Jul 30,2023 20:37

ప్రజాశక్తి-పోలాకి : సముద్రంలో పడవ బోల్తా పడి మత్స్యకారుడు మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి తోటి మత్స్యకారుల కథనం ప్రకారం... పోలాకి మండలం గుప్పిడిపేటకు చెందిన సిరిగిడి కామయ్య (51) చెక్క ఎర్రయ్య, రట్టి రాజయ్య, కర్రి సింహాచలం కలిసి సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. కొంతదూరం వెళ్లాక రాకాసి అలల ఉధృతికి పడవ బోల్తా పడడంతో నలుగురూ నీటిలో పడిపోయారు. ఎర్రయ్య, రాజయ్య, సింహాచలం ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. కామయ్య రాకపోవడంతో తిరిగి ఈదుకుంటూ పడవ దగ్గరకు వెళ్లారు. బోల్తా పడిన పడవను మామూలు స్థితికి తీసుకొచ్చారు. పడవ కింద కామయ్య విగతజీవిగా పడి ఉన్నాడు. ఆయన మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. కామయ్యకు భార్య రమణమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.