లండన్ : దారుణమైన నేరాలకు శిక్షలు కూడా కఠినంగా వుండేలా కొత్త చట్టాలను తీసుకువచ్చే ప్రణాళికల గురించి బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ వెల్లడించారు. హేయమైన హత్యలకు పాల్పడిన వారికి పూర్తిస్థాయిలో యావజ్జీవిత ఖైదు విధించాలని, వారికి పెరోల్ ఇవ్వడం లేదా త్వరగా విడుదల చేసే అవకాశాలను పరిశీలించరాదని భావిస్తున్నారు. అత్యంత భయానకమైన రీతిలో హత్యలు చేసిన హంతకులకు యావజ్జీవం అంటే యావజ్జీవితం జైల్లోనే వుండాలని, న్యాయమూర్తులు ఆ రకంగా ఆదేశాలు జారీ చేయాల్సి వుందని సునాక్ చెప్పారు. చాలా పరిమితం సందర్భాల్లో మినహా మొత్తంగా జీవిత ఖైదును న్యాయమూర్తులు విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకురానున్నారు. 'ఇటీవల కాలంలో నేరాల్లోని క్రూరత్వాన్ని మనం చూశాం. అటువంటి కేసుల్లో దోషులకు పూర్తి స్థాయిలో శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటారు. శిక్ష విధింపులో నిజాయితీ వుండాలని వారు భావిస్తారు.' అని సునాక్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొత్త చట్టం తీసుకురావడం ద్వారా దోషులకు పూర్తి స్థాయిలో కఠిన శిక్ష అమలయ్యేలా చూడనున్నట్లు చెప్పారు. ఇక వారెన్నడూ స్వేచ్ఛగా తిరగలేరని అన్నారు. నర్సు లూసీ కేసు వెలుగు చూసిన నేపథ్యంలో సునాక్ ఈ ప్రకటన చేశారు. ఉత్తర ఇంగ్లండ్‌లో తాను పనిచేస్తున్న ఆస్పత్రిలో తన సంరక్షణలో వున్న ఏడుగురు నవజాత శిశువులను దారుణంగా హతమార్చిన లూసీకి యావజ్జీవం విధించారు. బ్రిటన్ చట్ట నిబంధనల ప్రకారం ఉరి శిక్షకు అనుమతి లేదు. అందువల్ల కఠిన శిక్ష అంటే యావజ్జీవితమే. పై కోర్టుల్లో అప్పీల్ చేసుకోవడానికి అనుమతిల్లేకుండా యావజ్జీవం పూర్తి స్థాయిలో అమలు చేయడమే సరైన చర్య అని సునాక్ ప్రభుత్వం భావిస్తోంది.
మరో వివాదంలో రిషి సునాక్
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మరో వివాదంలో చిక్కుకొన్నారు. బ్రెగ్జిట్ తర్వాత ప్రతిపాదిత భారత్-బ్రిటన్ వాణిజ్య ఒప్పందం నుంచి సునాక్ కుటుంబం లబ్ధి పొందనుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ ఒప్పందంపై భారత్-బ్రిటన్ దేశాలు చర్చలు జరుపుతున్నాయి. రిషి సునాక్ భార్య అక్షితా మూర్తికి ఇన్ఫోసిస్‌లో 500 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు ఉండటం, ఇన్ఫోసిస్‌కు యూకేలోని ప్రభుత్వ, ప్రైవేటు కాంట్రాక్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందంపై బ్రిటన్ పార్లమెంటేరియన్లు, వాణిజ్య నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒప్పందంతో ఆ కంపెనీకి లబ్ధి చేకూరేలా లబ్ధి చేకూరుతుందనే ఆందోళన వెలిబుచ్చారు. అక్షితాకు ఇన్ఫీలో షేర్లు, ఆమెకు లభించే ప్రయోజనాలపై మరింత పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ ఒప్పందంతో ఇన్ఫోసిస్‌కు ఎటువంటి లబ్ధి లభిస్తుందనే అంశాలపై మరింత స్పష్టంగా వెల్లడించాలని పేర్కొన్నారు. వాణిజ్య చర్చల నుంచి సునాక్ వైదొలగాలని సూచించారు. అక్షితా మూర్తికి ఛైల్డ్ కేర్ సంస్థలో ఉన్న వాటాలను సరిగ్గా వెల్లడించలేదని యూకే పార్లమెంట్ స్టాండర్డ్స్ వాచ్‌డాగ్ ఇటీవల వెల్లడించింది.