Jan 26,2021 20:13

వాషింగ్టన్‌ : పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లకు ప్రయాణాలు చేసే విషయాన్ని పునరాలోచించుకోవాలని అమెరికా తన పౌరులను కోరింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రయాణించవద్దని సూచించింది. మూడు దక్షిణాసియా దేశాలకు సంబంధించి ప్రయాణ సూచనలను సవరించిన అమెరికా విడివిడిగా ప్రయాణ సూచనలను జారీ చేసింది. ''కోవిడ్‌, తీవ్రవాదం, వేర్పాటువాద హింస వంటి కారణాలతో పాక్‌కు ప్రయాణాలపై పున్ణ పరిశీలన చేయాలని పేర్కొంది. కిడ్నాప్‌ వంటి కారణాల రీత్యా బెలూచిస్తాన్‌, ఖైబర్‌ ఫక్తూన్‌ ఖవా ప్రావిన్స్‌లకు వెళ్లవద్దని కోరింది. సాయుధ ఘర్షణలు జరిగే అవకాశమున్నందున వాస్తవాధీన రేఖ సమీపానికి వెళ్లవద్దని కూడా హెచ్చరించింది. భారత్‌, పాక్‌ సరిహద్దుల్లో తీవ్రవాద గ్రూపులు పనిచేస్తూ వుంటాయని, అక్కడ ఇరు దేశాల సైనిక బలగాలు పరస్పరం కాల్పులకు తలపడుతుంటాయని అందువల్ల ఆ ప్రాంతాలకు పోవద్దని సూచించింది. కోవిడ్‌తో పాటు నేరాలు, తీవ్రవాదం, తీవ్ర అశాంతి, వంటి కారణాల రీత్యా ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌లకు ప్రయాణించవద్దని కోరింది.