
- వెల్లడించిన ఉపగ్రహ డేటా
బ్రసీలియా : బ్రెజిల్ అధ్యక్షుడిగా లూలా డసిల్వా బాధ్యతలు చేపట్టిన ఆరు మాసాల్లో అమెజాన్ అడవుల నరికివేత 33శాతం తగ్గిందని ప్రభుత్వ ఉపగ్రహ డేటా తెలిపింది. గత నాలుగేళ్ళుగా బ్రెజిల్‌లోని అమెజాన్ ప్రాంతంలో అడవుల నరికివేత బాగా పెరిగింది. అయితే లూలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మారిందని అధికారులు తెలిపారు. గురువారం ఈ డేటాను విడుదల చేశారు. జనవరి నుండి జూన్ వరకు ఆరు మాసాల కాలంలో అడవుల క్షీణత 2500 చదరపు కిలోమీటర్ల నుండి 1023 చదరపు మైళ్లకు తగ్గిందని వార్తలు వెలువడ్డాయి. మాజీ అధ్యక్షుడు జేర్ బోల్సనారో హయాంలో అయితే ఈ ఈ విస్తీర్ణం 2500 చదరపు మైళ్ళుగా వుంది. ప్రస్తుతానికి పరిస్థితులను మార్చగలిగామని, అడవుల నరికివేతను బాగా తగ్గించగలిగామని పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యనిర్వాహక కార్యదర్శి జోవో పాలో చెప్పారు. ఇది వాస్తవం, అడవుల నరికివేత తగ్గుతోందని చెప్పారు. అయితే రాబోయే మాసాల్లో ఇంకా పలు సవాళ్లు ఎదుర్కొనాల్సి వున్నాయని, అవి కూడా పూర్తయితే పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడవుతాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ డేటా ప్రోత్సాహకరంగా వుందన్నారు. గత 15ఏ్ళలో ఎన్నడూ లేనిస్థాయిలో ప్రస్తుతం మెరుగైన పరిస్థితి నెలకొందన్నారు.