తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినా రాజకీయ పరిణామాల పరిశీలనలో మాత్రం పూర్తిగా విడగొట్టడం సాధ్యం కాదని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపిల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత మరోసారి వెల్లడైంది. ఈ ఎన్నికల తీర్పు అందరికంటే బిజెపి కి అమితానందం కలిగిస్తుంది. సర్జికల్ స్ట్రయిక్స్ చేసేంత అవకాశం, అధికారం మాత్రం రాకున్నా...స్థానాల సంఖ్య ఏకంగా పది రెట్ల పైన పెరగడమే గాక ఓట్ల శాతం కూడా చాలా ఎక్కువగా వచ్చింది. బిజెపి టిఆర్‌ఎస్ లకు ఇంచుమించు సమానంగా ఓట్లు వచ్చాయి. ఇది నిస్సందేహంగా పాలక టిఆర్‌ఎస్‌కు ఒక మధ్యంతర హెచ్చరికేే. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం కన్నా ఇది పెద్ద దెబ్బగా గుర్తించి పాలనా పరమైన రాజకీయమైన లోపాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు సరిచేసుకోకపోతే ప్రజలు తిరస్కరిస్తారని స్పష్టంగా రుజువైంది. గత పర్యాయం కార్పొరేషన్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి టిఆర్‌ఎస్ చాలా దెబ్బతిన్నది. అయితే ఈ మాత్రం సీట్లు ఆ పార్టీకి ఎలా వచ్చాయి? ఎవరు ఓటు చేశారు? దాని తదుపరి పరిణామాలు ఎలా వుంటాయి? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపున దుబ్బాక జిహెచ్‌ఎంసి ఫలితాలే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక లోనూ పునరావృతమవుతాయని బిజెపి హడావుడి పెంచింది. ఈ ఎన్నికల ముందు బిజెపి కి వ్యతిరేకంగా జాతీయ వేదిక నిర్మాణం గురించి చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్ నూతన పార్లమెంటు నిర్మాణంపై ప్రధాని మోడీని అభినందిస్తూ లేఖ రాయడం, ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలవడం మరో మలుపు.
మజ్లిస్‌తో అవగాహన వుండదా?
జిహెచ్‌ఎంసిలో కో ఆప్టెడ్ సభ్యులను కలుపుకున్నా నేరుగా మేయర్ పీఠం పొందలేనంత తక్కువకు పడిపోయింది. ఎంత తక్కువన్నా 70 స్థానాల వరకూ వస్తాయని లెక్కలేసుకుంది. 56 దగ్గర ఆగిపోయింది. ఇక బిజెపి ఇరవై ముప్పై వచ్చినా గొప్పగా చెప్పుకోవచ్చనుకుంటే 48కి చేరింది. 44తో మజ్లిస్ తన బలాన్ని దాదాపు నిలబెట్టుకోగలిగింది (కాంగ్రెస్ రెండంటే రెండు తెచ్చుకుంది). బిజెపి ప్రచారం చేసినట్టు మజ్లిస్ మేయర్ రాకపోయినా వచ్చినా నగర పాలనలో బలమైన పట్టు కొనసాగిస్తుంది. మేయర్ ఎన్నికకు రెండు మాసాల వ్యవధి వుందని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించినా మజ్లిస్‌తో అవగాహన లేకుండా ఇతర పద్ధతులలో దాన్ని కైవశం చేసుకోవాలని టిఆర్‌ఎస్ భావిస్తున్నది. మజ్లిస్ నామకార్థంగా పోటీ పెట్టి టిఆర్‌ఎస్ కు మెజార్టీ వచ్చేలా చేయడం వంటి ఆలోచనలు కూడా వినిపించాయి. హాజరైన సభ్యులతో కోరం చూసుకుని చేతులెత్తే పద్ధతిలో మేయర్‌ను, డిప్యూటీ మేయర్‌ను విడివిడిగా ఎన్నుకుంటారని ఎన్నికల సంఘం చేసిన ప్రకటనలో ఈ వ్యూహం సంకేతాలు కనిపిస్తాయి. మరిన్ని కో ఆప్షన్లు, లేదా పార్టీ మార్పులు లాంటి రాజకీయ దుస్సాహసాలు చేయకపోవచ్చు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాత్రం తమను ఎవరూ సంప్రదించలేదనీ, బిజెపిని ఎదుర్కోగల సత్తా మాత్రం కెసిఆర్‌కే వుందని వ్యాఖ్యానించారు. పైగా మజ్లిస్ పట్ల టిఆర్‌ఎస్ వైఖరి కేవలం మేయర్ స్థానానికే పరిమితం కాకుండా మొత్తం రాజకీయ కోణాలను బట్టి నిర్ణయం కావచ్చు.
మతతత్వం, ప్రాంతీయ ప్రభావాలు
బిజెపి బలం ఇంతగా పెరగడానికి కారణాలు చూస్తే మొదటి కారణం కాంగ్రెస్ క్షీణత. కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా వుంది గనక పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయవలసి వచ్చింది. రెండవ కారణం బిజెపి పట్ల ప్రాంతీయ పార్టీల మెతకదనం. చాలా కాలం కాంగ్రెస్‌ను ఎదుర్కోవడానికై దానితో స్నేహపూర్వకంగా మెలగడం. అసోం, బీహార్, బెంగాల్, ఒడిషా, పంజాబ్, హర్యానా, కర్ణాటక ఇలా చాలా రాష్ట్రాల్లో ఈ పరిస్థితి చూస్తాం. కాంగ్రెస్ బలహీనపడే కొద్దీ ఈ క్రమం మరింత వేగవంతమైంది. టిఆర్‌ఎస్ కూడా తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ గనక బిజెపి పట్ల మెతక వైఖరి అనుసరించడమే గాక ప్రధాని మోడీని అదే పనిగా అభినందించిన రోజులున్నాయి. నోట్ల రద్దు, జిఎస్‌టి వంటి వాటిని బిజెపి ముఖ్యమంత్రుల కన్నా ముందు కెసిఆర్ అభినందించారు. గతంలో ఫెడరల్ ఫ్రంట్ అన్నప్పుడు కూడా కెసిఆర్ కాంగ్రెస్, బిజెపిలు రెంటినీ వ్యతిరేకిస్తానన్నారు. ఇప్పుడు జిహెచ్‌ఎంసి ఎన్నికల ముంగిట్లోనే బిజెపి విధానాలకు వ్యతిరేకంగా జాతీయ వేదిక అన్నారుగాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. దీనికి తోడు పాలనా పరమైన తప్పొప్పులు, హైదరాబాద్‌లో పౌర సమస్యలు, వరదల పాట్లు వంటివి తోడైనాయి. కెసిఆర్ ప్రభుత్వం జిహెచ్‌ఎంసి ఫలితాల పాఠం నేర్చుకోవాలని ప్రజావ్యతిరేక విధానాలు మార్చుకోవాలని వామపక్షాలు స్పష్టీకరించాయి. దుబ్బాకలో కొద్దిపాటి మెజార్టీతో గెలిచిన బిజెపిని హైదరాబాద్‌లో ఏకైక ప్రత్యామ్నాయంగా ఇంకా చెప్పాలంటే కాబోయే విజేతగా చూపించిన మీడియా హైప్ కూడా దోహదం చేసింది. బిజెపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజరు, ఎం.పి ధర్మపురి అర్వింద్ వంటి వారి మతతత్వ భాషణం, కవ్వింపు ప్రసంగాలు మత పరమైన సమీకరణను తీవ్రం చేశాయి. సామాజికంగానూ బిజెపి కొన్ని తరగతుల మద్దతు పొందినట్టు కనిపిస్తుంది.ఈ విద్వేష ప్రచారాలు ఓటర్లు మొత్తంగా ఆమోదించారని చెప్పడం పొరబాటైనా ఒటర్లను ఉద్వేగాలు ప్రభావితం చేశాయనడం నిస్సందేహం. మతతత్వం, ప్రాంతీయ భావనలు పోటీపడటం ఇక్కడ మరో విశేషం. గతంలో తీవ్ర వైరుధ్యాలు, వివాదాలు నడిచిన నేపథ్యం గుర్తు చేసుకుంటే సీమాంధ్ర ప్రజలు ఎక్కువగా వుండే చోట్లనే టిఆర్‌ఎస్ మంచి ఫలితాలు సాధించడం గమనించదగింది. ప్రశాంతత కాపాడుకోవాలంటే టిఆర్‌ఎస్ ను గెలిపించాలని ఆ ఓటర్లు భావించారన్నది స్పష్టం.
ఎ.పిపై జోస్యాలు, టిఆర్‌ఎస్ సంబంధాలు
జిహెచ్‌ఎంసి ఎన్నికల తర్వాత రాజకీయ ఊహాగానాలు ఒకటైతే ఎ.పిలో టిడిపి, వైసిపి అనుకూల మీడియా వాటిని తమ తమ కోణాల్లో చిత్రిస్తున్న తీరు మరింత ఆసక్తి గొల్పుతుంది. దేశ వ్యాపితంగా చూస్తే ప్రాంతీయ పార్టీలు ఒక రాష్ట్రానికే పరిమితమై వుండటం సర్వసాధారణ సూత్రంగా కనిపిస్తుంది. విభజన తర్వాత టిడిపి జాతీయ పార్టీ అంటూనే తెలంగాణలో కొడిగట్టింది. ఇక వైసిపి అధికారికంగానే పోటీ మానేసింది. టిఆర్‌ఎస్ నామకార్థంగా తప్ప ఎప్పుడూ ఎ.పి లో పోటీ చేసింది లేదు. అప్పటి ఎ.పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ అధినేత కెసిఆర్‌కు మధ్య సంబంధాలు ఎప్పుడూ సజావుగా లేవు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ విషయానికి వస్తే ఎన్నికలకు ముందే ఉభయ పార్టీల నేతల మధ్య స్నేహపూర్వక సంబంధాలు చాటుకున్నారు. ప్రమాణ స్వీకారానికి కూడా కెసిఆర్ హాజరయ్యారు. తర్వాత నదీ జలాలు, సచివాలయ భవనాల అప్పగింత వంటి సానుకూల చర్యలు తీసుకున్నారు. పరస్పరం ప్రశంసించుకున్నారు. ఇప్పుడు పోతిరెడ్డిపాడు వంటి సమస్యలు వచ్చినా చంద్రబాబుతో వున్నలాంటి వైరుధ్యాలు కనిపించవు. పైగా విడిపోయిన తర్వాత కూడా మీడియా ఉమ్మడిగానే కొనసాగుతున్నందున రెండింటి రాజకీయాలను కలిపి వండటం ఒక ఆకర్షణీయ ప్రక్రియగా మారింది. వైసిపి ఓట్లు టిఆర్‌ఎస్ కు పడ్డాయని టిడిపి అనుకూల పత్రిక రాస్తే టిడిపి ఓట్లతోనే అది గెలిచిందని వైసిపి అనుకూల పత్రిక రాసింది. ఈ ఎన్నికల తర్వాత తెలంగాణలో వైసిపి ని పెంచాలని కెసిఆర్ భావిస్తున్నారని ఒక పత్రిక చెబుతున్న మాట ఈ వైపరీత్యాలకు పరాకాష్ట. ఏ పాలక పక్షమైనా కోరి మరో పార్టీని పెంచాలనుకోదు. హైదరాబాదు లోనే వున్న చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఎన్నికల ప్రచారంలో కనీసంగా పాల్గొనలేదు. జనసేన పవన్ కళ్యాణ్ కూడా పోటీ ప్రకటించి బిజెపి ఒత్తిడితో వెనక్కు తగ్గారు. తిరుపతి లోనూ బిజెపి ని బలపర్చబోతున్నారు. టిఆర్‌ఎస్ కు వైసిపి ఓట్లు పడ్డాయి గనక ఆ పార్టీ అధినేతపై కేంద్ర బిజెపి గుర్రుగా వుందనే మరో కథనం కూడా ఈ కోవలోదే. ఈ ఎన్నికల తర్వాతనే వైసిపి ప్రభుత్వం రైతాంగం భారత్ బంద్ పట్ల కొద్దిగా సానుకూల వైఖరి తీసుకున్నా తాత్కాలికమే. పోలవరంపై కేంద్రం వైఖరి మారకపోయినా రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో చేసిన తాజా ఆశాభావ ప్రకటనలే ఇందుకు ఉదాహరణ. ఇక కెసిఆర్ బిజెపిపై గతంలో తీసుకున్న విమర్శనాత్మక వైఖరి ఆచరణలో కొనసాగిస్తారా అన్నది చూడాల్సిన అంశం. ఇప్పుడు ఢిల్లీలో ఆయన వారిని మంచి చేసుకోవడానికి తంటాలు పడుతున్నారని, లోపాయికారి అవగాహనకు వస్తారని కాంగ్రెస్ ఆరోపణగా వుంది.
బిజెపి పాచికలు, గజిబిజిలో పాలకులు
జిహెచ్‌ఎంసి ఎన్నికలలో బిజెపి లేవనెత్తిన రోహింగ్యాలు తదితర సమస్యలపై ఏం చేస్తుందో దానివల్ల ప్రభావాలెలా వుంటాయో చూడాల్సిందే. ఎందుకంటే దక్షిణ భారతంలో తమ వ్యూహాలకు ముఖద్వారంగా జిహెచ్‌ఎంసి ని చూపించే బిజెపి దూకుడు పెంచడమే తప్ప తగ్గడం వుండదు. సంఘ పరివార్ నేపథ్యం గల సోము వీర్రాజు అధ్యక్షుడైనాక ఎ.పి లోనూ దూకుడు పెరిగింది. దుబ్బాక తర్వాత తిరుపతిపై కన్ను వేయడం, అక్కడ కార్యవర్గ సమావేశం పెట్టి రాష్ట్రంలో అధికారం లోకి వస్తామని హంగామా చేయడం ఇందుకు తాజా నిదర్శనం. వివిధ పార్టీల నుంచి భారీగా మోతుబరులను రాబట్టడానికి రెండు రాష్ట్రాలలోనూ బిజెపి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితాలు ఇప్పటికి పరిమితంగానే వున్నాయి. తెలంగాణ ముస్లిం రాష్ట్రంగానూ ఎ.పి క్రైస్తవ రాష్ట్రంగానూ మారిపోయిందని బండి సంజరు అన్న మాటలకు సోము వీర్రాజు తదితరుల వైఖరి భిన్నంగా లేదు. తిరుపతిని తమ రాజకీయాలకు కేంద్రంగా మార్చుకోవడానికి ఉప ఎన్నిక కలసి వచ్చింది. బిజెపి కి అక్కడ విజయం అంత సొంత బలం లేకున్నా మత రాజకీయాలు పెంచడం తథ్యం. తిరుపతి సమావేశాలకు ముందు సోము వీర్రాజు రాయలసీమ జిల్లాలలో పర్యటించారు. ప్రస్తుతం బిజెపిలో వున్న మాజీ ఎం.పి గంగుల ప్రతాపరెడ్డి మాజీ మంత్రి మైసూరారెడ్డి వంటి వారితో కలసి గ్రేటర్ రాయలసీమ నినాదం మళ్లీ ముందుకు తెచ్చారు. తమను హైదరాబాద్ తోనే కలపి వుంచాలన్నారు. రాజధాని వికేంద్రీకరణ చట్టం సందర్భం లోనూ ఇలాంటి అంశాలు తీసుకురావడం చూస్తున్నాం. కేంద్రంలోని మోడీ సర్కారు వీటిని పెంచుతున్నది. మొత్తంపైన బిజెపి విస్తరణ, వ్యూహాలూ మత ప్రాంతీయ కోణాలను మరోసారి ప్రకోపింపచేసే అవకాశాలకు అద్దం పట్టే పరిణామాలివి. ఎ.పి లో మూడు ప్రాంతీయ పార్టీలూ బిజెపికి లోబడి వ్యవహరిస్తున్న పరిస్థితులలో లౌకిక శక్తులూ వామపక్షాలు, శాంతి కాముక ప్రజానీకం మరింత అప్రమత్తంగా వుండాల్సిందే. జిహెచ్‌ఎంసి మేయర్ ఎన్నికతో పాటు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కూడా రానుంది గనక తెలంగాణలో ఎవరు ఏం చేస్తారనేది గమనించాల్సి వుంటుంది.
- తెలకపల్లి రవి










