May 26,2023 10:15

లండన్‌   :   బ్రిటన్‌లో ఆహార ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. ఆహార ద్రవ్యోల్బణం  గతేడాది కన్నా  20  శాతం పెరిగినట్లు   గురువారం జాతీయ గణాంకాల కార్యాలయం పేర్కొంది.    ఆహార ద్రవ్యోల్బణం 19.3 శాతంగా ఉందని, మార్చి నాటి 19.6 శాతంతో పోలిస్తే స్వల్పంగా తగ్గి 45 ఏళ్ల గరిష్టస్థాయికి దగ్గరగా చేరినట్లు గణాంకాలు తెలిపాయి. వినియోగదారుల ధరల సూచిక (సిపిఐ) ద్రవ్యోల్బణం గత నెలలో ఏడాదికన్నా అధిక  కనిష్టస్థాయికి పడిపోయింది. అయితే 8.7 శాతం వద్ద ఇప్పటికీ సగటు వేతన పెరుగుదలను అధిగమించింది. గతేడాది నుండి ఆకాశాన్నంటుతున్న పెరుగుదల ఇంధన ధరల స్థిరీకరణతో మార్చిలో 10.1 శాతానికి క్షీణించింది. అయితే ఆర్థికవేత్తలు అంచనాను మించి ఏప్రిల్‌లో 8.2 శాతానికి పడిపోయింది. ఆలివ్‌ నూనె వంటి నిత్యావసరాలు బడ్జెట్‌ కన్నా అధిక పెరుగుదలను ఎదుర్కొంటున్నాయి. ఇది గతేడాది కన్నా 49 శాతం పెరిగింది. అలాగే జున్ను 42 శాతం, పాలు, ఉడికించిన బీన్స్‌ రెండూ కూడా 39 శాతానికి పెరిగాయి.

ఇప్పటికే జీవన వ్యయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వినియోగ దారులపై ఇంధన బిల్లుల కన్నా ఆహార ధరల పెరుగుదల అధిక ప్రభావాన్ని చూపుతుందని రిజల్యూషన్‌ ఫౌండేషన్‌ హెచ్చరించింది. తక్కువ ఆదాయం ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది.
వేతనాల కన్నా ధరలు వేగంగా పెరుగుతూనే ఉన్నాయని ట్రేడ్స్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (టియుసి) జనరల్‌ సెక్రటరీ పాల్‌ నొవాక్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వేతన పెరుగుదల లేకుంటే కుటుంబాల జీవన ప్రమాణాలను పునరుద్ధరించలేరని అన్నారు.