-పలువురి అరెస్ట్
నిర్భందాన్ని ఖండించిన అఖిలపక్షం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళన మళ్లీ తీవ్రమౌతోంది. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ పిలుపుమేరకు విజయవాడకు బయలుదేరిన బాధితులను ఎక్కడికక్కడే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్‌లను తప్పించుకుని విజయవాడకు చేరకున్నా ఎటువంటి నిరసనకు అనుమతివ్వలేదు. జింఖానా గ్రౌండ్‌లో అగ్రిగోల్డ్ బాధితుల శంఖారావ దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ధర్నా చౌక్ వద్ద నిరసనకు అనుమతివ్వాలన్న విజ్ఞప్తిని కూడా పోలీసులు తిరస్కరించారు. దీంతో దాసరి భవన్‌లో సమావేశం జరుపుకోవడానికి కూడా అంగీకరించకుండా పెద్దసంఖ్యలో అరెస్ల్‌లు చేశారు. దాసరి భవన్ చుట్టూ పోలీసులు మొహరించారు. పోలీసుల ఈ తీరును సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, లోక్‌సత్తా తదితర పార్టీలు తీవ్రంగా ఖండించాయి.
- నిర్భందం తగదు - వి శ్రీనివాసరావు
రాష్ట్రంలో శాంతియుత పద్దతుల్లో నిరసనలు తెలిపేందుకు విజయవాడకు తరలి వస్తున్న అగ్రిగోల్డ్ బాదితులను పోలీసులు ఎక్కిడికక్కడే అరెస్ట్ చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో బాధితులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. 32 లక్షల కుటుంబాల కష్టార్జితాన్ని కొల్లగొట్టిన అగ్రిగోల్డ్ యజమాన్యంపై ఇప్పటిదాకా ప్రభుత్వం చర్యలు తీసుకోక పోగా న్యాయం చేయాలని కోరిన బాదితులను అరెస్ట్ చేయడం తగదని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ బాదితుల్లో ఆర్థిక,మానసిక ఒత్తిళ్లతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా తాను ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వేల కోట్ల ఆస్తులు వున్న అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాదీనం చేసుకొని బాదితులకు రూ 3,080 కోట్లు ఇప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వున్న ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.
- అరెస్ట్‌లు తగవు - కె రామకృష్ణ
రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాదితులను ఆదుకోమని కోరితే నిర్బందాన్ని ప్రయోగించి అరెస్ట్‌లు చేయడం సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పేర్కొన్నారు. మార్గదర్శి మీద వున్న ఫోకస్ అగ్రిగోల్డ్ మీద ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.
- అగ్రిగోల్డ్ బాదితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం - సిహెచ్ బాబురావు
అగ్రిగోల్డ్ బాదితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్ బాబురావు అన్నారు. తమది పేదల ప్రభుత్వం అని పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పక్షాన కాకుండా అగ్రిగోల్డ్‌కు ఎందుకు వత్తాసు పలుకుతున్నారని ప్రశ్నించారు.
- మేనిఫెస్టోలో ఉన్నా అమలు చేయరా.... ఎన్ తులసిరెడ్డి
జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల మేనిఫెస్టోలో అగ్రిగోల్డ్ బాదితులకు న్యాయం చేస్తానని పేర్కొన్నారని, దానిని అమలు చేయాలని కోరినా అరెస్ట్‌లకు దిగడం సబబు కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాదీనం చేసుకొని బాదితులకు న్యాయం చేయాలని కోరారు.