న్యూయార్క్ : యుద్ధాలు, సైనిక ఘర్షణలు, చర్యల వల్ల అత్యంత తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కొనేది మహిళలు, ఆడపిల్లలేనని ఐక్యరాజ్య సమితి జనాభా నిధి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటాలియా కనీమ్ హెచ్చరించారు. తాము చేయని తప్పుకు వారు మూల్యం చెల్లిస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో బుధవారం అమె విలేకర్లతో మాట్లాడుతూ, గాజా, సూడాన్‌ల్లో జరుగుతున్న ఘర్షణలు చూస్తుంటే శాంతి అనేది ఎంత దుర్బలంగా వుందో తెలుస్తోందని అన్నారు. ప్రజలు నిర్వాసితలైనపుడు ఏం జరుగుతుందీ అన్నదానికి సెంట్రల్ ఆఫ్రికాలోని చాద్‌ను ఉదహరణగా కనీమ్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి నిరుపేద దేశాల్లో చాద్ ఒకటైనప్పటికీ అక్కడ 10లక్షల మందికి పైగా శరణార్ధులు ఆశ్రయం పొందుతున్నారని ఆమె పేర్కొన్నారు. వీరిలో దాదాపు 5లక్షల మంది గత ఆరు మాసాల్లో సూడాన్ ఘర్షణల నుండి పారిపోయిన వారేనని ఆమె తెలిపారు. వారిలో అత్యధికులు మహిళలు, పిల్లలేనన్నారు. డిసెంబరు 10 ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మానవ హక్కులపై ఐక్యరాజ్య సమితి హై కమిషనర్ కార్యాలయం (ఒహెచ్‌సిహెచ్‌ఆర్) ఒక నివేదికను ప్రచురించింది. ఏకపక్ష హత్యలు, వేధింపులు, లైంగిక హింస, బలవంతపు వివాహాలు ఇవన్నీ యుద్ధంలో అమలు చేసే ఎత్తుగడలని, వీటికి మహిళలే లక్ష్యాలని ఆ నివేదిక పేర్కొంది.
ప్రాంతీయ యుద్ధంగా మార్చే యత్నాలు
పాలస్తీనీయులపై ఇజ్రాయిల్ 33 రోజులుగా ఏకధాటిగా సాగిస్తున్న నరమేధానికి అమెరికా ఆధ్వర్యంలోని జి-7 కూటమి వత్తాసు పలకడమే కాకుండా ఈ దురాక్రమణపూరిత యుద్ధాన్ని ప్రాంతీయ యుద్ధంగా మార్చాలని చూస్తున్నది. పశ్చిమ దేశాల అండ చూసుకునే రెచ్చిపోతున్న నెతన్యాహు గాజాలో యథేచ్ఛగా హంతక దాడులకు పాల్పడుతూ నెల రోజుల్లో 10వేల మందికిపైగా పాలస్తీనీయుల ప్రాణాలను బలిగొన్నాడు. అంబులెన్సులు, ఆసుపత్రులు, స్కూళ్లు, చర్చిలు, మసీదులు, చివరికి ఐరాస శరణార్ధి శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ బాంబు దాడులు చేస్తోంది. ఇజ్రాయిల్ దాడులను ఆత్మరక్షణ చర్యగా జి-7 దేశాలు అభివర్ణించాయి. జపాన్‌లోని టోక్యోలో బుధవారం సమావేశమైన జి-7 విదేశాంగ మంత్రులు ఇజ్రాయిల్ దాడులకు మద్దతు తెలిపారు. జి-7 ప్రకటన వెలువడిన తరువాత కొద్దిసేపటికే అమెరికా సిరియాపై వైమానిక దాడులకు తెగబడింది. తూర్పు సిరియాలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఇరాన్ ఆర్మీ) స్థావరాలను లక్ష్యంగా చేసుకుని తాము ఈ దాడులు జరిపామని అమెరికా చెబుతోంది. ఇరాన్‌ను కూడా ఈ యుద్ధంలోకి లాగే యత్నంలో భాగమే ఇది అని పరిశీలకులు పేర్కొంటున్నారు.
జెనిన్ శిబిరంపై భయానక దాడులు .. 10మంది మృతి - రోజూ 4 గంటల పాటు మానవత విరామం
గాజా : ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్ నగరంపైన, అక్కడి శరణార్ధుల శిబిరంపైన యూదు దురహంకార ఇజ్రాయిల్ సేనలు భీకర దాడులు జరిపాయి. ఈ దాడుల్లో 10మంది పాలస్తీనియన్లు మరణించగా, మరో 20మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గురువారం తెల్లవారు జామున పెద్ద సంఖ్యలో ఇజ్రాయిల్ బలగాలు జెనిన్ శరణార్ధి శిబిరంలోకి చొరబడ్డాయని పాలస్తీనా వార్తా సంస్థ వాఫా తెలిపింది. ఆ బలగాల వెంటే పెద్ద బుల్డోజర్ కూడా వచ్చిందని,రోడ్డు, మౌలిక వసతులపై దాడులు మొదలెట్టిందని, ఈలోగా శిబిరంపై కప్పులమీద కక్కిన సైనికులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని పేర్కొంది.
ఇదిలా ఉండగా గాజాపై దాడుల్లో ప్రతి రోజూ నాలుగు గంటల పాటు మానవతా విరామాన్ని (హ్యుమానిటేరియన్ పాజ్) పాటించేందుకు ఇజ్రాయిల్ అంగీకరించిందని అమెరికా అధ్యక్ష భవనం తెలిపింది. మానవతావాద విరామం మూడు గంటల ముందుగా ప్రకటిస్తారని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు.