Feb 05,2021 23:41

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

అధికారులతో సమీక్షించిన కలెక్టర్‌
ప్రజాశక్తి-గుంటూరు: 
జిల్లాలో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు, వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్‌లు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల భవనాల నిర్మాణ కార్యక్రమాలు వేగవంతం చేసి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మార్చి 31 నాటికి పూర్తయ్యేలా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ అధికారుల్ని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో భవనాల నిర్మాణం, ఇళ్ళ నిర్మాణాల పురోగతిపై కలెక్టర్‌, సంయుక్త కలెక్టర్లు ఏఎస్‌ దినేష్‌కుమార్‌, పి.ప్రశాంతితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఇప్పటికీ భవనాల నిర్మాణానికి భూముల సేకరణ పూర్తి చేయని ప్రాంతాల్లో రెవెన్యూ, సర్వే, ఇంజినీరింగ్‌ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి వారం రోజుల్లో ప్రభుత్వ స్థలాలను తప్పనిసరిగా గుర్తించాలన్నారు.గతంలో వివిధ శాఖలకు కేటాయించిన స్థలాల్లో ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న భూమి, శిధిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి స్వాదీనం చేసుకొని వాటిని భవనాల నిర్మాణానికి కేటాయించాలన్నారు. అదే విధంగా పేదలందరికీ ఇళ్ళ పథకం ద్వారా పంపిణీ చేసిన స్థలాలో ఇళ్ళ నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు, భవన నిర్మాణ మెటీరియల్‌ సరఫరా టెండర్లు పూర్తి చేసి పనులు వెంటనే ప్రారంభించాలన్నారు.సమావేశంలో జెసి కె. శ్రీదర్‌ రెడ్డి, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ యాస్మిన్‌, వ్యవసాయ శాఖ జెడి విజయభారతి, జిఎంసి అనురాధ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.