Sep 29,2023 11:37

ప్రజాశక్తి-అద్దంకి : అద్దంకి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల(సత్రంబడి) ఆవరణలో నిర్వహిస్తున్న భవిత కేంద్రం నందు ఆ  పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇట్టా రామారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 14 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ను అందించడం జరిగినది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధులుగా మండల విద్యాశాఖాధికారులు ధర్మవరపు గంగాధరరావు, భూదాటి సుధాకరరావులు పాల్గొని విద్యార్థులకు టి.యల్.యమ్ కిట్లను అందించడం జరిగినది. యం.ఈ.ఓ.గంగాధరరావు ముందుగా దాతలు ఇచ్చిన పరికరాలను ఇక్కడి ఉపాద్యాయులు పిల్లల్లో సామర్ధ్యాలను ఎలా పెంపొందించారో ప్రతి పిల్లవాడిని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం భవిత కేంద్రంలోని విద్యార్థుల రిజిస్టర్ లను, రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. గంగాధరరావు మాట్లాడుతూ భవిత కేంద్రం ఇటువంటి పిల్లలకు ఒక వరం లాంటిదని, దాతల సహకారం మరువలేనిదని ప్రశంసించారు. ప్రతి టి.యల్.యం.కిట్ నందు వయస్సును బట్టి పిల్లలకు ప్రత్యేక కౌంటింగ్ పరికరాలు, సెల్ ఫోన్, చేతి వాచ్,క్యాలిక్ లెటర్, వంటివి ఒక్కొక్క విద్యార్థికి 13 వేలు విలువచేసే పరికరాలతో కూడిన కిట్లను ప్రభుత్వం ఉచితంగా అందించడం జరుగుతుందని, వీరు ఒకచోట కుదురుగా ఉండలేరు. ఏ విషయంపైన దృష్టి సారించలేరు, వీరికి బోధన చేయాలంటే వీటి సాయంతో విద్యాబుద్ధులు, మానసిక సామర్ధ్యాలను నేర్పిస్తారని, విద్యార్థుల్లో ప్రజ్ఞా స్థాయి పెంపొందించడంవలన బుద్ధిమాంద్యత ప్రభావం తగ్గించడం వలన స్వతంత్ర పనితీరును మెరుగుపరచేందుకు మరియు శాస్త్రీయంగా రూపొందించిన మెటీరియల్ తో శారీరక, పునరావాసాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ టి.యల్.యం. కిట్లను విద్యార్థులకు ఉచితంగా అందిస్తుందని తెలియజేశారు. సుధాకరరావు మాట్లాడుతూ భవిత కేంద్రంలో శిక్షణానంతరం వారి సామర్థ్యం, అర్హతలను బట్టి పాఠశాలల్లో చేర్పించి  వారిని సాధారణ పిల్లల స్థాయికి తీసుకువచ్చే విధంగా ఉపాద్యాయులు కృషి చేస్తున్నారని  తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఐ.ఈ. ఆర్టీ. ఉపాద్యాయులు కొంగల శ్రీనివాసు,పాలపర్తి యోనా, ఉపాద్యాయులు జె.బాబురావు, ధనలక్ష్మి,వేదవతి, స్వర్ణలత, కవిత, జయకుమారి పాల్గొన్నారు