Nov 06,2022 06:49

వారం వారం శీర్షికలో ఒకే విషయం మీద వరుసగా రెండోవారం రాయడం అరుదుగానే జరుగుతుంది. గుజరాత్‌, హిమాచల్‌ ఎన్నికలతో సహా అనేక విషయాలను స్పృశించవలసి వుంది కూడా. అయినా ఈ వారం మనం హైదరాబాద్‌ ఆపరేషన్‌ ఫాంహౌస్‌, దానిపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ విడుదల చేసిన ఆందోళనకర సమాచార సముద్రం, బోనులో చిక్కిన బిజెపి కేంద్ర రాష్ట్ర నేతలు కొనసాగిస్తున్న అర్థరహితమైన వాదనలు, దేశంపై వీటి ప్రభావం గురించి తక్కువ చేసి చెబుతున్న కొందరు మేధావుల విచిత్ర అంచనాలు, ఈ విషయాలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేస్తున్న హెచ్చరికలు, వీటి నేపథ్యంలో తరలి వస్తున్న ప్రధాని మోడీ పర్యటన రాజకీయాలు చెప్పుకోవలసి వస్తున్నది. ఈ మధ్యలోనే మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌ సంకేతాలూ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కలిపి చూస్తే బిజెపిని తక్కువ అంచనా వేసిన వారు గాని ఎక్కువ అంచనా వేసి దాని చుట్టూ పరిభ్రమిస్తున్న వారు గాని నేర్చుకోవలసిన పాఠాలు చాలా వుంటాయి. నేర్చుకోని వాళ్లకు నేర్పడం కోసం స్వయంగా ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్‌ షా దూతలే రావడం ఇక్కడం విశేషం. మరొకిరి భాష్యం, వివరణ లేకుండా బిజెపి బేహారులే చెప్పిపోయినా ఇంకా వారి తరపున వకాల్తా పుచ్చుకునేవారికి వక్రీకరించే వారికి లేదంటే తిప్పి తిప్పి మాట్లాడుతూ కెసిఆర్‌ దెబ్బతిన్నట్టు చూపించే వారు ఇంకా కనిపిస్తున్నారంటే మన వ్యవస్థలోనూ మీడియాలోనూ వారెంత లోతుగా వేళ్లూనుకున్నదీ తెలుస్తుంది. రాజకీయంగా ఆచరణాత్మకంగా సాంకేతికంగా మూడు కోణాల్లో చూడవలసిన ఈ అంశంపై కేవలం రాజకీయం గుప్పించడం, లేదంటే ఊరికే సాంకేతిక వాదనలతో తికమక చేయడం, అదీ కాదంటే ప్రజలు పట్టించుకోరని కొట్టిపారేయడం ఇలాంటి వారికి పరిపాటి.

  • దారి తప్పించే వాదనలు

గతంలో టిఆర్‌ఎస్‌లో చేరికలను పోటీ పెట్టి చూపడం వీరి మొదటి అస్త్రం. అలాగే ఎనిమిది రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చివేస్తే లేనిది ఇప్పుడు ఏమవుతుందని మరో సవాలు. చివరగా ఇవన్నీ కోర్టులో నిలవబోవని చప్పరించడం. ఏతావాతా వీటన్నిటి పరమార్థం ఒకటే. ఏమీ కాలేదు ఏమీ కాదు! గతవారం ఈ శీర్షిక రాసిన రోజునే మరో పత్రికాధిపతి కెసిఆర్‌ వెనుకంజ వేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు పిరికివాడు గనక కెసిఆర్‌కు లొంగిపోయాడని, కెసిఆర్‌ తమపై వచ్చిన లిక్కర్‌ స్కామ్‌ ఆరోపణల కారణంగా రాజీకి దీన్ని ఉపయోగించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పైగా అమిత్‌ షా వంటి వారికి సంబంధం వుందని నిరూపించడం కుదిరే పని కాదని కూడా తేల్చేశారు. ఇక్కడ జరిగింది రాజకీయంగా ఎవరి పనో ప్రతివారికీ అర్థమైంది. మరొకటి సాంకేతికంగా కోర్టులో ఏదో ఒరిగిపడుతుందని ఎవరూ అనుకోలేదు. కాకపోతే కెసిఆర్‌ భాగోతం మొత్తం భారతదేశానికి చేరుస్తానని ప్రకటించారు గనక తెలంగాణకో ఎ.పి కో పరిమితం కాబోదని మాత్రం స్పష్టమైంది. అయితే దాన్ని కూడా తక్కువ చేసి చూపడం ఏం నీతి? ప్రభావం వుండేది లేనిదీ తర్వాత, ముందు ఆ ప్రయత్నాన్ని స్వాగతించాలి కదా! అది కూడా జరక్కపోవడమే విచారకరం. పైతరగతులకు చెందిన వారి పల్టీలు, పిల్లిమొగ్గలు ఎలా వున్నా సామాన్య ప్రజలు, ప్రజాస్వామ్య ప్రియులు ఈ మొత్తం తతంగాన్ని అసహ్యించుకున్నారు గనకే మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లు వెల్లువెత్తారు. దాన్ని గెలిచి నెమ్మదిగా తెలుగునాట పాగా వేస్తామని బీరాలు పలికిన బిజెపి నేతలు ప్రచారానికే మొహం చాటేశారు. అగ్రనేతలు వెనక్కు మళ్లారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఏవీ బిజెపికి విజయం గాని భారీ ఓటింగు గాని వస్తుందని చెప్పలేకపోయాయి. పండితులు, పాలకులు ఏమంటున్నా సామాన్య ఓటర్లు సారాంశం సరిగ్గా గ్రహించారు గనకే ఇలా వుందనడం నిస్సందేహం. ఈ విషయంలో మీడియానే గాక ఉన్నత న్యాయస్థానం కూడా ఆశ్చర్యకరంగానే ప్రవర్తించింది. తెలంగాణ హైకోర్టులో ఇద్దరు ఏకసభ్య ధర్మాసన నాయ్యమూర్తులు రెండు రకాలుగా ఆదేశాలిచ్చారు. జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి బిజెపి వేసిన పిటిషన్‌ను స్వీకరించి దర్యాప్తును వాయిదా వేయాలని చెప్పగా జస్టిస్‌ సుమలత మాత్రం పోలీసుల పిటిషన్‌పై నిందితులను పద్నాలుగు రోజులు కస్టడీకి అనుమతించారు. ఇలా ఒకే కోర్టు నుంచి రెండు తీర్పులు రావడమేమిటని సుప్రీంకోర్టుకే సందేహం కలిగిందంటే భిన్న వ్యవస్థల పాత్ర అర్థమవుతుంది. సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్‌ గవాయి జస్టిస్‌ నాగరత్న ధర్మాసనం ఎవరో నిందితులను పట్టుకుంటే ఒక రాజకీయ పార్టీ (బిజెపి) పిటిషన్‌ వేయడమేమిటి వారికేం సంబంధం? దాన్ని ఎలా అనుమతించారు? అని ఆక్షేపించారు. మరోవైపున వారే సులభంగా బెయిలు ఇవ్వొచ్చు, మా దగ్గరికి వస్తే అప్పుడే ఇచ్చే వాళ్లం, కాకుంటే బిజెపి పిటిషన్‌ వేయడం వల్లనే కాస్త ఆలోచించవలసి వస్తున్నది అంటూ సోమవారానికి కేసు వాయిదా వేశారు. అంటే హైకోర్టును తప్పు పడుతున్నా సుప్రీంకోర్టు కూడా నిందితులను తక్షణం విడుదల చేయొచ్చనే వైఖరి తీసుకుంది.

  • ఆణిముత్యాలు..అసలు సత్యాలు..

టీవీ చర్చలలోనూ ఇతరత్రా చాలామంది ఈ ఆధారాలు కోర్టులో నిలబడతాయా అని సందేహాలు గుప్పించారు. కాగా కొందరు మాజీ పోలీసు అధికారులు హైకోర్టుకు ఇచ్చిన ఆధారాలు బయిట ఎలా విడుదల చేస్తారని కెసిఆర్‌పై విమర్శ ఎక్కుపెట్టారు. అంతేగాని కేసు తీవ్ర స్వభావం, పథకం ప్రకారం ఉచ్చులో చిక్కించడం, ఈ సంభాషణలను పత్రాలను బట్టి దేశంలో ఇతర చోట్ల జరిగిన జరుగుతున్న కుట్రలను విశ్లేషించడం ప్రధానమని భావించలేదు. ఎందుకంటే ఆ వీడియోలలో ఆడియోలలో పత్రాలలో వున్న ఆధారాలు మామూలువి కావు. రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్‌ల త్రయం దేశమే తమ చేతుల్లో వున్నట్టు మాట్లాడారు. తమకు నేరుగా ఆర్‌ఎస్‌ఎస్‌ కీలకమని మోడీ అయినా వారి అదుపాజ్ఞల్లో పని చేయాల్సిందేనని రాష్ట్రాల అధ్యక్షులు, నాయకులు లెక్కలోనే వుండబోరనీ కుండబద్దలు కొట్టి చెప్పారు. 24 మందితో కూడిన తమ ముఠా దేశమంతా తిరుగుతూ ఇప్పటికి 240 మందికి పైగా ఎంఎల్‌ఎలను కొనడం ఎనిమిది సర్కార్లను కూల్చడం జరిగిందని చెప్పేశారు. ఇప్పుడు తెలంగాణ, ఢిల్లీ తర్వాత రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌ తమ ఆపరేషన్ల జాబితాలో వున్నాయని ప్రకటించారు. కేరళలో రాహుల్‌ గాంధీపైన పోటీ చేసిన తుషార్‌ మోహన్‌, అమిత్‌ షా, బి.ఎల్‌ సంతోష్‌ల త్రయం మాత్రమే ఇవన్నీ పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు. ఆరెస్సెస్‌ రాక్‌స్టార్‌ అని మీడియా అభివర్ణించిన సంతోష్‌ బిజెపి ప్రభుత్వాధినేతలతోనూ ఎలా పెత్తనం చలాయిస్తారో మీడియా ఎప్పుడో కథలుగా రాసింది. అందులోనూ తుషార్‌ మాట్టాడిన మాటలు కూడా ఈ వీడియోలలో రికార్డయినాయి. ఇన్ని ఆధారాలు, తీవ్రమైన కుట్రలు ఒక్కసారిగా దొరికిపోయినా వాటిని కాకుండా కెసిఆర్‌ ఎత్తుగడల గురించి మాట్లాడేవారిని ఏమంటాం? పైగా దొరికిపోయిన ముగ్గురికి మాకు ఏ సంబంధం లేదని బిజెపి నేతలు బుకాయించడం మరీ హాస్యాస్పాదం. ఎందుకంటే వారితో సంబంధం లేకుంటే హైకోర్టులో అందరికన్నాముందు కేసు వేయాల్సిన అవసరమే లేదు. ఆ పిటిషన్‌లో ప్రతివాదులుగా ప్రభుత్వాన్ని పోలీసులను తప్ప ప్రధాని తరపున వచ్చామని ప్రకటించుకున్న ఈ ముగ్గురు ముఠాను చేర్చిందే లేదు. మరి నేరుగా బిజెపి, ఆరెస్సెస్‌ల తరపున సంచరిస్తున్నామని వారు చెప్పుకుంటే...మోసగాళ్లుగా వారిని బోనెక్కించాలి కదా? తమ దగ్గర అనేక ఐడీలు పాన్‌కార్డులు, వుంటాయని స్వయంగా చెప్పుకున్న ఆ టక్కరుల వెనక ఎవరున్నారో తేల్చాలి కదా? వారు మోడీ పేరు చెప్పుకుంటే పిఎంఓ రంగంలోకి రాలేదే? వీటిని బట్టి ఈ దళారులు ఎవరి మనుషులో తేలిపోవడం లేదా? బిజెపి కేంద్రం తరపున పరిశీలకుడుగా వచ్చే తరుణ్‌ చుగ్‌...కెసిఆర్‌ కూడా తమ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరులా తడిగుడ్డలతో ప్రమాణం చేయాలని సవాలు చేయడం ఎంత హాస్యాస్పదం? చాలామంది మేధావులు బిజెపి అనుకూల అవకాశవాద వ్యాఖ్యాతలు ఇవన్నీ ప్రశ్నించేబదులు టిఆర్‌ఎస్‌పైనే అస్త్రాలు, అనుమానాలు సంధించడం దారుణం. ఎక్కడో ఒకచోట దొంగలు పట్టుబడ్డారని సంతోషించే బదులు కోర్టులో నిలబడదు గనక ఇదంతా నిరర్థకమని తీసిపారేయడంలో కుటిలత్వం తొంగిచూస్తుంది.

  • చరిత్ర చెప్పే సత్యం

ప్రజలు ఇలాంటివి పట్టించుకోరని కొట్టిపారేసేవారు దక్షిణ భారతదేశంలో నాటి కాంగ్రెస్‌ నేటి బిజెపి ఎలా దెబ్బతినిపోయాయో మర్చిపోతుంటారు. దేశంలో మొదటిసారి కేరళలో నంబూద్రిపాద్‌ ప్రభుత్వాన్ని కూల్చిన కాంగ్రెస్‌ వరుసగా పాలన సాగించలేకపోయింది. పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టు ఐక్య సంఘటనలను కూల్చిన కాంగ్రెస్‌ అక్కడ అసలే అధికారంలోకి రాలేకపోతోంది. తమిళనాడులో డిఎంకె సర్కారును రద్దు చేసిన పాపానికి ఇంతవరకూ జాతీయ పార్టీలు కాలూనలేకపోతున్నాయి. ఎన్టీఆర్‌ను కూల్చిన కాంగ్రెస్‌ పదేళ్లు మాత్రమే పాలించి ఇప్పుడు అసలే ఎ.పి లో ఠికానా లేకుండా పోయింది. తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలే బలపడ్డాయి. బొమ్మైని కూల్చిన కర్ణాటకలోనూ కష్టపడి ఫిరాయింపులతో, అక్రమ ధనంతో రాజ్యాన్ని సాగిస్తున్నారు. బీహార్‌ లోనూ రెండు జాతీయ పార్టీలు తాముగా అధికారంలోకి వచ్చింది లేదు. కాంగ్రెస్‌ ఏకపక్ష రాజకీయాలు, కూల్చివేతలు ఒక తరహా అయితే బిజెపి మోడీ హయాంలో మరింత బరితెగించింది గనకే ఆపరేషన్‌ ఫామ్‌హౌస్‌ వంటి హీనాతిహీన కృత్యాలకు పాల్పడుతున్నది. దీనికి తోడు వ్యవస్థాగతంగానూ రాష్ట్రాల హక్కులను హరిస్తున్నది. ఏకపక్ష పెత్తనానికి ఎగబడుతున్నది. మతతత్వ రాజకీయాలతో సమైక్యతకు చిచ్చుపెడుతున్నది. అదే మతాధిపతులను రాజకీయ కుట్రలకూ శాసనసభ్యుల బేరసారాలకు వినియోగిస్తున్నది. రాజ్యాంగ నిబంధనలు, దర్యాప్తు వ్యవస్థలు, చట్టాలు, ఏవీ ఆపలేని ఈ భయానక ప్రజాస్వామ్య మేధాన్ని ప్రజలే అడ్డుకోవాల్సి వుంటుంది. వారికి లోబడి వున్నంత మాత్రాన వైసీపీ ప్రభుత్వాన్ని టిడిపి, జనసేన వంటి పార్టీలను కూడా ఉపేక్షించరని గత వ్యాసం చివరలో చెప్పుకున్నాం. పట్టుబడిన నిందితులు నేరుగా ఎపి ప్రభుత్వాన్ని కూల్చివేయడం అందుకోసం 88 మంది ఎంఎల్‌ఎలను సమీకరిస్తామని చెప్పడం ఇందుకు నిదర్శనం. అయినా ఎ.పి ప్రభుత్వం గాని ప్రధాన పాలక పక్షాలు గాని దీనిపై గప్‌చిప్‌ అంటూ తమలో తాము పోట్లాడుకుంటున్నాయి. తెలంగాణలో అయితే కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ స్వయంగా పర్యటించినా టిఆర్‌ఎస్‌నూ బిజెపిని సమానంగా తిట్టిపోయారు. మోడీని మోయడమే మంచిదని సలహా ఇచ్చే కొందరు పత్రికాధిపతులు కెసిఆర్‌ ఎందుకు వెనకంజ వేశారని ముందస్తుగా శాపనార్థాలు పెట్టారు. వీరంతా రేపైనా కళ్లు తెరిస్తే ప్రజాస్వామ్యానికి వారికీ కూడా శ్రేయస్కరం. రాజకీయమంతా రాష్ట్రాలకే పరిమితం చేసి దేశాన్ని మింగేస్తున్న రాహువును చూడకపోవడం ఆత్మహత్యాసదృశం. అలాగే న్యాయవ్యవస్థ, మీడియా కూడా ప్రజాస్వామ్య పరిరక్షణలో తమ పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ చేసిన విజ్ఞప్తి కూడా సముచితమైంది. ఆశించదగింది.

telakapalli ravi

 

 

          తెలకపల్లి రవి