Nov 14,2023 09:58

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో భాగంగా ఇప్పటికే నామినేషన్ల దాఖలు ముగిసిన విషయం తెలిసిందే. సోమవారం స్థానికంగా ఎక్కడిక్కడ రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్ల పరిశీలనను పూర్తిచేశారు. కొందరు అభ్యర్థులు నామినేషన్‌ పత్రాల్లో ఖాళీలు వదలడంతో వారికి సమాచారం ఇచ్చి, వాటిని భర్తీ చేయాలని కోరారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. దీనితో బుధవారం మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. దీనితో రాజకీయపార్టీల్లో బుజ్జగింపుల పర్వం ప్రారంభమైంది. ఆయా పార్టీల్లో రెబల్‌ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారిని ఉపసంహరించుకోవాలని ఆయా పార్టీల అధిష్టానాలు విజ్ఞప్తులు చేస్తున్నాయి. పార్టీల తరఫున బీ ఫారమ్‌ తీసుకున్న అధికారిక అభ్యర్థులు కూడా తమ విజయానికి ఆటంకం కలుగుతుందని భావించే అభ్యర్థులను బుజ్జగించే పనిలో పడ్డారు. మరికొందరు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కూడా ఓట్లను చీల్చే అవకాశం ఉండటంతో కుల సమీకరణాలు, ఇతరత్రా అంశాలపై దృష్టిపెట్టి, సాధ్యమైనంత తక్కువ మంది పోటీలో ఉండేలా ప్రధాన పార్టీల అభ్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో 4,798 నామినేషన్‌లు దాఖలైన విషయం తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణ తర్వాతే ఏ నియోజకవర్గంలో ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉంటారో స్పష్టంగా తేలనుంది. అలాగే ఈనెల 30న పోలింగ్‌, డిసెంబర్‌ 3వ తేదీ ఫలితాలు వెల్లడవుతాయి.