Jul 28,2023 20:55
  • అన్యాయంపై జగన్‌ ఎందుకు మాట్లాడటం లేదు
  • రాయలసీమ పరిరక్షణ సమితి కన్వీనర్‌ బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రాయలసీమ పరిరక్షణ సమితి కన్వీనర్‌ బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నాడిక్కడ జంతర్‌ మంతర్‌లో రాయలసీమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సేవ్‌ రాయల సీమ పేరుతో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. రాయలసీమకు ఐకానిక్‌ బ్రిడ్జ్‌ అవసరం లేదని, బ్యారెజ్‌ అవసరమని పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న అప్పర్‌ తుంగభద్ర డ్యాముల నిర్మాణాన్నిఅడ్డుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇది రాయలసీమకే కాదని, తెలంగాణకు కూడా నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై జగన్‌ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాయలసీమ ప్రజలకు కావాల్సింది నీళ్లు, నిధులు, నియామకాలని అన్నారు. ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో రాయలసీమ యువత పిజిలు చేసీ కూడా హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబాయిలకు వెళ్లి మట్టిపనులు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతం నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినా రాయలసీమకు ఒరిగిందేమీ లేదన్నారు. తుగ్లక్‌ అయినా కొన్ని మంచి పనులు చేసారని, కానీ ప్రస్తుత సిఎం వ్యవహరిస్తున్న తీరు దారుణమని అన్నారు. రాయలసీమలో హైకోర్టు అన్నారని, అయితే అక్కడ కుర్చీ కూడా లేదని విమర్శించారు. విదర్భ, రాజస్థాన్‌ కంటే ఘోరమైన పరిస్థితి రాయలసీమలో ఉందని అన్నారు. వైఎస్‌ జగన్‌కు శ్రీబాగ్‌ ఒప్పందం.. అందులో ఏం అంశాలు ఉన్నాయో తెలుసా? అని ప్రశ్నించారు. సినిమా వాళ్ళ వల్ల కూడా రాయలసీమ నష్టపోయిందని, కొండారెడ్డి బూరుజు దగ్గర రంగు డబ్బాలు జల్లి రక్తపాతం అంటూ సినిమాలు తీశారని విమర్శించారు.