
ప్రజాశక్తి- నందిగామ : నందిగామ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసనలు తెలిపారు. ఇటీవల బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతి పిటిషన్కు 20 రూపాయలు వెల్ఫేర్ స్టాంపు అతికించమని ఉత్తర్వులు జారీ చేయటాన్ని న్యాయవాదులు వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. నందిగామ బార్ అసోసియేషన్ విధులను బహిష్కరించారు. సీనియర్ న్యాయవాది యర్రంరెడ్డి బాబురావు మాట్లాడుతూ బార్ కౌన్సిల్ సభ్యులు బార్ అసోసియేషన్ లతో ఎలాంటి సంప్రదింపులు చర్చలు జరుపుకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవ టాన్ని నందిగామ న్యాయవాదులు తప్పు పట్టారు. జూనియర్ న్యాయవాదులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన కక్షిదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రతి పిటిషన్ పై 20 రూపాయలు వెల్ఫేర్ స్టాంపు అతికించమనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పలువురు సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయ వాదులు కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బొబ్బిలిపాటి భాస్కర్, స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీ షేక్ ఆజాద్, సీనియర్ న్యాయవాదులు కాట్ర సత్యనారాయణ, యర్రం రెడ్డి బాబురావు , మన్నెం నారాయణరావు, సిహెచ్ సాంబశివరావు చిరుమామిళ్ల శ్రీనివాసరావు , రామచంద్ర రెడ్డి , కొండ , కోటేశ్వరరావు, మౌళేశ్వరరావు నూతన్ , బాబు మంగయ్య ,చరణ్ తదితరులు పాల్గొన్నారు.