Jul 06,2022 07:00

వారు చెప్పిన విధంగా హింస, హింసను పుట్టిస్తుంది. కాబట్టి, రాజ్యం హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న నిరసనకారులను కఠినంగా శిక్షిస్తుంది. హింసాత్మక నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారని భావించబడే వారి నివాసాలను నేల మట్టం చేయడానికి రాజ్యం తన యంత్రాంగాన్ని బుల్డోజర్ల రూపంలో ఉపయోగించుకుంటున్నది. నిరసనకారులను గుర్తించడానికి చట్టాన్ని ఉపయోగిస్తూ, 'గుణపాఠం' చెప్పాల్సిన వారి జాబితాను తయారు చేస్తారు. 1984లో ఇందిరా గాంధీ హత్య తరువాత కూడా ఇదే వ్యూహాన్ని ఉపయోగించిన విషయాన్ని గమనించాలి. కానీ అప్పుడు దాన్ని మానవ సంహారం అన్నాం. ఇప్పుడు దీన్ని గుణపాఠం నేర్పడం అంటున్నారు.

షేక్‌స్పియర్‌ 'మెజర్‌ ఫర్‌ మెజర్‌' నాటకంలో ఆంజిలో ద్వారా నేటికీ ప్రతిధ్వనిస్తున్న ఒక సందర్భోచితమైన ప్రశ్న అడుగుతాడు. ''చెడ్డ పనికి పురికొల్పేవాడు పెద్ద తప్పు చేస్తాడా? లేక చెడ్డ పనికి పురిగొల్పబడేవాడు పెద్ద తప్పు చేస్తాడా?'' అని. హింసను ప్రేరేపించే వ్యక్తి నేరస్థుడని భారత సుప్రీంకోర్టు దేశద్రోహ నేర చట్టంపై స్పష్టత ఇచ్చింది. కాబట్టి, చెడ్డ పనికి పురికొల్పేవాడే పెద్ద తప్పు చేస్తున్నట్టు. నేడు మన చట్టాలు ఇస్తున్న వివరాల ప్రకారం, హింసాయుత ప్రేరేపణలు ఉన్నాయా లేవా అనేవి ముఖ్యం కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే మాత్రం దేశద్రోహ చట్టాన్ని మోపుతారు.
           కానీ, ప్రవక్త పైన పలుకుబడి ఉన్న జాతీయ నాయకులు హింసను ప్రేరేపించే నేరపూరిత వ్యాఖ్యలు చేసినప్పుడు, చట్టం సంక్లిష్టంగా మారుతుంది. ఈ కొత్త చట్టం హింసాయుత ప్రేరేపణలు చేసే వ్యక్తిని వదిలివేస్తుంది. కానీ, ప్రేరేపించబడేవారిని నేరస్థులుగా పరిగణిస్తుంది. వీరిని న్యాయమూర్తి శిక్ష విధించిన వెంటనే, నిర్బంధం లోకి తీసుకోవడం, ఆ వెంటనే వారి ఇళ్లను నిరంకుశంగా నేలమట్టం చేయించడం ఇప్పుడు బుల్డోజర్‌ న్యాయంగా మారింది.
         ఉల్లంఘనలకు పాల్పడే వారిపై పోలీసులు తీసుకునే చర్యలకు సంబంధించి భారత శిక్షా స్మృతిలో తగినన్ని నిబంధనలు ఉన్నాయి. కానీ, ప్రేరేపించే వ్యక్తులు పలుకుబడి ఉన్న వారైతే, చట్టం వారికి వర్తిస్తునట్లు కనపడ్డం లేదు. అందుకే 'గోలీ మారో' లాంటి రెచ్చగొట్టే పిలుపులను పూర్తిగా విస్మరించారు. అర్థం లేని, న్యాయ సమ్మతం కాని మూక దాడులకు పాల్పడిన వారికి పూలదండలు వేస్తున్నారు. మానవ సంహారం చేయాలనే పిలుపు నేడు నష్టదాయకమైన పరిస్థితులకు దారి తీస్తుంది. ప్రవక్తను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలపై కేవలం విమర్శలు చేయడం ఆశ్చర్యంగా ఉందా? ఒకవేళ అదే తగిన శిక్ష అనుకుంటే, దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రజలు నిరసన వ్యక్తం చేసే హక్కును వినియోగించుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. చిన్న చిన్న నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు వున్న వారిపైన దేశద్రోహ చట్టం కింద నేరాలు మోపుతున్నారు. స్వల్ప అదృష్టవంతులు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా) లాంటి తీవ్రవాద నిరోధక చట్టాల అధీనంలో ఉంటున్నారు. దురదృష్టవంతులు జాతీయ భద్రతా చట్టం, ప్రజా సంరక్షణా చట్టం కింద నిర్బంధంలో ఉంటున్నారు.
రాజ్యం చర్యలకు పూనుకున్నపుడు...
          నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో హింసకు దిగడం రాజ్యాంగ హక్కా? కచ్చితంగా కాదు. ఎటువంటి ఆయుధాలు లేకుండా శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి మాత్రమే మన రాజ్యాంగం అనుమతిస్తుంది. రాళ్ళు రువ్వడం, బహిరంగంగా ఇతరులను అవమానించే వ్యాఖ్యలకు అనుమతి ఉండదు. కారణాలేవైనా, నిరసన కార్యక్రమాలలో హింసను ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదు.
         కానీ, వారు చెప్పిన విధంగా హింస, హింసను పుట్టిస్తుంది. కాబట్టి, రాజ్యం హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న నిరసనకారులను కఠినంగా శిక్షిస్తుంది. హింసాత్మక నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారని భావించబడే వారి నివాసాలను నేల మట్టం చేయడానికి రాజ్యం తన యంత్రాంగాన్ని బుల్డోజర్ల రూపంలో ఉపయోగించుకుంటున్నది. నిరసనకారులను గుర్తించడానికి చట్టాన్ని ఉపయోగిస్తూ, 'గుణపాఠం' చెప్పాల్సిన వారి జాబితాను తయారు చేస్తారు. 1984లో ఇందిరా గాంధీ హత్య తరువాత కూడా ఇదే వ్యూహాన్ని ఉపయోగించిన విషయాన్ని గమనించాలి. కానీ అప్పుడు దాన్ని మానవ సంహారం అన్నాం. ఇప్పుడు దీన్ని గుణపాఠం నేర్పడం అంటున్నారు.
ప్రాథమిక హక్కులు
           హింసాయుత చర్యలకు పాల్పడే నిరసనకారులు కొంతమందికి స్వంత ఇళ్లు, స్వంత దుకాణాలు ఉన్నాయి. కానీ చాలా మందికి లేవు. ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగ్‌ రాజ్‌కు చెందిన కార్యకర్త జావిద్‌ మహమ్మద్‌ భార్యకు స్వంత ఇల్లు ఉండడమే శాపమైంది. గుణపాఠం చెప్పాలని అన్నట్లే, ముందుగా అతడ్ని అరెస్ట్‌ చేసి, రాజ్యాంగ ఉల్లంఘన ద్వారా ఆమె ఇంటిని నేల మట్టం చేశారు. కానీ, ఆశ్చర్యకరంగా ఉత్తరప్రదేశ్‌ కోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు రెండూ, నివాస గృహాలు కలిగి ఉండడాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణిస్తాయి. ఉత్తరప్రదేశ్‌ లోని 'ఆవాస్‌ వికాస్‌ పరిషత్‌' వర్సెస్‌ 'ఫ్రెండ్స్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ లిమిటెడ్‌' (1996) కేసులో-నివాస గృహం కలిగి ఉండడం ఒక ప్రాథమిక హక్కు. రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 19(1) (ఈ) ద్వారా ఇంటిని కలిగి ఉండడం ప్రాథమిక హక్కు. ఆర్టికల్‌ 21 ద్వారా జీవించే హక్కు కలిగి ఉండొచ్చు-అని తీర్పు చెప్పింది. చమేలీ సింగ్‌ వర్సెస్‌ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం (1996) కేసులో జీవించే హక్కుకు అవసరమైన నివాసాన్ని కలిగి ఉండే హక్కును ప్రాథమిక హక్కుగా తీర్పు ఇచ్చింది.
         రాజ్యాంగ ఉల్లంఘనను రాజ్యం ఎలా సమర్థిస్తుంది? జావీద్‌ ఇల్లు అక్రమంగా నిర్మించారు. దానిని కూల్చుతామని నోటీసు (గోడకు అంటించడం) అందించాం. చట్ట ప్రకారం ఇచ్చిన అవకాశాన్ని ఆయన వినియోగించుకోలేదు- అని ప్రభుత్వం చెప్తోంది. వివిధ కారణాల రీత్యా ప్రభుత్వాన్ని విశ్వసించడం కష్టం.
చట్ట విరుద్ధమైన అంశాలు
         ఒకటి-ప్రభుత్వం, అక్రమంగా నిర్మించిన జావీద్‌ ఇంటిపై పన్నును వసూలు చేసింది. ఇంటి అక్రమ నిర్మాణాన్ని చూసీ చూడనట్లుగా ఉన్నారా? అది కాకుంటే, అక్రమ నిర్మాణంలో, దాని ద్వారా ఆదాయం పొందడంలో ప్రభుత్వ భాగస్వామ్యం లేదా? దానికి సహకరించిన అధికారులపై ఏమైనా చర్యలు తీసుకున్నారా?
           రెండు-ప్రభుత్వ చర్య న్యాయమైనది, సహేతుకమైనది అనుకుంటే, ఎటువంటి అత్యవసరం లేకుంటే జావీద్‌కు విచారణకు మరొక అవకాశం ఇవ్వాల్సింది. బహుశా అతడు పట్టణంలో ఉండకపోవచ్చు లేదా అనారోగ్యానికి గురై ఉండవచ్చు. అతనికి మరొక అవకాశాన్ని ఎందుకు నిరాకరించారు?
            మూడు-జావీద్‌ ఇంటిని ప్రభుత్వ సెలవుదినమైన ఆదివారం రోజున నేలమట్టం చేశారు. ఆఖరికి జాతీయ భద్రతా చట్టం కేసులకు సంబంధించిన విచారణ కూడా సుప్రీంకోర్టు ఆదివారం రోజున మినహాయింపు ఇస్తుంది. ఒకవేళ ప్రభుత్వం ఆదివారం రోజు పని చేస్తే మంచిది కూడా. కానీ ప్రభుత్వ సెలవుల ప్రయోజనాలను, సమర్థవంతమైన ప్రభుత్వం జావీద్‌కు అందించలేక పోయిందా? మనం వాస్తవిక దృష్టితో ఉండాలి.
             నాలుగు-ఇంటి కూల్చివేత ఉత్తర్వులను శనివారం రాత్రి జావీద్‌ ఇంటి గోడకు అంటించారు. ఆదివారం ఉదయం ఇంటిని కూల్చివేశారు. కూల్చివేత నిర్ణయం సరైనది కాదని కోర్టులో సవాల్‌ చేసే అవకాశం...అతనికి గానీ, అతని భార్యకు గానీ ఇవ్వలేదు. ఇది న్యాయబద్ధమా? న్యాయ సమ్మతమా? సహేతుకమా?
          ఐదు-ఢిల్లీకి చెందిన ఇద్దరు నివాసితులను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు కొట్టి, ఎటువంటి ఆరోపణలు లేకుండానే దాదాపు రెండు నెలల పాటు జ్యుడీషియల్‌ కస్టడీకి పంపిన కేసును ఢిల్లీ హైకోర్టు తేల్చింది. సంబంధిత పోలీసు అధికారులు కోర్టు ముందు తప్పుడు ప్రకటనలు చేసి, దర్యాప్తు చేయడానికి హైకోర్టు ఏర్పరచిన ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు కూడా తప్పుడు పత్రాలను సమర్పించారని ఉత్తరప్రదేశ్‌ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ అంగీకరించారు. జావీద్‌ కేసు విషయంలో కూడా ఇదేవిధమైన ప్రకటనలు, పత్రాలు సృష్టించి ఉండి ఉండవచ్చు.
బాధ్యత అవసరం
          దీనికి పరిష్కారం ఏమిటి? ఒకటి-జావీద్‌ తన ఇంటిని తిరిగి కట్టుకునే విధంగా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. రెండు-అతనికి, అతని కుటుంబానికి మానసిక క్షోభ కలిగించినందుకు కూడా ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. మూడు- అన్ని స్థాయిల్లో సంబంధిత అధికారులు బాధ్యత వహించాలి. వారికి శిక్ష విధించడం ద్వారా తగిన గుణపాఠం నేర్పాలి. జవాబుదారీ న్యాయ వ్యవస్థ తాలూకు శాస్త్రీయత భారతదేశంలో పాతుకుపోవాలి. శిక్ష నుండి మినహాయింపు పొందే సంస్కతిని రద్దు చేయాలి. నాలుగు- ఎటువంటి చెడు చూడని, చెడు వినని, మంచి చేయని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను వెంటనే రద్దు చేయాలి.

                              బుల్డోజర్‌తో గుణపాఠం నేర్పుతారట      మదన్‌ బి. లోకుర్‌      ('ద హిందూ' సౌజన్యంతో)

(భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్‌ మదన్‌ బి. లోకుర్‌ ప్రస్తుతం ఫిజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.)