- ప్రజాతీర్పును వమ్ము చేయొద్దని హెచ్చరిక
- జనసేన ఎన్‌డిఎలో చేరడం ఆత్మహత్యాసదృశం
- యుసిసి బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించాలి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు పరిరక్షణ, పోలవరం నిర్వాసితుల సమస్యలపై కేంద్రాన్ని నిలదీయాలని వైసిపి, టిడిపిలను సిపిఎం కోరింది. బుధవారం విజయవాడలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయం సమీపంలోని ఎంబివికెలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిహెచ్ బాబూరావుతో కలిసి మాట్లాడారు.
దేశంలో మోడీపై భ్రమలు తొలగిపోయాయని, దేశ సంపదను అదానీ, అంబానీలకు కట్టబెట్టడం తప్ప మరొకటి చేయలేదని ప్రజలకు అర్థమైందని అన్నారు. ఎన్‌డిఎ సమావేశానికి హాజరైన 38 పార్టీల్లో 24 పార్టీలకు పార్లమెంటులో ప్రాతినిధ్యమే లేదని, మరికొన్ని పార్టీలకు అసలు గుర్తింపే లేదని విమర్శించారు. రాష్ట్రంలో జనసేన పార్టీ ఆ సమావేశానికి వెళ్లిందని, ఏం సాధించిందో ప్రజలకు వివరణ ఇవ్వాలని అన్నారు. మరోవైపు రాష్ట్రం విడిపోయి దాదాపు పదేళ్లు కావస్తున్నా కేంద్రంలో బిజెపి ఒక్క హామీని కూడా అమలు చేయలేదని తెలిపారు. ఇచ్చిన మాట తప్పి ద్రోహం చేయడమే గాకుండా రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర ఆటంకంగా మారిందని విమర్శించారు. ప్రతిఘటించే ప్రజల మధ్య, పార్టీల మధ్య చీలికలు తెచ్చి దేశాన్ని బలహీనపరుస్తోందని తెలిపారు. ఈ స్థితిలో రాష్ట్ర హక్కుల కోసం గట్టిగా నిలబడి పోరాడాల్సిన అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని బిజెపికి తాకట్టు పెడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- కేంద్ర షరతులకు తలవంచి ప్రజలపై భారాలు
రాష్ట్రం ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిందని, ఏ ఒక్క ప్రాజెక్టూ పూర్తికాలేదని, ఉపాధి, ఉద్యోగాలు లేవని అన్నారు. ఆఖరికి జీతభత్యాలకు సైతం అడుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. అప్పులు అసాధారణంగా పెరిగిపోతున్నాయని, ప్రజల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి కేంద్రంతో పోరాడి నిధులు తెచ్చుకోవాల్సింది పోయి రుణం కోసం వారు పెట్టిన షరతులకు తలవంచి ప్రజలపై మరిన్ని భారాలు మోపుతున్నారని, ధరల పెరుగుదలకు ఈ విధానాలే కారణమని అన్నారు. విద్యుత్ ఛార్జీలు మోయలేనంతగా పెరిగాయని, ఆస్తిపన్ను, చెత్తపన్ను యూజర్ ఛార్జీల పేరుతో ప్రజల మాడు పగలగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని వైసిపి, టిడిపి కేంద్రంతో పోరాడటానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
- నిగ్గదీసి అడగాలి
ఈ పార్లమెంటు సెషన్‌లో రాష్ట్ర హక్కుల కోసం కేంద్రాన్ని నిలదీయడమే గాకుండా అవసరమైతే ఏ తరహా పోరాటానికైనా సిద్ధం కావాలని, ప్రజలు ఆ పార్టీలపై విశ్వాసం వుంచి గెలిపించినందుకు రుణం తీర్చుకోవాలని కోరారు. ఉమ్మడి సివిల్ కోడ్ (యుసిసి) పేరుతో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ దేశం మీద మతోన్మాద అజెండాను రుద్దాలని ప్రయత్నిస్తుంటే లౌకికపార్టీలని చెప్పుకునే వైసిపి, టిడిపి దానికి తందానా అనడం సిగ్గుచేటని పేర్కొన్నారు. యుసిసిని పార్లమెంటులో వ్యతిరేకించాలని కోరారు.
- ఎన్‌డిఎ సమావేశానికి జనసేన వెళ్లడం రాష్ట్రానికి చేటు
కేంద్ర ప్రభుత్వ ద్రోహానికి వ్యతిరేకంగా పోరాడతానని చెప్పిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఇప్పుడు ఏకంగా ఎన్‌డిఎ గూటిలో చేరారని, బిజెపి రోడ్‌మ్యాప్‌ను రాష్ట్రంలో అమలు చేయడానికి సిద్ధపడటం సిగ్గుచేటని అన్నారు. పవన్‌కల్యాణ్‌పై పార్టీ కార్యకర్తలు, మహిళలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయడమేనని, దేశమంతా బిజెపిని ఓడించడానికి ఏకమవుతుంటే, బిజెపి సరసన జనసేన చేరడం రాష్ట్రంతోపాటు, ఆ పార్టీకీ ఆత్మహత్యాసదృశ్యమేనని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బిజెపితో టిడిపి, జనసేన జతకడతాయని, ఎన్‌డిఎలో లేకపోయినా టిడిపితో అవగాహనకు వస్తామని బిజెపి ప్రకటించిందని, అయినా టిడిపి నోరు మెదపడం లేదని అన్నారు. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో బిజెపితో కూడిన ఏ పార్టీ బతికి బట్టకట్టలేదని, విచ్ఛిన్నం, చీలికలు, పీలికలు అయ్యాయని తెలిపారు. దానిపై పోరాడుతున్న పార్టీలే మనుగడలో ఉన్నాయని వివరించారు. బిజెపితో పొత్తుపెట్టుకునే విషయంలో వస్తున్న వార్తలపై తెలుగుదేశం వివరణ ఇవ్వాలని, లేనియెడల ఈ పార్టీలన్నీ బిజెపి గూటి పక్షులుగానే ప్రజలు భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్‌డిఎతో కలిసి ఉండి బిజెపిని బలపరుస్తూ తమకు తామూ లౌకికవాదులమని చెప్పుకునే అర్హత ఏ పార్టీకీ ఉండదని, అది ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. రాష్ట్రాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్న బిజెపి కుట్రలను తిప్పికొట్టాలని అన్ని పార్టీలను, ప్రజానీకాన్ని కోరారు. బిజెపి మతోన్మాదానికి వ్యతిరేకంగా గళం విప్పాలని మేధావులకు విజ్ఞప్తి చేశారు.