Oct 02,2023 15:03

పాట్నా :    కుల గణన  సర్వేను బీహార్‌ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం జనాభా 13.1 కోట్లకు పైగా ఉండగా..  వీరిలో 36 శాతం మంది అత్యంత వెనుకబడిన తరగతులు కాగా, 27.1 శాతం మంది ఇతర వెనుకబడిన తరగతులు ఉన్నాయి.  వివరాల ప్రకారం 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు విడుదల చేసిన ఈ నివేదికలో వెనుకబడిన తరగతులు మొత్తం జనాభాలో మూడింట రెండొంతులు అంటే  63 శాతంగా   ఉన్నట్లు  నివేదిక పేర్కొంది.  

19.7 శాతం షెడ్యూల్డ్‌ కులాలు మరియు 1.7 శాతం షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన వారు కాగా, జనరల్‌ కేటగిరీకి చెందిన వారు 15.5శాతంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. కుల ఆధారిత సర్వేను విడుదదల చేసిన మొదటి రాష్ట్ర్రంగా బీహార్‌ నిలిచింది. ఈ నివేదికను రాష్ట్ర డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ వివేక్‌ సింగ్‌ విడుదల చేశారు.   

యాదవ జనాభా   అతిపెద్ద ఉప వర్గంగా ఉందని, మొత్తం ఒబిసి వర్గాల్లో 14.27 శాతం వాటా కలిగి ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌ ఇదే వర్గానికి చెందిన వారు.

''గాంధీ జయంతి శుభ సందర్భంగా బీహార్‌లో నిర్వహించిన కుల ఆధారిత జన గణన నివేదిక విడుదలైంది. ఈ సర్వే చేపట్టిన బృందానికి కృతజ్ఞతలు'' అని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఎక్స్‌లో (ట్విటర్‌)లో వెల్లడించారు. త్వరలో అధికార కూటమిలోని పార్టీలన్నింటితోనూ సమావేశం నిర్వహించనున్నట్లు నితీష్‌కుమార్‌ తెలిపారు. కులగణన నివేదికపై చర్చించనున్నట్లు తెలిపారు. ఇదోగొప్ప పరిణామమని, దశాబ్దాల పోరాట ఫలితమని బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌ పేర్కొన్నారు. ఇప్పుడు ప్రభుత్వ విధానాలు, ఉద్దేశాలు రెండూ కూడా నివేదికను గౌరవిస్తాయని అన్నారు. బిజెపి కుట్రలు, న్యాయపరమైన అడ్డంకులు సృష్టించినప్పటికీ .. ఈ రోజు బీహార్‌ ప్రభుత్వం కుల ఆధారిత సర్వేను విడుదల చేసింది అని మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ హర్షం వ్యక్తం చేశారు.