Aug 20,2022 07:17

ప్రపంచంలోనే అత్యంత అమానవీయ ఘటనల్లో ఒకటిగా మిగిలిపోయిన గుజరాత్‌ మత ఘర్షణల నెత్తుటి పుండును బిజెపి మళ్లీ రేపుతోంది. సామూహిక అత్యాచారం, హత్య కేసుల్లో జీవిత శిక్ష అనుభవిస్తున్న 11 మంది గూండాలను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయడం ద్వారా బిజెపి ప్రభుత్వం తన వికృత రాక్షస రూపాన్ని మరో మారు బయటపెట్టుకుంది. 2002లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నాటి దాష్టీకాలను చూస్తూ ప్రేక్షక పాత్ర వహించిన నరేంద్ర మోడీ..ఇప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఒకవైపు ఎర్రకోటపై 'నారీశక్తి' గొప్పలు చెబుతూ ప్రసంగం దట్టించడం..మరోవైపు ఆయన కనుసన్నల్లో నడిచే గుజరాత్‌ ప్రభుత్వం కరుడుగట్టిన నేరగాళ్లను విడుదల చేయడం చూస్తే 'దయ్యాలు వేదాలను వల్లించడమ'నే సామెత గుర్తురాక మానదు. ఈ ఏడాది ఆఖరులో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హిందూత్వ శక్తులను సమీకరించి ప్రజల్లో మరో మారు మత చిచ్చు రాజేసి రాజకీయ ప్రయోజనాలు పొందే కుట్రలో భాగంగానే బిజెపి ఇప్పుడు ఇలాంటి 'ప్రత్యేక చర్యల'కు పూనుకుంటోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్‌ మారణకాండలో భర్తతో పాటు పదుల సంఖ్యలో ఆత్మీయులను, కార్యకర్తలను కోల్పోయిన జకియా జఫ్రి తరపున న్యాయం కోసం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పాపానికి సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌, తదితరులపై అక్రమ కేసులు బనాయించి ఇదే బిజెపి ప్రభుత్వం ఇటీవలే జైలు పాల్జేసింది. వయోభారంతో గ్లాసు కూడా చేత పట్టుకోలేని స్టాన్‌స్వామి వంటి ఆదివాసీ సామాజిక కార్యకర్తను మరణించే వరకు జైల్లో బంధించిన పాలకులకు కరుడుగట్టిన నేరాలు చేసిన దుండగులపై ఎనలేని దయ, జాలి కలగడం సిగ్గుచేటు.
                  2002లో గుజరాత్‌లో చోటుచేసుకున్న హిందూత్వ గూండాల అకృత్యాలకు బిల్కిస్‌ బానో ప్రత్యక్ష సాక్షి. బతికుండగానే నరకమంటే ఏమిటో ప్రత్యక్షంగా అనుభవించిన ఆమె రెండు దశాబ్దాలుగా న్యాయం కోసం పోరాడుతున్న గుజరాత్‌ దాష్టీకాల బాధిత ధీర వనితల్లో ఒకరు. ఇప్పుడు విడుదలైన 11 మంది నేరగాళ్లతో పాటు మరికొందరు హిందూత్వ గూండాలు ఆనాడు చేసిన అరాచకాలు తల్చుకుంటే రక్తం మరిగిపోతుంది. 'వారు కోపంతో ఉన్నారు...వారు చేయాలనుకున్నది చేయని..' అంటూ నాటి ప్రభుత్వాధినేత పచ్చజెండా ఊపేయడంతో పగ్గాలు తెంచుకున్న ఆంబోతుల్లా గూండాలు రెచ్చిపోయారు. బిల్కిస్‌ తల్లితో పాటు కనిపించిన మహిళలందరిపై సామూహిక అత్యాచారాలకు తెగబడ్డారు. బిల్కిస్‌ కుమార్తె అయిన మూడేళ్ల పసిపాపతో సహా 14 మందిని అతి దారుణంగా చంపేశారు. జీవచ్ఛవ ప్రత్యక్ష సాక్షిగా నేటికీ ఆ నొప్పిని బిల్కిస్‌ అనుభవిస్తూనే వుంది. తడారని నెత్తుటి గాయాన్ని నేటికీ భరిస్తున్న బిల్కిస్‌ లాంటి బాధితులకు గుజరాత్‌లో లెక్కలేదు.
            తనకు జరిగిన అన్యాయంపై బిల్కిస్‌ బానో న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో 11 మందిని దోషులుగా నిర్ధారించి యావజ్జీవ జైలు శిక్ష విధించారు. ఈ దోషుల్లో ఒకడైన రాధేశ్యామ్‌ షా తనను విడుదల చేయాల్సిందిగా సుప్రీంకోర్టుకు ఇటీవల విజ్ఞప్తి చేశాడు. అతడి విజ్ఞప్తిని రెండు నెలల్లో పరిశీలించాని సుప్రీంకోర్టు గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతే.. గుజరాత్‌ ప్రభుత్వం చకాచకా లాంఛనాలు పూర్తి చేసింది. విడుదల కోసం కోర్టును ఆశ్రయించిన వాడిని ఒక్కడినే కాకుండా మొత్తం 11 మందినీ '1992 విడుదల విధానం' ప్రకారం విడుదల చేస్తున్నట్లు గుజరాత్‌ ప్రభుత్వం సమర్థించుకుంది.
                  వాస్తవానికి ఇప్పుడు ఆ విధానం ఉనికిలో లేదు. 2014 నుంచి కొత్త విధానం అమల్లో ఉంది. కేంద్ర దర్యాప్తు బృందం (సిబిఐ) నిర్ధారించిన 'హత్య కేసుల' దోషులకు '1992 విడుదల విధానం'లో కూడా శిక్షకు మినహాయింపు ఇవ్వలేదన్న విషయం చాలా ప్రధానమైనది. గుజరాత్‌ సర్కార్‌ ఈ దుండగులను విడుదల చేయడంతో సంఫ్‌ు పరివార్‌ శక్తులు మరింతగా రెచ్చిపోయాయి. 11 మందికి కారాగారం వద్దే మిఠాయిలతో నోరు తీపి చేశాయి. పూలదండలు వేసి సన్మానాలు చేశాయి. ఇదంతా చెప్పేదేమిటి? 'నచ్చనివారిని ఖైదు చేయడం..నచ్చినవారికి స్వేచ్ఛనివ్వడం'. ఒకవైపు రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ అరాచక ఆటవిక పాలన సాగిస్తున్న బిజెపిని ప్రజా ఉద్యమాలతోనే తరిమి కొట్టాలి. కరుడుగట్టిన నేరగాళ్లను ప్రోత్సహించేలా గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సిన అవసరముంది. స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఇంకా బతికేవుందని, బాధితులకు న్యాయం దూరం కాబోదు అనే భరోసాను బిల్కిస్‌ లాంటి బాధితులకు కల్పించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉంది.