Nov 10,2023 10:52

 పెద్ద నోట్ల రద్దు అనంతర పరిస్థితిపై సర్వే
న్యూఢిల్లీ :   
2016 నవంబర్‌ 7న మోడీ ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్ల చలామణిని రద్దు చేసింది. నల్లధనాన్ని వెలికితీసేందుకే ఈ చర్య తీసుకున్నామంటూ వివరణ ఇచ్చింది. ఆ తర్వాత నగదు లావాదేవీలను తగ్గించడానికి యూపీఐ, ఇతర డిజిటల్‌ చెల్లింపుల పద్ధతులను ప్రవేశపెట్టింది. అయినప్పటికీ గత ఏడు సంవత్సరాల్లో దేశంలో నగదు చలామణి రెట్టింపు అయింది. 2016 నవంబరులో రూ.17 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉండగా ఈ ఏడాది అక్టోబర్‌లో అది రూ.33 లక్షల కోట్లకు పెరిగిందని ఓ సర్వేలో వెల్లడైంది. మేలో దేశ మొత్తం రిటైల్‌ డిజిటల్‌ చెల్లింపుల్లో 78 శాతానికి పైగా యూపీఐ ద్వారానే జరిగాయి. అయినప్పటికీ గత ఏడేళ్లలో ఆస్తులు కొనుగోలు చేసిన వారిలో 76 శాతం మంది కొంత మొత్తాన్ని నగదు రూపంలోనే చెల్లించారు. యూపీఐ ద్వారా రూ.17.6 లక్షల కోట్ల విలువైన 1,140 కోట్ల లావాదేవీలు జరిగినప్పటికీ సర్వేలో పాల్గొన్న 15శాతం మంది తాము 50శాతం వరకూ చెల్లింపులను నగదు రూపంలోనే చేశామని చెప్పారు. 18శాతం మంది 30శాతం-50శాతం నగదు చెల్లింపులు జరపగా, 15శాతం మంది 0-10శాతం వరకూ నగదు రూపంలో చెల్లించామని తెలిపారు. వాహనాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాల కొనుగోలుకు మినహా చాలా మంది తమ కుటుంబ అవసరాలకు నగదు చెల్లింపులే జరుపుతున్నారు. 26 శాతం మంది భారతీయులు నిత్యావసరాల కొనుగోలుకు నగదు చెల్లింపుల పైనే ఆధారపడుతున్నారు. 11,189 మంది పౌరుల్లో కేవలం 15 శాతం మంది మాత్రమే నగదు లావాదేవీలు జరపడం లేదు. గత సంవత్సర కాలంలో ఏడు శాతం మంది దీర్ఘకాలిక ఆస్తులతో పాటు బంగారం, వాహనాల కొనుగోలుకు నగదే చెల్లించారు.