Aug 14,2022 06:56

గత ఎన్నికలలో నితీశ్‌ పార్టీ జెడియు కు తక్కువ స్థానాలే వచ్చినా తాము ముఖ్యమంత్రిని చేస్తే వెన్నుపోటు పొడిచాడని బిజెపి నేతలు తిట్టిపోస్తున్నారు. నితీశ్‌ గత పదేళ్లలో ఆరు సార్లు అటూ ఇటూ మారిన మాట నిజమే గానీ బిజెపి అంతకన్నా నాలుగాకులు ఎక్కువే చదివింది. ఆయన ఈ నిర్ణయం తీసుకోడానికి మహారాష్ట్ర పరిణామాలు తక్షణ కారణమైతే...బిజెపి తనను నానా పాట్లకు గురిచేయడం మరింత ముఖ్యమైన కారణం. మిశ్రమ కూటములంటూనే తమను బిజెపి మింగేస్తున్న తీరును మిత్ర పార్టీలన్నీ గ్రహించి జాగ్రత్త పడుతున్నాయి.

హిరణ్యాక్షుడు భూగోళాన్ని చాప చుట్టిన పురాణం లాగా అన్ని రాష్ట్రాలనూ తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలంటున్న బిజెపి పేరాశలకు బీహార్‌ పెద్ద దెబ్బ కొట్టింది. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ బిజెపితో విడగొట్టుకుని ఆర్జేడి, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులతో కలసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ షా ద్వయానికి వారి తరహా లోనే గుణపాఠం నేర్పారు. ఏకపక్ష కేంద్రీకృత నిరంకుశత్వంగా పరిణమిస్తున్న మోడీ మతతత్వ విధానాల నుంచి ఒక పెద్ద రాష్ట్రం దూరమైంది. అందులోనూ ఉత్తరాదిన యు.పి తర్వాత కీలకమైన క్షేత్రం బీహార్‌. గతంలో జె.పి ఉద్యమానికి తర్వాత కాలంలో వెనకబడిన సామాజిక శక్తుల సమీకరణానికి పేరొందింది. అలాంటిచోట వచ్చిన ఈ పరిణామం ప్రభావాన్ని తక్కువ చేసేందుకు, బీహార్‌కే పరిమితం చేసేందుకు మీడియాలో కథనాలు పరంపరగా వస్తున్నాయి. గత ఎన్నికలలో నితీశ్‌ పార్టీ జెడియు కు తక్కువ స్థానాలే వచ్చినా తాము ముఖ్యమంత్రిని చేస్తే వెన్నుపోటు పొడిచాడని బిజెపి నేతలు తిట్టిపోస్తున్నారు. నితీశ్‌ గత పదేళ్లలో ఆరు సార్లు అటూ ఇటూ మారిన మాట నిజమే గానీ బిజెపి అంతకన్నా నాలుగాకులు ఎక్కువే చదివింది. ఆయన ఈ నిర్ణయం తీసుకోడానికి మహారాష్ట్ర పరిణామాలు తక్షణ కారణమైతే బిజెపి తనను నానా పాట్లకు గురిచేయడం మరింత ముఖ్యమైన కారణం. మిశ్రమ కూటములంటూనే తమను బిజెపి మింగేస్తున్న తీరును మిత్ర పార్టీలన్నీ గ్రహించి జాగ్రత్త పడుతున్నాయి. మహారాష్ట్రలో శివసేన, పంజాబ్‌లో అకాలీదళ్‌, ఇప్పుడు జెడియు దూరం కావడంతో బిజెపికి ఇక ఉత్తర భారతంలో మిత్రులంటూ లేకుండా పోయారు. దక్షిణాదిన తమిళనాడులో అన్నా డిఎంకె వున్నా అక్కడ దాని ప్రయోజనం నామమాత్రం. తమాషా ఏమంటే ఇలాంటి సమయంలో ఎ.పి లో పాలక వైసీపీ పరోక్షంగా బిజెపి కనుసన్న ల్లో మెలగడం, టిడిపి మరోసారి మోడీని ప్రసన్నం చేసుకోవాలని తహతహలాడటం ఒక వైపరీత్యం. జనసేన బిజెపితో జట్టు కట్టే వుంది.
ఎన్నో మార్పులు, మలుపులు
                  బిజెపి ఇంతవరకూ స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిన ఏకైక హిందీ రాష్ట్రమది. నితీశ్‌ కుమార్‌ చెలిమితోనూ చలువతోనూ మాత్రమే అక్కడ ఆ పార్టీ అధికారంలో భాగస్వామి కాగలిగింది. మొదట సోషలిస్టులుగా తర్వాత జనతా జనతాదళ్‌ నేతలుగా ఎదిగిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (కుటుంబం), నితీశ్‌ కుమార్‌లే ముప్పై ఏళ్లకు పైగా బీహార్‌ను పాలిస్తున్నారు. లాలూతో పోటీ తట్టుకోలేకే నితీశ్‌ సమతా పార్టీ ఏర్పాటు చేసి బిజెపితో కలిశారు. 1997లో లాలూ యాదవ్‌ గడ్డి కుంభకోణంలో చిక్కుకున్నాక భార్య రబ్రీ దేవిని ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రీయ జనతాదళ్‌ ఏర్పాటు చేశారు. తర్వాత ఆ పార్టీ ఎన్నికల్లో గెలిచిందిగాని 2005 నాటికి అనేక మల్లగుల్లాల తర్వాత నితీశ్‌ కుమార్‌ గెలిచి ముఖ్యమంత్రి కాగలిగారు. అప్పటి నుంచి వరుసగా కొనసాగుతున్నారు. సమతా పార్టీ జెడియు గా మారింది. లాలూ యాదవ్‌ కేసుల్లో శిక్ష పడి జైలుకు వెళ్లడంతో ఆయన చిన్న కొడుకు తేజస్వి యాదవ్‌ ఆర్జేడీ పార్టీ సారథ్యం చేపట్టారు. 2013లో బిజెపి తరపున ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని నిర్ణయించడం నితీశ్‌కు ఎంతమాత్రం మింగుడు పడలేదు. పైగా బీహార్‌ ప్రత్యేక నేపథ్యంలో బిజెపి తరహా మత రాజకీయాలు చెల్లుబాటు కావని ఆయనకు బాగా తెలుసు. కాస్త ముందు నుంచే బిజెపి నుంచి విడగొట్టుకోవడం మొదలెట్టారు. మోడీ ప్రచారానికి రానక్కరలేదని షరతు పెట్టారు. చివరకు వంటరిగానే ఎన్నికలకు వెళ్లి దెబ్బ తిన్నారు. మోడీ గాలిలో అక్కడ బిజెపికి 22 స్థానాలు రాగా జెడియు కు కేవలం రెండు, ఆర్జేడీకి నాలుగు వచ్చాయి. రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ఆరు స్థానాలు తెచ్చుకొని కేంద్రంలో మంత్రిగా చేరారు. ఈ ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ నితీశ్‌ రాజీనామా చేసి జితన్‌ రామ్‌ మాంఝీని ముఖ్యమంత్రిని చేశారు. అయితే అంతా ఆయన పెత్తనమే. కొద్దికాలంలోనే మాంఝీని తప్పించి మళ్లీ పదవి చేపట్టారు.
బిజెపి పంజరంలో నితీశ్‌
                        2015లో ఆర్జేడితో కలసి మహా ఘట్‌బంధన్‌ ఏర్పాటు చేసి ఆర్జేడీతో కలసి ఘన విజయం సాధించారు. మోడీ విజయోత్సాహానికి ఏడాదిలోనే అది తొలి విఘాతం. అయితే ఇరు పార్టీల విభేóేదాలతో ఆ ప్రయోగమూ అర్థంతరంగా ముగిసింది. ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్‌, లాలూ కుటుంబం జోక్యం పెరిగిపోయిందని నితీశ్‌ ప్రచారం ప్రారంభించారు. కేంద్రం లాలూపై దాడి పెంచడంతో ఆ కేసులు సాకుగా చూపి మళ్లీ వారితో తెంచుకున్నారు. ఆఘమేఘాల మీద బిజెపితో జత కట్టి కొత్త సర్కారు ఏర్పాటు చేశారు. ఇప్పట్లా తాను రాజీనామా చేయకుండానే ఆర్జేడి మంత్రులను తప్పించి బిజెపి వారిని చేర్చుకున్నారు. కేంద్రం ఆశీస్సులతో మూడేళ్లు పాలన పూర్తిచేశారు. 2019లో ఇరు పార్టీలకు ఇంచుమించు సమానంగా 17,16 లోక్‌సభ సీట్లు వచ్చాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ-షా ద్వయం నితీష్‌ను తగ్గించి బీహార్‌లో తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని పథకాలు వేశారు. కేంద్ర మంత్రివర్గంలో జెడియు కోటా బాగా తగ్గించేశారు. రాష్ట్రం నుంచి ఇరు పార్టీల ఎంపిల సంఖ్య ఒకటే అయినా బిజెపి నుంచి ముగ్గురు మంత్రులను తీసుకుని జెడియుకు ఒకటే కేటాయించడంతో కేంద్రంలో చేరరాదని నితీశ్‌ నిర్ణయం తీసుకున్నారు. అయినా నితీశ్‌ వ్యతిరేకిగా వున్న ఆర్‌.సి.పి.సింగ్‌ను తీసుకున్నారు. 2020 ఎన్నికలలో తేజస్వి నాయకత్వం లోని ఆర్జేడి 75 స్థానాలతో పెద్ద పార్టీగా వచ్చింది. అనేక పేచీలు పెట్టిన కాంగ్రెస్‌ యాభై మూడు స్థానాలు తీసుకుని కేవలం 27 చోట్లనే గెలిచి తీవ్రంగా నష్టపర్చింది. వామపక్షాలు చాలాకాలం తర్వాత మళ్లీ బలం గణనీయంగా పెంచుకున్నాయి. వాటికి కేటాయించిన 29 స్థానాల్లోనూ ఎంఎల్‌ 12, సిపిఎం సిపిఐ చెరి రెండు తెచ్చుకున్నాయి. ఇతర పార్టీలకూ కొన్ని స్థానాలొచ్చాయి. రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ కుమారుడైన చిరాగ్‌ పాశ్వాన్‌ రాష్ట్రంలో బిజెపి పథకంలో పావుగా మారారు. కేవలం జెడియు పోటీచేసిన చోట్లనే పాశ్వాన్‌ బిజెపి రెబల్స్‌ను తన పార్టీ అయిన లోక్‌ జనశక్తి (ఎల్‌జెఎస్‌) తరపున నిలబెట్టి ఓట్ల చీలికతో ఓడిపోయేలా చేశారు. ఫలితంగా బిజెపికి 74 స్థానాలు వస్తే జెడియు సీట్లు 43కు పడిపోయాయి. ఇతర చిన్న పార్టీలను కలుపుకొని ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే నితీశ్‌ పూర్తిగా బిజెపిపై ఆధార పడాల్సిన స్థితి. దీని పర్యవసానాలు తెలిసిన ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి నిరాకరించారు. ఆఖరుకు మోడీ స్వయంగా మాట్లాడి ఒప్పించారు. నామకార్థంగా ముఖ్యమంత్రిని చేసినా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, స్పీకర్‌తో సహా కీలక శాఖలన్నీ బిజెపి వారే తీసుకున్నారు. మరో వంక ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ విభాగాలు మత సామరస్యానికి హాని కలిగించే చర్యలు, ప్రచారాలు పెంచాయి. శుక్రవారంనాడు ముస్లింలకు ఆప్షనల్‌ సెలవు ఇవ్వడాన్ని ఖండించారు. కులగణన చేయడానికి వ్యతిరేకత తెలిపారు. ఆఖరుకు శాసనసభలో నితీష్‌ నియోజకవర్గంలో పరిస్థితి బాగాలేదనే చర్చను స్పీకర్‌ అనుమతించడం ఆయనకు ఆగ్రహం తెప్పించింది. సభ తన చేతిలో లేకుండా ఏ ముఖ్యమంత్రి పాలన సాగించగలుగుతారు? తన పట్టు బాగా వున్నప్పుడు బిజెపి ఆరెస్సెస్‌ తరహా మతతత్వ పోకడలకు కొంతవరకూ నిలవరించగలిగిన నితీశ్‌ ఇప్పుడు ఇబ్బందిలో పడిపోయారు. కీలుబొమ్మ ముఖ్యమంత్రిగా వుంటే తన పునాదినే దెబ్బ తీస్తుందని కూడా గుర్తించగలిగారు. అందుకే ఆర్‌.సి.పి.సింగ్‌ రాజ్యసభ పదవీ కాలం ముగిసినా మళ్లీ నామినేట్‌ చేయకుండా తొలి నిరసన తెలిపారు. ఆయనపై ఆరోపణల దర్యాప్తు మొదలెట్టారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిర్వహించిన అయిదు కార్యక్రమాలకు దూరంగా వుండిపోయారు. ఏమైనా ఎన్‌డిఎ లో లేని జగన్‌, నవీన్‌ పట్నాయక్‌ వంటి వారు నిరంతరం బలపరుస్తుంటే ఆ కూటమిలో వుండి నితీశ్‌ దూరం పాటించడం దేశ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.
వచ్చే ఎన్నికలపై ప్రభావం
                 నితీశ్‌ ప్రధాని పదవికి తనను అభ్యర్తిగా భావిస్తున్నారనే గత కథనాలు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులు ఆశించారని ఇటీవలి కథనం వున్నా ఆయన దాన్ని ఖండిస్తున్నారు. ఉప రాష్ట్రపతి పదవి వద్దని కూడా చెప్పానంటున్నారు. ఇదే సమయంలో బిజెపి యేతర పార్టీల సమావేశాలు కెసిఆర్‌, మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌ వంటి వారు జాతీయ ప్రత్యామ్నాయాలుగా చర్చ జరగడం వాటిలో తేజస్వి యాదవ్‌ భాగస్వామి కావడం నితీశ్‌ను అభద్రతకు గురిచేసింది. దాంతో మళ్లీ తేజస్వితో పొత్తు చర్చలు జరిపి బిజెపితో తెంచేసుకున్నారు. మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే ద్వారా శివసేనను చీల్చినట్టే బీహార్‌లో తన పార్టీకి కూడా ఎసరు పెట్టి తనను నెట్టేస్తారని స్పష్టం కావడంతో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ప్రధాన కారణం బిజెపి అమిత్ర చర్యలు, విశ్వాస ఘాతుకత్వం మొదటిదైతే ప్రత్యామ్నాయంలో తనూ భాగంగా వుండాలనే ఆకాంక్ష రెండవది. ఈ ప్రభావం బీహార్‌కే పరిమితమవుతుందనడం అర్థరహితం. సీనియర్‌ నాయకుడుగా ఇరవయ్యేళ్ల ముఖ్యమంత్రిగా నితీశ్‌ కు హిందీ రాష్ట్రాలలో బలమైన ప్రభావమే వుంటుంది. ఆయన సామాజిక వర్గమైన కుర్మీలు అక్కడ ఎక్కువ సంఖ్యలో వుండటం ఇందుకో కారణమంటారు. ఇప్పటికే యు.పి నుంచి ఎస్‌.పి నేత అఖిలేష్‌ యాదవ్‌ ఈ మార్పును స్వాగతించారు. అనేక హిందీ రాష్ట్రాలలో కాంగ్రెస్‌ కూటములు లేదా ఆమాద్మీ పార్టీ అధికారంలో వున్నాయి. బెంగాల్‌, ఒరిస్సా కూడా బిజెపి చేతిలో లేవు. దక్షిణాదిలో కర్ణాటక మాత్రమే వుండగా మరెక్కడా వారు అధికారం లోకి వచ్చే అవకాశం కనిపించదు. నితీశ్‌ వైఖరిలో అవకాశవాదాన్నే చెబుతూ రాజకీయ పూర్వాపరాలను విస్మరించడం విజ్ఞత అనిపించుకోదు. వాస్తవికంగానూ వుండదు. ఏమైనా ఈ ప్రభావం త్వరలో జరిగే గుజరాత్‌, హిమాచల్‌ ఎన్నికలపై పడొచ్చు. ఉత్తరోత్తరా 2024 ఎన్నికల పోరాటం కూడా తీవ్రమైన పోటీకి దారితీస్తుంది. అనంతరం ఏం జరుగుతుందనేది ఫలితాలపైన ఆధారపడి వుంటుంది గాని ముందస్తు జోస్యాలను ఊహలను బట్టి కాదు. నితీశ్‌ మాత్రం 2024 ఎన్నికల్లో మోడీ గడ్డు పరిస్థితిలో పడిపోతారనే గట్టిగా చెబుతున్నారు. బిజెపి నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా లౌకిక శక్తుల సమీకరణ కోరేవారు ఈ పరిణామాన్ని స్వాగతిస్తారు.

                                                                  తెలకపల్లి రవి

                                                                                                 తెలకపల్లి రవి