లండన్ : సెప్టెంబరు దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ కుటుంబం ప్రిన్స్ చార్లెస్ చారిటీ ట్రస్ట్‌కి పది లక్షల పౌండ్లు (9.6 కోట్ల రూపాయల) విరాళమందించింది. బ్రిటీష్ సింహాసనానికి వారసుడు అయిన ప్రిన్స్ చార్లెస్ ఆ విరాళాన్ని ఆమోదించినట్లు సండే టైమ్స్ తెలిపింది. ఒసామాకు సవతి సోదరులైన బకర్ బిన్ లాడెన్, ఆయన సోదరుడు షఫిక్‌ల కుటుంబం నుంచి ఇలాంటి విరాళాలు స్వీకరించవద్దని చార్లెస్‌ను ఆయన సహాయకులు పలువురు కోరారని ఆ పత్రిక పేర్కొంది. ట్రస్టు కార్యాలయం, చార్లెస్ కార్యాలయానికి చెందిన సహాయకులు వద్దని అభ్యంతరాలు వ్యక్తం చేసినా, 2013లో లండన్‌లో క్లారెన్స్ హౌస్‌లో బకర్‌ను ప్రిన్స్ చార్లెస్ కలిసినప్పుడు ఈ విరాళం అందుకోవడానికి అంగీకారం కుదిరింది. ఆ సమయంలో ట్రస్టులో వున్న ఐదుగురు ట్రస్టీలు ఈ విరాళాన్ని ఆమోదించారని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చారిటబుల్‌ఫండ్ (పిడబ్ల్యుసిఎఫ్) ఛైర్మన్ ఇయాన్ చెషైర్ తెలిపారు. సౌదీ కుటుంబ సభ్యులు ఎలాంటి తప్పు చేసారనే సంకేతాలేమీ లేనప్పటికీ విరాళం ప్రకటించడంతో ప్రిన్స్ చారిటీ సంస్థలపై నిశిత పరిశీలన పెరిగింది. సౌదీ వ్యాపారవేత్త ప్రమేయంతో కుంభకోణం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రిన్స్ చార్లెస్‌కే చెందిన మరో ఛారిటబుల్ ఫౌండేషన్‌పై గత ఫిబ్రవరిలో బ్రిటీష్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఆరోపణలపై అంతర్గత దర్యాప్తు జరిగిన తర్వాత ఫ్రిన్స్ ఫౌండేషన్ అధినేత గతేడాది రాజీనామా చేశారు.