
ప్రజాశక్తి-పోడూరు: రైతులను అధోగతి పాలు చేయకుండా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం పశ్చిమగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు బి బలరాం డిమాండ్ చేశారు. శుక్రవారం, శనివారం కవిటo గ్రామంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జుత్తిగ నరసింహామూర్తి అధ్యక్షతన జరుగుతున్న రైతు సంఘం జిల్లా స్థాయి శిక్షణా తరగతులకు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. పోయిన ఖరీఫ్ సీజన్లో రైతులను నానా ఇబ్బందులు పెట్టి నష్టాలు పాలు చేసిందని విమర్శించారు. గ్రామాల్లోనూ మండలంలోనూ ఉన్న రైస్ మిల్లులకు కాకుండా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైస్ మిల్లులకు ధాన్యం తొలాలని ఆర్డర్స్ జారీ చేయడం వల్ల రైతులు నష్టాలు పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యం పేరుతోనూ తేమ శాతం పేరుతోను మిల్లర్స్ లాభపడేలా అధికారులు వ్యవహరించారని ఎద్దేవా చేశారు. ఖరీఫ్ సీజన్ కు ముందుగానే రైతులకు కౌలు రైతులకు ముందస్తుగా బరకాలు ప్రతి రైతుకి అందించాలని కోరారు. దగ్గరగా ఉన్న రైస్ మిల్లులకు ధాన్యాలు వెళ్ళేటట్లుగా చూడాలని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్.బి.కె కేంద్రాల వద్ద సంచులు పూర్తిస్థాయిలో పెట్టాలని పట్టుబడి సామాగ్రి హమాలీసు వాహనాలను ముందే జాగ్రత్తపడేటట్లుగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కార్యదర్శి ఆకుల హరే రామ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్బికే కేంద్రాలను కుదించి రాష్ట్రంలో రెండు వేలకు పైగా ఆర్పీకే కేంద్రాలను ఎత్తివేయడం సరైనది కాదని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్బికే కేంద్రాలు అంతంత మాత్రమే ఉన్నాయని వీటిని బలోపేతం చేయకుండా కేంద్రాలను తగ్గించడం రైతులకు దూరం చేయటం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ శిక్షణ తరగతులకు జిల్లా కమిటీ సభ్యురాలు చింతపల్లి లక్ష్మీకుమారి, కమిటీ సభ్యులు చిర్లా పుల్లారెడ్డి కoకటాల భాస్కరరావు, యాళ్లబండి నారాయణమూర్తి, దొంగ సత్యనారాయణ, కొప్పిశెట్టి సత్యనారాయణ, చేల్లబోయిన వెంకటేశ్వరరావు, గుత్తుల శ్రీనివాస్, ఆకుమూరి శ్రీను, తాడి సుబ్బారావు, మైలా బత్తుల దానయ్య, కరకా వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.