Nov 20,2020 15:24

ఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో భూటాన్‌కు భారత్‌ అండగా నిలుస్తోందని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. పొరుగుదేశాల అవసరాలు తీర్చడంలో భారత్‌ అధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. భారత్‌లో భూటాన్‌ వాసులు డిజిటల్‌ చెల్లింపులు చేసుకునేందుకు వీలుగా రూపే కార్డు ఫేజ్‌-2 కార్యక్రమాన్ని ఇరు దేశాల ప్రధానులు శుక్రవారం ప్రారంభించారు. గతేడాది మోదీ భూటాన్‌ పర్యటకు వెళ్లిన సమయంలో రూపేకార్డు ప్రాజెక్టు ఫేజ్‌-1ను మోదీ ప్రారంభించారు. తొలి దశలో భాగంగా, భారత్‌ నుండి భూటాన్‌కు వెళ్లే పర్యాటకులు అక్కడి ఎటిఎం, పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ మిషన్లతో రూపే కార్డులతో చెల్లించే సౌకర్యాన్ని కల్పించారు. తాజాగా ఫేజ్‌-2లో భాగంగా భారత్‌కు వచ్చే భూటాన్‌ వాసులకు ఈ కార్డులను ఉపయోగించుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఇరు దేశాల పరస్పర సహకారాన్ని మోదీ అభినందించారు. భూటాన్‌ ఉపగ్రహాన్ని ఇస్రో సహాయంతో పంపించే ఏర్పాట్లు, బిఎస్‌ఎన్‌ఎల్‌ ఒప్పందం వంటి అంశాలను ప్రస్తావించారు. కరోనాను ఎదుర్కోవడంలోనూ, వివిధ అంశాల్లో భారతదేశం సహకారం అభినందనీయమని భూటాన్‌ ప్రధాని లటారు షెరింగ్‌ అభిప్రాయపడ్డారు. భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.