
చెన్నై : వన్డే ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీల్లో వ్యక్తిగత రికార్డుల గురించి ఆలోచించ వద్దని సహచర క్రికెటర్లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూచించారు. వ్యక్తిగత రికార్డులకు ఇది వేదిక కాదని వివరించారు. సమష్టిగా జట్టును విజయతీరాలకు చేర్చాలని పేర్కొన్నారు. ప్రతీ మ్యాచ్‌లోనూ జట్టును గెలిపించడంపైనే అందరూ దృష్టి సారించాలని చెప్పారు. కాగా, చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌కు తాము సిద్ధమైనట్లు రోహిత్ చెప్పారు. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలలో ఒత్తిడి ఉండడం సహజమేనని చెప్పారు. అయితే, వాటిని ఎదుర్కొని నిలిచే సత్తా టీమిండియాకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. జట్టులోని ప్రతీ సభ్యుడూ ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొని వచ్చిన వారేనని వివరించారు. ఫస్ట్ మ్యాచ్ లో ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లతో ఆడాలని భావిస్తున్నట్లు రోహిత్ శర్మ వివరించారు. అయితే, పిచ్ పరిస్థితిని బట్టి తుది నిర్ణయం తీసుకుంటామని రోహిత్ స్పష్టం చేశారు.