
న్యూఢిల్లీ : బిల్కిస్ బానో కేసులో యావజ్జీవ శిక్ష పడిన 11మంది దోషులను ముందుగానే విడుదల చేయడానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ఆగస్టు 7న సుప్రీం విచారణ చేపట్టనుంది. ఈ మేరకు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భూయాన్‌లతో కూడిన బెంచ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసిది. ఈ కేసులోని విడుదలైన దోషులకు, ఇతర సంబంధిత పక్షాలకు నోటీసులు జారీ చేయడం పూర్తయిందని తెలిపింది. నాగరత్న బెంచి ముందుకు ఈ కేసు విచారణకు రావడం ఇది రెండవసారి. జులై 11న మొదటిసారిగా రాగా జులై 17కి వాయిదా వేశారు. జస్టిస్ కె.ఎం.జోసెఫ్ నేతృత్వంలోని గత బెంచ్ ముందు కూడా ఈ కేసు పదే పదే విచారణకు వచ్చింది. విడుదలైన 11మంది తరపు లాయర్లు లేవనెత్తిన పలు అభ్యంతరాల కారణంగా వరుసగా విచారణలు వాయిదా పడుతూ వచ్చాయి. మే 9వ తేదిన చివరిసారిగా అటువంటి విచారణ జరిగింది. ఈ విషయంపై విచారణ జరగాలని వారు కోరుకోవడం లేదంటూ మే 9వ తేదీన జస్టిస్ జోసెఫ్ వ్యాఖ్యానించారు. తాను జూన్ 16న పదవీ విరమణ చేస్తున్నానని, మే 19 తన చివరి వర్కింగ్ డే అని ఈలోగా దీనిపై విచారణ జరుపుతాననుకోవడం లేదని వ్యాఖ్యానించారు.