
రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరిత ధోరణి మరో మారు తేటతెల్లమైంది. విభజన సమస్యల పరిష్కారం కోసం అంటూ అట్టహాసంగా నిర్వహించిన సమావేశంలో అనుసరించిన వైఖరే దీనికి నిలువెత్తు నిదర్శనం. విభజనతో అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రానికి చేతనైనంత న్యాయం చేయవలసింది పోయి, రాష్ట్ర ప్రయోజనాలకు మరింత విఘాతం కలిగించేలా ఈ సమావేశంలో కేంద్రం వ్యవహరించడం దారుణం. ప్రత్యేక హోదాకు గండికొట్టినట్లే రైల్వే జోన్ ఆశలపైనా నీళ్లు చల్లడానికి కుట్ర జరుగుతోందని ఈ సమావేశంలో స్పష్టమైంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా, వారికి సమాచారం ఇవ్వకుండా అత్యున్నత స్ధాయి సమావేశంలో జోన్ ఏర్పాటు లాభదాయకం కాదని రైల్వే అధికారులు ఎలా చెప్పగలరు? సమాచారం ఇవ్వడం మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకున్న తరువాతనే వారు ఈ ప్రకటన చేసి ఉంటారు. వారీ మాట చెప్పగానే రైల్వేబోర్డు నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్‌కు పంపాలని హోంశాఖ కార్యదర్శి ఎలా చెబుతారు? కేబినెట్‌తో పాటు పార్లమెంట్ ఆమోదించిన తరువాతే కదా ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు చట్ట రూపం దాల్చింది? చట్టంలో ఉన్న అంశాలు అమలు చేయడానికి బదులు ఇప్పుడీ సాకులేమిటి? నిజానికి విశాఖ జోన్‌లో అత్యంత కీలకమైన విశాఖ రైల్వే డివిజన్‌ను ఒడిషా పరిధిలో ఉన్న జోన్‌లో కలిపింది కేంద్ర ప్రభుత్వమే కదా! తల లేని మొండాన్ని మిగిల్చి ఇప్పుడు లాభదాయకం కాదంటూ సన్నాయి నొక్కులు నొక్కడం దేనికి సంకేతం? ఈ నిర్వాకం ప్రజల్లో చర్చనీయాంశం కావడంతో వదంతులు నమ్మవద్దు, రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామంటూ రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించడం గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్న విధంగా ఉంది. నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు పూర్తయినా జోన్ ఏర్పాటు ఎందుకు పూర్తికాలేదు? బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత జోన్లన్నింటిని ఇదే మాదిరి ఏర్పాటు చేశారా? కేంద్రానికి ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యమే ఉంటే విభజన సమస్యల సమావేశంలో జోన్ అంశం ప్రస్తావన రావాల్సిన అవసరం ఏముంది?
ఇదొక్కటే కాదు, రాజధాని నుండి అనేక ఇతర అంశాల్లోనూ కేంద్ర ప్రభుత్వం ఇదే వైఖరి తీసుకుంది. సమస్యలను పరిష్కరించడానికి బదులుగా నాన్చడం, వాయిదా వేయడం, వీలైతే మరింత అగ్గి రాజేయడానికే ప్రయత్నించింది. విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన సమస్యలను పరిష్కరించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. పోలవరం ప్రాజెక్టు వివాదం విషయంలోనూ ఇటీవల సుప్రీంకోర్టు ఇదే అంశాన్ని పేర్కొనడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. దీనికి భిన్నంగా 'పొరుగు రాష్ట్రానికి అభ్యంతరాలున్నాయి... కోర్టులో వివాదం ఉంది' అని చెప్పడానికి సమావేశం ఏర్పాటు చేయాలా? 20కి పైగా భేటీలు నిర్వహించిన తరవాత కూడా అవే మాటలు ఎందుకు చెబుతున్నారు? వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి గ్రాంట్లు ఇవ్వడం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయడం వంటి వివాదం లేని అంశాలపైనా కూడా ఇదే వైఖరి అవలంబించడంలో అర్ధం ఏమిటి? అసలు ప్రత్యేక హోదా, పోలవరం వంటి అత్యంత కీలకమైన అంశాలు లేకుండా విభజన సమస్యలపై సమావేశం నిర్వహించడం బిజెపి మోసపూరిత విధానాలను బట్టబయలు చేయడం లేదా?
ఈ తరహా కుట్రలను, కుతంత్రాలను ఎదుర్కోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కిమ్మనకుండా ఉండటం విచారకరం. ఒకదాని తరువాత ఒకటిగా బిజెపి వైఖరి బట్టబయలవుతున్న ఈ సమయంలోనైనా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలి. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా కదలాలి. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి విభజన సమస్యలను చర్చించి, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి. కలిసివచ్చే అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, సంస్థలను కలుపుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. పోరాటానికి సిద్ధపడాలి. అలాంటి కార్యాచరణే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుంది.