
బ్రసీలియా : ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ జూలియన్ అసాంజేకి రాజకీయ ఆశ్రయం కల్పించాలంటూ సుమారు 2,900 మందితో కూడిన పౌర సమాజం ఆ దేశ అధ్యక్షుడు లూలా డ సిల్వాకు బుధవారం లేఖ రాసింది. అసాంజేకు మద్దతు ప్రకటించాలని తాము కోరుకుంటున్నట్లు .రాజకీయ నేతలు, శాస్త్రవేత్తలు, మేథావులు, సామాజిక సంస్థల నేతలు, జర్నలిస్టులు, అధ్యాపకులు, యూనియన్ల నేతలు ఆ లేఖలో పేర్కొన్నారు. కమ్యూనిస్ట్ శాసనసభ్యురాలు జండిరా ఫెఘాలి, న్యూరాలజిస్ట్ సిదర్తా రిబీరో, మ్యూజిషియన్ జాక్వస్ మెరోలంబమ్, శాస్త్రవేత్త ఎన్నియో కాన్డొట్టి, మాజీ మంత్రులు రెనాటో రిబిరో, అనాడి హోలాండా, సెర్గియా మచాడో, జోస్ గెమ్స్ టెంపోరవో సహా సుమారు 2,900 మంది ఆ లేఖపై సంతకం చేశారు. వీలైనంత త్వరగా జూలియన్ అసాంజేకి రాజకీయ ఆశ్రయం కల్పించేందుకు బ్రెజిల్ చట్టపరమైన, దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. పత్రికా స్వేచ్ఛకు భరోసా ఇచ్చినందుకు మరియు ప్రపంచవ్యాప్తంగా అమెరికా చేపట్టిన మావన హక్కుల ఉల్లంఘనలను బహిర్గతం చేసినందుకు అసాంజే జైలు పాలయ్యాడంటూ పలు సందర్బాల్లో లూలా పేర్కొన్నారని గుర్తుచేశారు.
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించాలనే నిర్ణయాన్ని బ్రిటన్ కోర్టు ఆమోదిస్తే... అమెరికా గురించి వాస్తవాలను వెల్లడించినందుకు అసాంజే 175 ఏళ్ల జైలుశిక్షను ఎదుర్కోవాల్సి వుంటుంది.
బ్రిటన్ నుండి ఆశ్రయం ఆమోదం పొందేందుకు లూలా బ్రెజిల్, రష్యా, భారత్, చైనా మరియు దక్షిణాఫ్రికాలతో పాటు జి 20 దేశాల్లో ప్రచారాన్ని చేపట్టాలని వారు ప్రతిపాదించారు. ఫలితం ఏదైనప్పటికీ..అసాంజేను రక్షించేందుకు చేసే యత్నం ప్రపంచంలో బ్రెజిల్ ప్రభుత్వ మానవతా మరియు ప్రగతిశీల వైఖరిని మరింత హైలెట్ చేస్తుందని తాము విశ్వసిస్తున్నామని వారు ఆ లేఖలో ఉద్ఘాటించారు. పోప్ ఫ్రాన్సిస్, నటుడు లియోనార్డో డికాప్రియో, నోబెల్ బహుమతి పొందిన సాహితీవేత్త అడాల్ఫో పెరెజ్ ఎస్క్వివెల్ వంటి ప్రపంచ ప్రముఖుల మద్దతుతో బ్రెజిల్ ప్రభుత్వం ప్రత్యక్షంగా బ్రిటన్ ప్రభుత్వానికి పిటిషన్ సమర్పించే అవకాశం ఉంది.
ఇరాక్, ఆప్ఘనిస్తాన్‌లలో అమెరికా చేపట్టిన యుద్ధ నేరాలను బహిర్గతం చేయడంతో వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే 2010లో అరెస్టైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లండన్ జైలులో ఉన్నారు.