అన్ని పార్టీలకూ సమానంగా పంచొచ్చుకదా!
ఎలక్టోరల్ బాండ్లతో లంచాలను చట్టబద్ధం చేశామా?
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్
పార్టీలు పొందిన విరాళాల వివరాలు రెండు వారాల్లో ఇవ్వాలని ఇసికి ఆదేశం
ఎలక్టోరల్ బాండ్లపై తీర్పు రిజర్వు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. మూడు రోజులపాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. కేంద్రప్రభుత్వం 2018 జనవరి 2న అమల్లోకి తెచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ సిపిఎం, ఎడిఆర్, కాంగ్రెస్ నాయకులు జయా ఠాకూర్, మరో పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్లను సిజెఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ జెబి పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల బాండ్లను ప్రారంభించడానికి ముందే సమగ్ర విచారణ జరపాలని అక్టోబరు 10న న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుని, అక్టోబరు 31 నుంచి విచారణ జరిపింది. ఎన్నికల బాండ్ల పథకం పారదర్శకత కొరవవడంతోపాటు ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తోందని పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, కపిల్ సిబల్ వాదించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు సమాన అవకాశాలు కల్పించకపోగా అవినీతిని ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఎన్నికల బాండ్ల ద్వారా ఇప్పటి వరకూ సమకూరిన నిధుల్లో అత్యధిక భాగం కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకే వెళ్లాయని ఎడిఆర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గణాంకాలతో సహా వివరించారు. ఒక్క సిపిఎం మాత్రమే ఎలక్టోరల్ బాండ్లను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిందన్నారు.
లక్ష్య సాధనలో సమస్యలు : ధర్మాసనం
ఎన్నికల బాండ్ల పథకం లక్ష్య సాధనలో కొన్ని సమస్యలున్నాయని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ పథకం గోప్యత, విశ్వసనీయత కొందరికే పరిమితమవుతోందని పేర్కొంది. ఎస్‌బిఐ వద్ద ఉన్న వివరాలను దర్యాప్తు సంస్థల ద్వారా ఏ రాజకీయ పార్టీకి, ఎవరు ఎంత విరాళం ఇచ్చారన్నది అధికారంలో ఉన్న వారు తెలుసుకోగలరని, అదే ప్రతిపక్షంలో ఉన్న వారికి అటువంటి అవకాశం లేదని రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించలేనప్పుడు పథకం నిష్పాక్షికత, పారదర్శకత ప్రశ్నార్థకమవుతుందని పేర్కొంది.
ఈ పథకం ద్వారా లంచాలను చట్టబద్ధం చేశామా?
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సమీకరించే పథకం ద్వారా లంచాలను చట్టబద్ధం చేశామా? అని సిజెఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రశ్నించారు. 'అధికార పార్టీకే అధిక విరాళాలు ఎందుకు వెళ్తున్నాయి. దీనికి కారణమేమిటి? ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన మొత్తం నిధులను ఎన్నికల సంఘం వద్ద ఉంచి, దాని ద్వారా అన్ని పార్టీలకూ సమానంగా పంపిణీ చేయొచ్చు కదా' అని ఆయన సూచించారు. దీనికి తుషార్ మెహతా బదులిస్తూ.... 'అప్పుడు అసలు విరాళాలే రావు' అని అభిప్రాయపడ్డారు.
పార్టీలు పొందిన విరాళాల వివరాలు రెండు వారాల్లో ఇవ్వండి
రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సెప్టెంబర్ 30 వరకూ పొందిన విరాళాల వివరాలను రెండు వారాల్లోగా తమకు అందించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2019 ఏప్రిల్ 12 నాడు సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఆదేశాలను ప్రస్తావిస్తూ, నాటి ఉత్తర్వులు ప్రకటించిన తేదీకే పరిమితం కాదని పేర్కొంది. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి ఏదైనా సందేహాలుంటే సర్వోన్నత న్యాయస్థానం నుంచి స్పష్టత తీసుకోవాలని నొక్కి చెప్పింది. అనంతరం తీర్పును రిజర్వు చేసింది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరపున తన వాదనలు కొనసాగిస్తూ.. 'నిర్ణయం మరీ ఏకపక్షమైంది కానంత వరకూ ప్రయోగాలు చేసే హక్కు చట్టసభలకు ఉంది. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిన తరువాత ఏమైందన్నది ప్రశ్న. ఆ ధోరణులను ధర్మాసనం ముందు ఉంచాం' అని అన్నారు. ఈ సందర్భంగా న్యాయవాది కనూ అగర్వాల్ కల్పించుకుని గతంలో రూ.20 వేల కంటే తక్కువ మొత్తం నిధులు చెల్లించే వారి వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండేది కాదని, పార్టీలు అధికశాతం విరాళాలు ఈ మొత్తం కంటే తక్కువ ఉండేలా జాగ్రత్త పడ్డాయని, పథకాన్ని దుర్వినియోగం చేశాయని ఆరోపించారు. సొలిసిటర్ జనరల్ దీనికి సమాధానమిస్తూ.. ప్రస్తుతం కొంచెం అనుమానాస్పదమైన రూ.20 వేల కంటే తక్కువ మొత్తమున్న విరాళాలు తగ్గాయని, ఎలక్టోరల్ బాండ్లు పెరిగాయని తెలిపారు.
జస్టిస్ ఖన్నా కలుగజేసుకుని రూ.20 వేల కంటే తక్కువ మొత్తమున్న ఎలక్టోరల్ బాండ్లు ఎంత మేరకు వచ్చాయో చూపాలని కోరారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించేందుకు నిరాకరించిన పార్టీ ఇప్పటికీ అంతకంటే తక్కువ మొత్తమున్న స్వచ్ఛంద విరాళాలను స్వీకరిస్తోందని సోలిసిటర్ జనరల్ తెలిపారు. ఎలక్టోరల్ బాండ్లు పెరిగితే రూ.20 వేల కంటే తక్కువ విరాళాలు తగ్గుతాయని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించబోమన్న పార్టీ విషయంలో మాత్రమే రూ.20 వేల కంటే తక్కువ విరాళాలు తగ్గడం లేదని తెలిపారు. అందుకే ఆ పార్టీ పాత పద్ధతి కోసం డిమాండ్ చేస్తోందని ఆరోపించారు.
అంతకుముందు ఈ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. ఎన్నికల బాండ్ల నిధుల మూలాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు దేశ పౌరులకు లేదని అందులో పేర్కొన్నారు. ఎలక్షన్ ఫండింగ్, పార్టీ ఫండింగ్, క్యాంపెయిన్ ఫండింగ్ ఇవన్నీ కాలిడోస్కోప్ (రంగురంగుల చిత్రాలను ప్రదర్శించే గాజుగొట్టం) లాంటిదని, ఇదంతా ఆసక్తికరమైన ప్రయోగాంశమేనని అన్నారు.