Jan 05,2023 07:21
  • భోపాల్‌ గ్యాస్‌ విషాదంలో తేలని మృతుల సంఖ్య - ఇదే అంశంపై 10న సుప్రీంకోర్టులో

న్యూఢిల్లీ : పారిశ్రామిక ప్రమాదాలు మాట వినిపిస్తే ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా స్మరణకు వచ్చేంది భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక విపత్తు అది. 1984లో డిసెంబర్‌ 2, 3 తేదీల్లో రాత్రి పూట, యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీ నుంచి 40 టన్నుల 'మిథైల్‌ ఐసోసైనేట్‌' గ్యాస్‌ లీక్‌ కావడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దశాబ్దాలు గడుస్తున్నా ఈ ఘోరకలిలో చనిపోయినవారికి, క్షతగాత్రులైనవారికీ నేటికీ న్యాయం దక్కడం లేదు. కనీసం ఈ ఘోర విపత్తులో ఎంతమంది చనిపోయారన్న సంఖ్య కూడా నిర్ధిష్టంగా లేదు. నాటి దుర్ఘటనలో యూనియన్‌ కార్బైట్‌ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలు తీవ్రమైన విష వాయువులతో నిండిపోయాయి. గ్యాస్‌ లీక్‌ తర్వాత ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున ఎక్కడి వారు అక్కడే కుప్ప కూలిపోయారు. ఈ ప్రమాదంలో 5,295 మంది వరకు మరణించి ఉంటారని అధికారిక గణాంకాల అంచనా. అయితే, ఈ దుర్ఘటన జరిగి 39 ఏళ్లు అయినప్పటికీ మరణాల సంఖ్య, బాధితుల విషయంలో నిర్ధిష్టత కొరవడటంతో ఆందోళనలు చెలరేగుతూనే ఉన్నాయి. ఎంత మంది చనిపోయారు, ఎంత మంది దీని బారిన పడ్డారన్నది ఇంకా అస్పష్టంగానే ఉంది. ప్రమాద గణాంకాలపై అస్పష్టంగా ఉండటంతో భోపాల్‌ గ్యాస్‌ ఘటన బాధితుల తరఫున పలు కార్మిక, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో ఈ నెల 10న విచారణ జరగనుంది. ప్రభుత్వం 1997లోనే మరణాల సంఖ్యను నమోదు చేయడం ఆపివేసిందని భోపాల్‌ గ్యాస్‌ పీడిత్‌ పెన్షన్‌ భోగి సంఘర్ష్‌ మోర్చా అధ్యక్షులు బాలకష్ణ నామ్‌దేవ్‌ చెప్పారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం సమర్పించిన గణాంకాలన్ని తప్పేనని ఆయన పేర్కొన్నారు. దీంతో మళ్లీ అన్ని సంఘాలు ఆందోళనకు దిగినట్టు తెలిపారు.

  • ఎంత మంది చనిపోయారు?

భోపాల్‌ గ్యాస్‌ లీక్‌ వల్ల వచ్చిన వ్యాధులతో 1997 నుంచి వేలాది మంది చనిపోయినట్టు అధికారిక రికార్డులు పేర్కొంటున్నాయి. వాస్తవానికి ఈ ప్రమాదంలో 25 వేల మంది వరకు చనిపోయి ఉంటారని అంచనా. ఒకవేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రమాద మరణాల సంఖ్యను సవరించకపోతే, మళ్లీ ఉద్యమబాట పట్టాల్సివుంటుందని బాధిత పక్షాన నిలుస్తున్న పలు సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మరణాల సంఖ్యను సవరించకపోతే, యూనియన్‌ కార్బైడ్‌, దాని యజమాన్య సంస్థ 'డౌ కెమికల్‌' తగిన పరిహారాలు ఇచ్చేందుకు నిరాకరించవచ్చు. బాధిత ప్రజలు దాఖలు చేసిన 'క్యూరేటివ్‌ పిటిషన్‌'పై త్వరలోనే సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
రూ.25 వేలే పరిహారం..
విషవాయువు లీక్‌ కారణంగా ప్రభావితమైన 9.3 శాతం మందికి కేవలం రూ.25 వేలు మాత్రమే పరిహారంగా అందినట్టు భోపాల్‌ గ్యాస్‌ పీడిత్‌ మహిళా స్టేషనరీ కర్మచారి సంఘానికి చెందిన మహిళ రషీదా బి పేర్కొన్నారు. ఈ సంస్థ సుదీర్ఘకాలంగా గ్యాస్‌ బాధితుల తరఫున పోరాడుతోంది. తాను కూడా ఎంతోకాలంగా గ్యాస్‌ లీక్‌ ద్వారా వచ్చిన దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కొంటున్నట్టు రషీదా చెప్పారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేవారిలో ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఆత్మీయులను కోల్పోయి..వారూ జబ్బుబారిన పడి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.

  • కోర్టును తప్పుదోవ పట్టించే యత్నం..

ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక విపత్తుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టునే తప్పుదోవ పట్టించేందుకు కుట్రలకు పాల్పడుతున్నారని గ్యాస్‌ బాధితుల కోసం పోరాడుతున్న భోపాల్‌ గ్రూప్‌ ఫర్‌ ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ యాక్షన్‌కు చెందిన రచనా ధింగ్రా విమర్శించారు. సుప్రీంకోర్టులో సమర్పించిన గణాంకాలు కనీసం ప్రభుత్వ రికార్డులతో సరిపోవడం లేదని ధింగ్రా అన్నారు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం, భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్‌) రిపోర్టులను ప్రస్తావించిన ధింగ్రా.. 2010లో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు ఈ గ్యాస్‌ ప్రమాద మరణాల సంఖ్య, బాధితుల డేటాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాసినట్టు ఆయన చెప్పారు. అందువల్ల గ్యాస్‌ బారినపడి చనిపోయిన వారందరినీ గుర్తించి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు తగ్గకుండా పరిహారం ఇవ్వాలని, క్షతగాత్రులకు, గ్యాస్‌ వల్ల జబ్బుపడిన వారికి రూ.5 లక్షల చొప్పన పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ దుర్ఘటనలో ఆప్తులను కోల్పోయి, అనారోగ్యానికి గురై అవస్థల పడుతున్న 15342 కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వాల చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గ్యాస్‌ ప్రభావితం వల్ల 95 శాతం మంది ప్రజలు క్యాన్సర్‌ బారిన పడ్డారని, 97 శాతం మందికి భయంకరమైన కిడ్నీ సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ఉందని, ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే తమకు న్యాయం జరిగేవీలుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా కోర్టుకు సరైన వివరాలు సమర్పించి ప్రతి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని, లేదంటే ఉద్యమబాట తప్పదని హెచ్చరించారు.
(బిబిసి సౌజన్యం)