Jun 30,2023 13:03
  • బహుళ ధ్రువ ప్రపంచం సాకారం దిశగా అడుగులు
  • బ్రిక్స్‌ సదస్సుకు ముందు మిత్రకూటమి ఏర్పాటుకు సన్నాహాలు

బ్రెసిలియ : ఈ సంవత్సరారంభంలో బ్రెజిల్‌ అధ్యక్షునిగా ఎన్నికైన వర్కర్స్‌ పార్టీ నేత లూయిజ్‌ ఇనాషియో లూలా డిసిల్వా తాను గత రెండుసార్లు అధికారంలో ఉన్నప్పటిలా (2003-2010) క్రియాశీల విదేశాంగ విధానాన్ని అనుసరిస్తున్నారు. బోల్సొనారో పాలనలో అనేక సంవత్సరాలుగా ఒంటరిగా మిగిలిపోయిన బ్రెజిల్‌ ఇప్పుడు అంతర్జాతీయ యవనికపైకి 'బ్రెజిల్‌ పునరాగమనం' అనే నినాదంతో ముందుకు వచ్చింది.
         అమెరికా, చైనా, ఫ్రాన్స్‌లతో సహా పది దేశాల్లో పర్యటించిన లూలా అమెరికా, ఐరోపాల ఆధిపత్యాన్ని అధిగమించటానికి 'బహుళ ధ్రువ ప్రపంచం' ఆవిర్భవించటమే ఏకైక మార్గమని చెబుతున్నారు. తన ప్రయత్నంలో భాగంగా మే 30న బ్రాసిలియాలో 12దక్షిణ అమెరికా దేశాల అధ్యక్షుల, అధికారుల సదస్సును నిర్వహించారు. ఇది 2008లో ఏర్పాటైన దక్షిణ అమెరికా దేశాల యూనియన్‌ను పోలివుంది. ఇది అప్పటి వామపక్ష ప్రభుత్వాల కృషితో ఏర్పడింది. గత దశాబ్దం ద్వితియార్థంలో లాటిన్‌ అమెరికాలో ప్రగతి నిరోధక ప్రభుత్వాలు ఏర్పడటంతో ఈ యూనియన్‌ నిర్వీర్యమైంది. ఆ తరువాత అర్జంటీనా, కొలంబియావంటి దేశాల్లో వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత ఈ యూనియన్‌ తిరిగి ఊపిరిపోసుకుంది.
       అయితే ఈ దక్షిణ అమెరికా దేశాల యూనియన్‌ పున్ణప్రతిష్ట చేయటానికిగల ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు 15సంవత్సరాల క్రితంకంటే పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. 21వ శతాబ్దం ఆరంభంలో లాటిన్‌ అమెరికా దేశాలు చైనాతో వాణిజ్య సంబంధాలు పెట్టుకుని బాగా లాభపడ్డాయి. కోవిడ్‌ మహమ్మారి కారణంగా నేటి దక్షిణ అమెరికాలో సామాజిక అసమానతలు తీవ్రంగా పెరిగాయి. అంతేకాకుండా అమెరికా, నాటో దేశాల దన్నుతో నడుస్తున్న ఉక్రెయిన్‌ యుద్ధంవల్ల ఈ ప్రాంతంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ ఒత్తిడులు ఎక్కువయ్యాయి. దక్షిణ అమెరికాలోని ప్రతి దేశాధ్యక్షులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. సైన్యంతో ఘర్షణ పడుతున్నారు. చైనాతో, కొంతవరకు రష్యాతో కూడా తమకున్న వాణిజ్య సంబంధాలను కొనసాగించటానికి అడ్డంకిగావున్న సామ్రాజ్యవాదాన్ని అధిగమించటానికి నానా తంటాలు పడుతున్నారు.
        దక్షిణ అమెరికా దేశాల యూనియన్‌ ''గ్లోబల్‌ సౌత్‌''గా పిలువబడే అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ప్రతిబింబిస్తుందని లూలా అన్నారు. లూలా అవగాహనలో ఇది సంపన్న దేశాలకు ఉపయోగపడే ప్రస్తుతమున్న ప్రపంచ వాణిజ్య సంస్థవంటి 'గ్లోబల్‌ పాలనా ఫోరమ్‌ల'కు భిన్నమైనది. లాటిన్‌ అమెరికా 4ట్రిల్లియన్‌ డాలర్ల(ఒక ట్రిల్లియన్‌ 1000 బిలియన్లు. ఒక బిలియన్‌ 100కోట్లు) ఆర్థిక వ్యవస్థ. ఈ దేశాల జనాభా 45కోట్లు. కావలసినన్ని సహజవనరులు, పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన ఖనిజ సంపద ఈ దేశాల్లో ఉన్నాయి. ''మారుతున్న ప్రపంచం''లో దక్షిణ అమెరికా తనదైన పాత్రను పోషించటానికి ఇది చాలని లూలా అభిప్రాయపడుతున్నారు.
         బ్రిక్స్‌ బ్యాంకు పేరుతో పిలువబడుతున్న న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు(ఎన్‌డిబి) వార్షిక సమావేశం జరుగుతున్న నేపథ్యంలో బ్రెజిల్‌లో దక్షిణ అమెరికా దేశాల సదస్సు జరిగింది. బ్రిక్స్‌ దేశాల వార్షిక సమావేశం ఆగస్టు నెలలో దక్షిణ ఆఫ్రికాలో జరగనుంది. ఈ బ్రిక్స్‌ వార్షిక సమావేశంలో బ్రిక్స్‌ దేశాలకు ఒకే ఒక కరెన్సీని ఏర్పాటుచేసుకోగలిగే సాధ్యత గురించి చర్చ జరుగుతుంది. ఇది అమెరికన్‌ డాలర్‌కు ప్రత్యామ్నాయ పాత్రను పోషించటంవల్ల వివిధ దేశాల మధ్య వాణిజ్య విస్తరణను వేగవంతం చేస్తుంది. బ్రిక్స్‌ లోను, ఎన్‌డిబిలోను సభ్యత్వాన్ని పెంచటానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికే అనేక దేశాలు బ్రిక్స్‌ లో చేరటానికి సిద్దంగా ఉన్నాయి.
         ఒకవైపు అమెరికా ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపకుండా దీర్ఘకాలం కొనసాగేలా చేయటానికి ప్రయత్నించటాన్ని, మరోవైపు తైవాన్‌ సమస్యపైన చైనాను పదేపదే రెచ్చగొట్టటాన్ని చూస్తుంటే లాటిన్‌ అమెరికాను తన కబంధ హస్తాలనుంచి అమెరికా అంతతేలికగా చేజారనీయదనేది సుస్పష్టం. ఏదో ఒక ప్రళయాన్ని స్రుష్టించకుండా అంత తేలికగా అమెరికా తన ఆధిపత్యాన్ని(ఏక ధ్రువ ప్రపంచం) వదులుకుని 'బహుళ ధ్రువ ప్రపంచం' ఆవిర్భవించటాన్ని చూస్తూ ఊరుకోదు. గత శతాబ్దంలో సంభవించిన రెండు ప్రపంచ యుద్ధాల కష్టనష్టాల నుంచి తప్పించుకున్న దక్షిణ అమెరికా ఈ శతాబ్దంలో జరుగుతున్న సామ్రాజ్యవాద యుద్ధాల పర్యవసానాలను తప్పించుకోజాలదు. అయితే ఈ శతాబ్దంలో జరిగిన, జరుగుతున్న యుద్ధాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను సంక్షుభితం చేయటంతోపాటుగా ప్రపంచం మీద అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని బలహీనపరుస్తున్నాయి. అదే దక్షిణ అమెరికా స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు ఆశాకిరణం అవుతుంది.