Mar 27,2023 11:23

గాంధీనగర్‌  :   గుజరాత్‌లో మార్చి 25న జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన ఓ వ్యక్తిని చూసి యావత్‌ ప్రపంచం సిగ్గుతో తలదించుకోవాల్సిందే. పైగా ఆ వ్యక్తి అధికార బిజెపి ఎంపి, ఎమ్మెల్యేలతో స్టేజీని పంచుకోవడం గమనార్హం. 2002 గుజరాత్‌ అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానోపై అత్యాచారానికి పాల్పడిన 11 మంది దోషుల్లో ఒకరైన శైలేష్‌ చిమ్నాలాల్‌ భట్‌. గతేడాది ఆగస్ట్‌ 15న ఈ దోషులందరినీ గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. వీరి విడుదలను సవాలు చేస్తూ బిల్కిస్‌బానోతో పాటు టిఎంసి ఎంపి మహువా మొయిత్రా, సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు సుభాషిణీ అలీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

గత శనివారం దాహోద్‌ జిల్లాలోని కర్మాడి గ్రామంలో ది గ్రూప్‌ వాటర్‌ సప్లై స్కీమ్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి దాహోద్‌ ఎంపి జశ్వంత్‌ సిన్హ్‌ భాభోర్‌, ఆయన సోదరుడు, లిమ్ఖేడా ఎమ్మెల్యే శైలేష్‌ భాభోర్‌లతో పాటు బిల్కిస్‌ బానో అత్యాచార కేసు నిందితుడు శైలేష్‌ చిమ్నాలాల్‌ భట్‌ కూడా హాజరయ్యారు. వారితో పాటు పూజా కార్యక్రమాల్లో పాల్గనడంతో పాటు ఫోటోలకు ఫోజులిచ్చాడు.

2002 అల్లర్ల సమయంలో ఏడేళ్ల గర్భవతి అయిన బిల్కిన్‌బానోపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఏడుగురు కుటుంబసభ్యులను నిర్థాక్షిణ్యంగా హత్య చేశారు. వారిలో మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. 2008లో కోర్టు వీరికి జీవిత ఖైదు విధించింది.