ముంబయి : ఆసియాలోని చిన్న దేశాలతో పోల్చిన భారత ప్రజల కొనుగోలు శక్తి చాలా తక్కువని కేంద్ర ప్రభుత్వ గణంకాలే చెబుతున్నాయి. ఇందుకు నిదర్శనం దేశంలో బీమా వినియోగమే. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2020-21 ప్రకారం.. భారత జిడిపిలో బీమా వినియోగం 3.76 శాతమే. ఇతర ఆసియన్ దేశాలు అయినా చైనా, మలేషియా, థాయిలాండ్, ప్రపంచ సగటుతో పోల్చినా అత్యల్పంగా ఉంది. 2001లో 2.71 శాతంగా ఉన్న వినిమయం 2019 నాటికి 3.76 శాతానికి పెరిగింది. కాగా మలేషియా, థాయిలాండ్, చైనాలో బీమా వినియోగం వరుసగా 4.72 శాతం, 4.99 శాతం, 4.30 శాతంగా నమోదయ్యింది. 2019లో భారత్‌లో జీవిత బీమా, జీవితేతర బీమా వినియోగం వరుసగా 2.82 శాతం, 0.94 శాతంగా నమోదయ్యింది.
చమురు ఉత్పత్తి 6% పతనం
గడిచిన ఏడాది 2020లో చమురు ఉత్పత్తి 6 శాతం, సహజ వాయువు 5 శాతం చొప్పున పడిపోయాయయని ఆర్థిక సర్వే వెల్లడించింది. ప్రపంచంలోనే అమెరికా, చైనా తర్వాత చమురు వినియోగంలో మూడో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్‌లో 2019-20 ఆర్థిక సంవత్సరంలో 32.17 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చమురు ఉత్పత్తి జరిగింది. ఇంతక్రితం ఏడాదిలో ఇది 34.20 ఎంఎంటిగా నమోదయ్యింది. కరోనా వల్ల ఉత్పత్తి తగ్గిందని.. త్వరలోనే సాధారణ స్థాయికి చేరుకుంటుందని ఆర్థిక సర్వే పేర్కొంది. 2021 ప్రథమార్థం ముగింపు నాటికి భారత విమానయాన ప్రయాణికుల సంఖ్య కరోనా ముందు నాటి స్థాయికి చేరనుందని అంచనా వేసింది.










