Jun 10,2023 07:38

గంగారం అనే గ్రామంలో ఎల్లయ్య అనే రైతు ఉన్నాడు. అతనికి ఐదెకరాల పొలం ఉంది. అతడికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రవి పొలం పనులు చేస్తాడు. ఎప్పుడూ ఏదో ఒక కొత్త మొక్క నాటుతూ ఉంటాడు. రవికి పెళ్లి అయింది. ఒక కొడుకు, ఒక పాప పుట్టారు. ఎల్లయ్య చిన్న కొడుకు రాజు. తను ఇంట్లో ఉన్న గేదెలను మేపుతూ ఉంటాడు. వాటి ద్వారా వచ్చిన పాలను అమ్ముకుంటూ డబ్బు సంపాదించాడు. పాల వ్యాపారం బాగా సాగేది. రాజుకి కూడా పెళ్ళి అయింది. ఇద్దరు కొడుకులు. కొన్ని రోజుల తర్వాత రవి, రాజు కుటుంబాలు వేరు పడ్డాయి. ఎల్లయ్య, ఇద్దరు కొడుకులకు చెరి సగం పొలం పంచి ఇచ్చాడు. కొడుకులు ఇల్లును కూడా పంచుకుని ఎల్లయ్యకు రేకుల ఇల్లు కట్టించి ఇచ్చారు.
           కొన్ని నెలల తర్వాత రాజు తనకు ఇంకా ఎక్కువ భూమి రావాలని అన్నతో గొడవ పడ్డాడు. గొడవలు పెద్దవి కావడంతో ఎల్లయ్యకు బాధ కలిగింది. ఓ రోజు ఆలోచిస్తూ గుండెపోటుతో చనిపోయాడు. తరువాత భూవివాదంలో రవి, రాజు కోర్టుకెళ్లారు. పదేళ్ళయింది. ఇంకా తీర్పు రాలేదు. లాయర్ల ఖర్చుల కోసం చెరి ఎకరం పొలం అమ్మారు. ఓరోజు అన్నదమ్ములు రవి, రాజు మాట్లాడుకున్నారు. తమ గొడవ తామే పరిష్కరించుకోవాలనుకున్నారు. బుద్ధి తెచ్చుకుని తమ తప్పు తెలుసుకుని కలిసిపోయారు.
 

- దాసరి ప్రసన్న కుమార్‌
ఏడవ తరగతి
జక్కాపూర్‌, సిద్దిపేట జిల్లా