Jul 27,2023 13:20

మిన్స్క్‌ :  ప్రముఖ జర్నలిస్ట్‌ పావెల్‌ మజికా (45)కి బుధవారం బెలారస్‌ ప్రభుత్వం ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ చర్యపై స్వతంత్ర జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలపై దీర్ఘకాలంగా కొనసాగుతున్న అణచివేతలో భాగంగా దీన్ని పేర్కొన్నారు. రాజకీయ ప్రతిపక్షాల కార్యకలాపాలను చిత్రీకరించినందుకు ఆయనను దోషిగా తేల్చారు. పశ్చిమ బెలారస్‌లోని గ్రోడ్నో నగరంలో విచారణలో ఉగ్రవాద కార్యకలాపాల నేరంలో భాగంగా పేర్కొంది. పొరుగుదేశమైన పోలాండ్‌కు చెందిన బెల్సాట్‌ టివితో సహా పలు వార్తా సంస్థల్లో పనిచేస్తున్నాడని బెలారస్‌ ప్రభుత్వం వాదిస్తోంది.
జర్నలిస్ట్‌ పావెల్‌ మజికాతో పాటు న్యాయవాది యులియా యుర్హిలేవిచ్‌కి కూడా ప్రభుత్వం ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. బెలారస్‌కి చెందిన రాజకీయ ఖైదీల సమాచారాన్ని యులియా జర్నలిస్టుకి అందిస్తున్నారని ఆరోపించింది.