్చనే చైనాయేతర యంత్రాల డీలర్లు, ఆ నోటిఫికేషన్‌ను తప్పుబట్టినప్పుడు ఎంఎస్‌ఎంఇ మంత్రి నితిన్ గడ్కరీ అసలు విషయం చెప్పారు. చైనా సాగు యంత్రాలను నిషేధించినట్లయితే, ఆ దేశానికి జరిగే నష్టం కంటే మన దేశ రైతాంగానికి వాటిల్లే నష్టమే ఎక్కువన్నారు. గడ్కరీ ప్రకటన వెనుక రెండు ఉద్దేశాలున్నాయి. చౌకగా లభించే చైనా యంత్రాల పట్ల రైతుల్లో ఉన్న ఆదరణను సమాధానపర్చడం, ఇదే సమయంలో చైనా యంత్రాలను దిగుమతి చేసుకొని వ్యాపారం చేసే కార్పొరేట్ల లాభాలకు పూచీ పడటం.
ఎ.పి అత్యుత్సాహం
ఈ ప్రహసనం కొనసాగుతుండగానే, ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ యంత్రీకరణ లో 'చైనా' వ్యవహారం ముందుకొచ్చింది. అక్టోబర్ 2 నుంచి మెకనైజేషన్ స్కీములను ప్రారంభించేందుకు కసరత్తు ప్రారంభించిన వ్యవసాయశాఖ, కేంద్రం చైనా యంత్రాలను నిషేధిస్తున్నట్లు చేస్తున్న ప్రకటనలతో అత్యుత్సాహానికి పోయింది. మెకనైజేషన్ పథకాలకు యంత్రాలను సరఫరా చేసే కంపెనీలకు 'చైనా నుంచి యంత్రాలు, స్పేర్ పార్టుల దిగుమతి చేసుకోలేదని, తమ ఈ డిక్లరేషన్ తప్పని తేలితే, తమపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని, ప్రాసిక్యూట్ చేసుకోవచ్చని, తమను ఆరేళ్లపాటు బ్లాక్ లిస్టులో పెట్టేందుకు అంగీకరిస్తున్నాను' అని అఫిడవిట్ ఇవ్వాలంటూ షరతు విధించింది. చైనా యంత్రాలను సరఫరా చేసే కంపెనీలు ఒత్తిడి చేయడం, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి 'అసలు' విషయాన్ని ఉద్బోధించిన దరిమిలా, చైనా యంత్రాలపై నిషేధిత అఫిడవిట్ నిర్ణయాన్ని ఎ.పి. వెనక్కి తీసుకుంది. నేరుగా ఒక దేశపు వస్తువులను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వమే పేర్కొనడం డబ్ల్యుటిఒ, బ్రిక్స్, ద్వైపాక్షిక ఒప్పందాల ఉల్లంఘన కిందికి వస్తుందని రాష్ట్రానికి కేంద్రం క్లాస్ తీసుకున్నట్లు ప్రచారం బయటికొచ్చింది. ఆ ప్రచారంలో వాస్తవం పాక్షికమే. కార్పొరేట్ల ఒత్తిళ్లే కేంద్రాన్ని ప్రభావితం చేశాయన్నది దాచినా దాగని సత్యం.
( వ్యాసకర్త సెల్ : 94900 99019 )










