Dec 01,2022 06:48

మానవ జాతిని భయపెడుతున్న ప్రాణాంతక వ్యాధుల్లో ఎయిడ్స్‌ ఒకటి. మన సమాజంలో హెచ్‌ఐవి గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. వాటిని తొలగిస్తూ వ్యాధి గురించి అందరికీ పూర్తి అవగాహన కల్పించి, నివారించే ఉద్దేశంతోనే ఐక్యరాజ్య సమితి డిసెంబర్‌ 1ని 'ప్రపంచ ఎయిడ్స్‌ దినం'గా ప్రకటించింది.

  • ప్రపంచ వ్యాప్త గణాంకాలు

2021లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3.84 కోట్ల మంది ప్రజలు హెచ్‌ఐవి తో జీవిస్తున్నారు. వీరిలో దాదాపు 3.67 కోట్ల మంది పెద్దలు (15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు), దాదాపు 17 లక్షల మంది పిల్లలు (0-14 సంవత్సరాలు) ఉన్నారు. హెచ్‌ఐవి తో జీవిస్తున్న వారిలో 54 శాతం మహిళలు, బాలికలు.
హెచ్‌ఐవి సోకిన వారిలో 85 శాతం మందికి వారి పరిస్థితి తెలుసు. అంటే 15 శాతం మందికి హెచ్‌ఐవి పరీక్ష జరగలేదు. గతేడాది దాదాపు 15 లక్షల మంది కొత్తగా హెచ్‌ఐవి బారిన పడ్డారు. దాదాపు 6,50,000 మంది ఎయిడ్స్‌ సంబంధిత వ్యాధులతో మరణించారు.
2010 నుండి 2021 వరకు హెచ్‌ఐవి కొత్త ఇన్ఫెక్షన్లు దాదాపు 32 శాతం తగ్గాయి. పిల్లలలో హెచ్‌ఐవి కొత్త సంక్రమణలు 52 శాతం తగ్గాయి.
మరణాలు కూడా 52 శాతం తగ్గాయి.

  • హెచ్‌ఐవి సంక్రమణ-ప్రమాదం

సూదుల ద్వారా మాదక ద్రవ్యాలు తీసుకునే వారిలో హెచ్‌ఐవి సంక్రమించే అవకాశం 35 రెట్లు ఎక్కువ.
వయోజన మహిళలలో కంటే మహిళా సెక్స్‌ వర్కర్లలో హెచ్‌ఐవి సంక్రమించే అవకాశం 30 రెట్లు ఎక్కువ.
వయోజన పురుషులలో కంటే స్వలింగ సంపర్కులైన పురుషులలో హెచ్‌ఐవి సంక్రమించే అవకాశం 28 రెట్లు ఎక్కువ.
వయోజన మహిళల కంటే ట్రాన్స్‌జెండర్‌ మహిళలకు హెచ్‌ఐవి సంక్రమించే అవకాశం 14 రెట్లు ఎక్కువ.
పురుషులతో పోలిస్తే స్త్రీలలో హెచ్‌ఐవి సంక్రమించే అవకాశం ఎక్కువ. శరీర నిర్మాణ పరంగా, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ కారణాల వలన హెచ్‌ఐవి సంక్రమణ రేటు స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వారం దాదాపు 4,900 మంది (15-24 సంవత్సరాల) యువతులు హెచ్‌ఐవి బారిన పడుతున్నారు.

  • భారత దేశంలో హెచ్‌ఐవి గణాంకాలు

హెచ్‌ఐవి (పిఎల్‌హెచ్‌ఐవి)తో జీవిస్తున్న వారి సంఖ్య దాదాపు 24 లక్షలుగా అంచనా వేయబడింది.
ఈశాన్య ప్రాంత రాష్ట్రాలలో (మిజోరం, నాగాలాండ్‌, మణిపూర్‌) హెచ్‌ఐవి సోకిన వయోజనలు (15-49 సంవత్సరాల మధ్య వయస్కులు) అత్యధికంగా వున్నారు.
దక్షిణాది రాష్ట్రాలలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.


- తమటం నరసింహ స్వామి
డిప్యూటీ పారా మెడికల్‌ ఆఫీసర్‌ (రిటైర్డ్‌),
సెల్‌: 91771 03171