May 29,2023 15:43
  • ఎటువంటి షరతులు లేని వేతన ఒప్పందం  వెంటనే చేయాలి.
  • ఎఓబి వద్ద సబ్‌కమిటీ రిపోర్టు దగ్దం 

ప్రజాశక్తి-విశాఖ : పోర్టు ఎఓబి వద్ద ఐపిఎ సబ్‌`కమిటీ రిపోర్టును సిఐటియు పోర్టు యూనియన్స్‌ను (యూనైటెడ్‌ పోర్టు & డాక్‌ పాంప్లాయీస్‌ యూనియన్‌, విడిఎల్‌బి డాక్‌ వర్కర్స్‌ యూనియన్‌) ఆధ్వర్యంలో దగ్దం చేయడం జరిగింది. సిఐటియు జిల్లా కార్యదర్శి బి.జగన్‌ మాట్లాడుతూ ద్వైపాక్షిక వేతన సంప్రదింపుల కమిటీలో యాజమాన్యం నుండి 13మంది, ట్రేడ్‌ యూనియన్‌ నుండి 13 మంది ఉంటారు. మేజర్‌పోర్టులో పనిచేస్తున్న కార్మికులకు ధరల పెరుగుదలకు అనుకూలంగా ఎంత జీతం ఉండాలో నిర్ణయం చేస్తారు. అటువంటి కమిటీని కాదని ఐపిఎ యాజమాన్యం 5గురు సభ్యులతో సబ్‌`కమిటీ వేసారు. దీనిలో కార్మికుల పక్షనా లేకుండా యాజమానులతోటే ఈ సబ్‌` కమిటీ వేయడం చట్ట వ్యతిరేకం. అలాగే సబ్‌ కమిటీల పేరుతో 2022 జనవరి 1 నుండి అమలు అవ్వలసిన వేతన ఒప్పందాన్ని వాయిదాలు వేస్తున్నారు. బిజెపి మోడీ ప్రభుత్వం మాట్లాడితే ఒకే దేశం. ఒకే భాష, అన్ని ఒకటే ఉండాలని అదే దేశభక్తి అని చెబుతున్నారు. మేజర్‌పోర్టుల్లో ఏ పోర్టుకి ఆ పోర్టు వేతన ఒప్పందం చేసుకోమని కేంద్ర మంత్రి సిఫార్స్‌లు చేసారు. ఇదే నా దేశభక్తి అంటే. బయటకు చెప్పేది ఒకటి అమలు చేసేది ఒకటి అనే విధంగా బిజెపి విధానాలు కనిపిస్తున్నాయి. మే 29వ తేదీ సోమవారం ఉదయం 10:30 గంటలకు బైపార్టైట్‌ వేజ్‌ నెగోషియేషన్‌ కమిటీ(BWNC) ముంబై పోర్ట్‌ అథారిటీలో జరుగుతుంది. ఈ సందర్భంగా షరతులు లేని వేతన ఒప్పందం సత్వరం చేయాలని, 01-01-2022 నుండి అమలయ్యే కొత్త వేతన ఒప్పందంపై మేజర్‌ పోర్టుల్లో నున్న ఫెడరేషన్లన్నీ చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌ ఐపిఏకి సమర్పించడం జరిగినది. ఈ చాప్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌ పై ఐపీఎ చైర్మన్‌ ఒక సబ్‌ కమిటీని నియమించింది. ఆ సబ్‌ కమిటీ క్లాసు త్రీ క్లాస్‌ ఫోర్‌ కార్మిక ఉద్యోగులకు వ్యతిరేకంగా కొన్ని తీవ్రమైన సిఫార్సులు చేస్తూ ప్రభుత్వానికి సూచించడం జరిగింది. ఆ సిఫార్సులు అసమంజసమైనవి. మేజర్‌ పోర్టులో క్లాస్‌ త్రీ క్లాస్‌ ఫోర్‌ ఉద్యోగుల ప్రయోజనాలకు అత్యంత హానికరం. అవి అమలైనట్లయితే ప్రస్తుతం పొందుతున్న వేతనాలు గాని బేసిక్లు గాని హెచ్‌ఆర్‌ఎ గానీ డీఏలు గాని ఏవి కూడా పెరగవు సరి కదా ప్రస్తుతం పొందుతున్నది కూడా తగ్గే ప్రమాదం ఉంది. ప్రస్తుతం 2022లో చేయాల్సిన వేతన ఒప్పందం క్లాస్‌-I, క్లాస్‌-II ఆఫీసర్లతో 2027లో చేసే ఆలోచన చేస్తున్నది కేంద్ర బిజెపి ప్రభుత్వం. ఈ సబ్‌ కమిటీ రాజ్యాంగ విరుద్ధం. ఇండస్ట్రియల్‌ డిస్ప్యూట్స్‌ యాక్ట్‌ 1947ని ఉల్లంఘించడమే. ఈ కార్యక్రమంలో యునైటెడ్‌పోర్టు డాక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి కె.సత్యనారాయణ,  సిహెచ్‌.త్రినాధ్‌, రెడ్డి, విడిఎల్‌బి డాక్‌ వర్కర్స్‌ యూనియన్‌(సిఐటియు) అధ్యక్ష, కార్యదర్శులు జె.సత్యనారాయణ, బి.లక్ష్మణరావు,  గణేష్‌, శంకరరావు తదితరులు పాల్గొన్నారు.