Jan 21,2021 06:53

ఆస్ట్రేలియాపై భారత క్రికెట్‌ జట్టు సాధించిన విజయం చారిత్రాత్మకమైనది. బోర్డర్‌-గవాస్కర్‌ టెస్ట్‌ సిరీస్‌ ట్రోఫీని వరుసగా రెండోసారి గెలిచిన కారణంగానో, ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయం సాధించినందుకో, బ్రిస్బెన్‌ లోని గబ్బా స్టేడియంలో చెలరేగి ఆడినందుకో మాత్రమే ఇది చారిత్రాత్మకం అని చెప్పడం లేదు. క్రికెట్‌ లోనే కాదు, ఇతర ఆటల్లోనూ ఈ తరహా అనూహ్య విజయాలు అప్పుడప్పుడూ ఆవిష్కృతమౌతూనే ఉంటాయి. ఆకస్మికంగా లభించి ఉర్రూతలూగించే ఆ తరహా గెలుపుల నుండి తాజా విజయాన్ని వేరు చూసి చూడటానికి కారణం సీనియర్ల పరోక్షంలో కుర్రాళ్లు చెలరేగి ఆడిన తీరు! వారిలో కనిపించిన విజయకాంక్ష! సుడులు తిరుగుతూ మెరుపు వేగంతో దూసుకొచ్చే బంతులు ఒకదాని తరువాత ఒకటిగా ఒళ్లంతా గాయాలు చేస్తున్నా ఏమాత్రం ఖాతరు చేయని తీరు! వీటన్నింటికి మించి 'వీరి సత్తా ఎంత? వీరేం చేస్తారు? రెండో, మూడో బంతులాడితే గొప్ప...' అంటూ సోకాల్డ్‌ క్రికెట్‌ పండితులు చేసిన అవహేళనల అంచనాను తుత్తునియలు చేయడానికి చూపిన మనోధైర్యం! ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో! గబ్బా స్టేడియాన్ని అదరగొట్టి సాధించిన ఈ విజయం నుండి నేర్చుకోవాల్సిన పాఠాలూ చాలానే ఉన్నాయి!


ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్‌ మాటల్లో చెప్పాలంటే భారత జట్టు నెట్‌బౌలర్లతో మ్యాచ్‌ ఆడి గెలిచింది. నిజమే! కెప్టెన్‌తో పాటు ప్రధాన ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. సిరాజ్‌, సుందర్‌, శార్దూల్‌, నటరాజన్‌ల పేర్లు భారత క్రికెట్‌ అభిమానులకు కూడా పెద్దగా పరిచయం లేనివి! నిజంగానే వీరు నెట్‌ ప్రాక్టీస్‌ కోసమే జట్టు వెంట వెళ్లారు! ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ ఆడతామని కూడా వీరు అనుకొని ఉండరు. వీరికి తోడు పెట్టని కోటగా నిలిచిన పూజారా, చెలరేగి ఆడిన రిషబ్‌పంత్‌ ...అందుకే ఇది యువ ఆటగాళ్ళ సమిష్టి విజయం! సిరీస్‌ ఫలితాన్ని తేల్చే గబ్బా మ్యాచ్‌కు ముందే భారత జట్టులోని ఐదుగురు ఫేస్‌ బౌలర్లు, బ్యాట్‌తో కూడా రాణించగల ఇద్దరు కీలక స్పిన్నర్లు గాయపడ్డారు. గాయాల బారిన పడకుండా ఈ సిరీస్‌లోని నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు కెప్టెన్‌ రహానే, పూజారా మాత్రమే! కెరీర్‌లో మూడో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుత్ను సిరాజ్‌ బౌలర్ల విభాగానికి నాయకుడు! నవదీప్‌ సైనీ, శార్థూల్‌ ఠాకూర్‌లకు ఇది రెండో టెస్ట్‌ మ్యాచ్‌. వాషింగ్టన్‌ సుందర్‌, నటరాజన్‌లకైతే మొదటి మ్యాచ్‌ ఇది! ఈ సిరీస్‌లో ఆడిన ఆస్ట్రేలియా బౌలింగ్‌ విభాగం అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌లో పడగొట్టిన మొత్తం వికెట్ల సంఖ్య 1033 అయితే, భారత బౌలర్లు అందరు కలిసి తీసిన వికెట్లు కేవలం 13! ఆడిలైడ్‌లో జరిగిన మొదటి టెస్ట్‌ రెండవ ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే చాప చుట్టేసి, విశ్వవ్యాప్తంగా అవహేళనలకు గురైన భారత జట్టు పది రోజుల్లోనే రెండో టెస్ట్‌లో విజయం సాధించడమేమిటి? దిగ్గజ బౌలర్లు వేసే బంతులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అశ్విన్‌, హనుమ విహారీ, పూజారిలు మూడవ టెస్ట్‌ను గెలుపంతటి డ్రా చేయడమేంటి? కీలకమైన నాల్గవ టెస్ట్‌లో సాకారమైన చిరకాలపు స్వప్నం చెప్పేదేమిటి? క్రికెట్‌ మన దేశంలో కోట్లాది రూపాయలు ఆర్జించి పెట్టే సాధనంగా మారడానికి ఐపిఎల్‌ దోహదం చేసింది. అదే సమయంలో డజన్ల కొద్దీ కొత్త క్రీడాకారులను, వారి ప్రతిభను వెలుగులోకి తెచ్చింది. అదే ఈ రోజు విజయాన్ని తెచ్చిపెట్టింది.


సువిశాలమైన మన దేశంలో అవకాశాలు రావాలే కాని చెలరేగిపోయే చిచ్చరపిడుగులు ప్రతి చోటా ఉన్నారు. కావాల్సిందల్లా వారిని గుర్తించి ప్రతిభకు సానపెట్టి, అవకాశాలు కల్పించి ప్రోత్సహించడమే. ప్రైవేటు రంగం లాభాలొచ్చే చోట మాత్రమే ప్రవేశిస్తుంది. కాని అటువంటి అవకాశాలు లేని క్రీడల మాటేమిటి? ప్రభుత్వం తన బాధ్యతగా వాటిని ప్రోత్సహించాలి. అదే జరిగితే మన జాతీయ క్రీడ హాకీ ఎక్కడుందా అని దుర్బిణి వేసి వెతుక్కోవాల్సిన దుస్థితి ఉండేది కాదు. ఇతర క్రీడలూ వర్థిల్లేవి! కానీ, మన పాలక వర్గాలకు, ప్రభుత్వాలకు ఇవేమి పట్టవు! అంతర్జాతీయ యవనికపై సత్తా చాటాల్సిన యువత ఊసురోమని, నిర్వీర్యం అవుతుంటే ప్రభుత్వాలు మాటలు చెబుతూ కోటలు దాటిస్తున్నాయి. నవతరాన్ని విజయ తీరాలకు నడిపించే సమగ్ర క్రీడా విధానమే ఇప్పటి జాతి తక్షణావసరం! అదే మేధో వికాసానికీ బాటలు వేస్తుంది. ఆ దిశలో కార్యాచరణ లేకపోతే చారిత్రక విజయాలు కాగితాలకే పరిమితమై గతకాలపు ఘనతలుగానే మిగులుతాయి!