Jun 01,2023 06:48
  • విధ్వంసకర విధానాలు, ప్రజా వ్యతిరేక చర్యలు, మతతత్వ ఎజెండాతో ముందుకు సాగుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయింది. తొమ్మిదేళ్లుగా దేశాన్ని తప్పుడు మార్గంలో నడిపించిన తర్వాత ... మత సామరస్యాన్ని, సమాఖ్య విధానాన్ని, దేశ శ్రేయస్సును తిరిగి పొందాల్సిన ఆవశ్యకత నేడు ఎంతైనా వుంది. ఈ నేపథ్యంలో దేశ పరిస్థితులకు సంబంధించిన అనేక అంశాలపై... ఐఐటి ముంబై బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌ విశ్రాంత ఆచార్యుడు, రచయిత, సామాజిక పరిశీలకుడు డా||రామ్‌ పునియాని...'దేశాభిమాని' పత్రికకు తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆ వివరాలు...
  • నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. మోడీ తొమ్మిదేళ్ల పాలనను ఎలా అంచనా వేయాలి?

2014లో స్పష్టమైన మెజారిటీతో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి, మతపరమైన ఎజెండాను అమలు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం హిందుత్వ జాతీయవాదంపై ఆధారపడి ఉంది. దేశంలోని మెజారిటీ ప్రజలకు హాని కలిగించే అనేక నిర్ణయాలు ఉన్నాయి. కాశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్‌ 370ని తొలగించడం, పౌరసత్వ సవరణ చట్టం అమలు వంటివి ఇందుకు ఉదాహరణలు.
మరొకటి క్రోనీ క్యాపిటలిజంతో కూడిన ఆర్థిక విధానాలు. ఇందుకు అదానీ వ్యవహారం ఒక ఉదాహరణ మాత్రమే. మోడీ పాలనలో ఇలా గుత్తాధిపత్యం వేళ్లూనుకుని... ధనికులు మరింత ధనవంతులుగా, సామాన్యులు మరింత పేదలుగా మారే పరిస్థితి పెరిగిపోయిందని ఆక్స్‌ఫామ్‌ నివేదిక పేర్కొంది. పేదరికం రేటు పెరుగుతోంది. ధరలు చుక్కలనంటుతున్నాయి. మహిళలు, దళితులు, గిరిజనులు, మతపరమైన మైనారిటీలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తొమ్మిదేళ్లుగా మోడీ దేశాన్ని ఇదే తప్పుడు మార్గంలో నడిపించారు.

  • మోడీ ప్రభుత్వంలో నోట్ల రద్దు కీలకమైన చర్య. ఈ సమయంలోనే కోవిడ్‌ మహమ్మారి సమస్య వచ్చిపడింది. ఈ రెండు అంశాలపై ప్రభుత్వం ఎలా వ్యవహరించింది?

నోట్ల రద్దు, కోవిడ్‌ మహమ్మారి...ఈ రెండు సమస్యలు తలెత్తినప్పుడు మోడీ ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరించింది. నోట్ల రద్దు పెద్ద తప్పు అని తేలింది. నోట్ల కోసం క్యూ లైన్లలో నిలబడి దాదాపు 600 మంది చనిపోయారు. నల్లధనాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో నోట్ల రద్దును అమలు చేశారని, ఆ తర్వాత అది రెండింతలు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. రూ.2000 నోట్లను భారీ అంచనాలతో ప్రవేశపెట్టారు. కానీ ఇప్పుడు వెనక్కి తీసుకున్నారు. ఇవన్నీ ప్రధాని చొరవతో తీసుకున్న నిర్ణయాలే. ఇప్పుడు అది పెద్ద వైఫల్యం అని జనం నమ్ముతున్నారు. మహమ్మారిపై పోరాటంలో కేరళ తీసుకుంటున్న చర్యలు ఎవరికైనా ఆదర్శంగా నిలుస్తాయి. అయితే, దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు, మోడీ ప్రజలకు మొత్తం ఆరు గంటల సమయం మాత్రమే ఇచ్చారు. చాలా చోట్ల ప్రజలు ఒంటరిగా ఉన్నారు. రైల్వే ట్రాక్‌ వెంబడి నడుచుకుంటూ తమ స్వంత ఊళ్లకు వలస వెళ్లిన అత్యంత దయనీయ దృశ్యం మనం చూశాం. దేశంలోని సామాన్యులకు హృదయ విదారకమైన అనుభవాలు ఎదురయ్యాయి.

  • దేశంలో మైనారిటీలు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీన్ని ఎలా అంచనా వేస్తారు?

ఇప్పుడు మైనారిటీలు ప్రతి రోజూ హింసను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. షాహీన్‌బాగ్‌ సమ్మె తర్వాత వారి మీద తప్పుడు కేసులు బనాయించడం, జైళ్లలో కుక్కడం సర్వసాధారణం అయిపోయింది. ఉమర్‌ ఖలీద్‌తో సహా చాలా మంది జైలులో ఉన్నారు. గొడ్డు మాంసం తిన్నందుకు పేద ప్రజలను గోరక్షక గుంపులు కొట్టి చంపిన ఘటనలున్నాయి. మరోవైపు, విద్వేషపూరిత ప్రచారం నిరంతరం కొనసాగుతోంది. అయితే ఇటువంటి ప్రచారానికి పాల్పడే అనురాగ్‌ ఠాకూర్‌, పర్వేష్‌ వర్మ, కపిల్‌ శర్మ వంటి వారిపై కేసు లేదు. జైలు శిక్ష కూడా లేదు. రాజ్యం తమతో ఉందని, మైనారిటీలపై దాడి చేయడానికి, ప్రాణాలు తీయడానికి లైసెన్స్‌ ఉందని సదరు విద్వేష ప్రచారకులు భావిస్తున్నారు. ఒక వర్గం క్రైస్తవులు బిజెపితో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నప్పటికీ... క్రైస్తవులకు కూడా పెను ముప్పు పొంచి ఉంది. క్రైస్తవ ప్రార్థనా స్థలాలపై దాడులు జరుగుతున్నాయి. మణిపూర్‌, నాగాలాండ్‌లో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి. దేశ రాజధానిలో సైతం క్రైస్తవ చర్చిలకు నిప్పు పెట్టారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండానే కొందరు బిషప్‌ లు బిజెపికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

  • దేశమంతటా మతతత్వం విస్తరిస్తున్న సమయంలో 'కేరళ స్టోరీ' వంటి చిత్రాలను రూపొందించారు. దీనికి ప్రధాని మద్దతు కూడా వుంది. లౌకిక కేరళ రాష్ట్రాన్ని అవమానించడానికి, అబద్ధాలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు...!

ఆ సినిమా వెనుక రెండు లక్ష్యాలున్నాయి. కేరళలో బిజెపి అంత తేలికగా గెలవలేదని దానికి అర్థమైపోయింది. అందుకే కేరళను ఉగ్రవాద కేంద్రంగా చిత్రించడం ఈ సినిమా ప్రాథమిక లక్ష్యం. మరొక అంశం ఏంటంటే, ముస్లింలు జిహాద్‌ను ప్రేరేపిస్తున్నారని, యువతులను ఐసిస్‌ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పడం. 'కాశ్మీర్‌ ఫైల్స్‌' ఈ విధంగా రూపొందించబడిన మరొక చిత్రం. గోవా ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జ్యూరీ దీనిని నిర్దిష్ట లక్ష్యాలతో తీసిన చిత్రంగా నిర్ధారించింది. 'కేరళ స్టోరీ'ని కూడా ఇదే తరహా చిత్రంగా వర్గీకరించవచ్చు. తప్పుడు సమాచారం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. లవ్‌ జిహాద్‌కు చెందిన 32,000 మంది హిందూ బాలికలు ఐసిస్‌ లోకి రిక్రూట్‌ అయ్యారని సినిమా చెబుతోంది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం కేరళ నుంచి మొత్తం ఆరుగురు ఐసిస్‌లో చేరారు. వారిలో ముగ్గురు ముస్లింలు కాగా ఇద్దరు క్రైస్తవులు. హిందూ సమాజానికి చెందిన ఒక మలయాళీ మాత్రమే ఐసిస్‌ వైపు ఆకర్షితులయ్యారన్న కేంద్ర ప్రభుత్వ సమాచారం అందించకుండానే నకిలీ లెక్కలు తేల్చే ప్రయత్నం చేస్తున్నారు. 'కాశ్మీర్‌ ఫైల్స్‌' తరహా లోనే ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నేతలు 'కేరళ స్టోరీ'ని సమర్థిస్తున్నారు. దీనికి ప్రధాని కూడా మద్దతు పలుకుతున్నారు.

  • గిరిజన సామాజిక వర్గానికి చెందిన మహిళను రాష్ట్రపతిని చేశామంటూ గొప్పగా ప్రచారం చేసుకున్నారు. అయితే పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని దూరంగా ఉంచే పరిస్థితి నెలకొంది. దీనికేమంటారు?

పార్లమెంట్‌ ప్రారంభోత్సవం గురించి మాట్లాడే ముందు రామ మందిర నిర్మాణం గురించి చర్చించుకోవాలి. ఒక లౌకిక దేశంలో ఆలయ నిర్మాణ ప్రారంభోత్సవాలకు ప్రధాని వెళ్లకూడదు. రామ మందిరం విషయంలో అది ఉల్లంఘించబడింది. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ని కూడా ఆహ్వానించారుగానీ...రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను పక్కన పెట్టారు. అసలు కారణం ఆయన దళితుడు కావడమే. ఇలాంటి మతపరమైన వేడుకల్లో దళితులు ఉండరాదన్న ఆర్‌ఎస్‌ఎస్‌ వైఖరి అలా నెరవేరింది. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ సొంత ఎజెండా అని...దళిత, గిరిజన సంఘాలు వారికి కేవలం ప్రచారాంశాలు మాత్రమేనని ఈ చర్యలు రుజువు చేస్తున్నాయి. పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని దూరంగా ఉంచడం ద్వారా ఈ విషయం మరింత స్పష్టంగా వెల్లడైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గిరిజన వర్గానికి చెందినవారు.
దీన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలు ఒక్కటయ్యాయి. 21 రాజకీయ పార్టీలు కేంద్రం చర్యను విమర్శించాయి. మరోవైపు 14 పార్టీలు ప్రభుత్వం వెంట ఉన్నాయి. బిజెపి కి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకం కావడం విశేషం. కర్ణాటకలో ఇది ఫలించింది. ఇది మంచి పరిణామం.

  • కేరళలో బిజెపికి ఒక్క సీటు కూడా లేదు. తమిళనాడులోనూ బిజెపి ఆ దరిదాపుల్లో లేదు. బిజెపిని అడ్డుకునేందుకు దక్షిణ భారతం ప్రయత్నిస్తోందని భావిస్తున్నారా?

మతపరమైన అంశాల పట్ల కేరళ ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడం ఇందుకు మరో కారణం. తమిళనాడులో ద్రవిడ, పెరియార్‌ ఉద్యమాలు ఉన్నాయి. ఈ వాతావరణం బిజెపిని దూరం చేస్తుంది. కర్ణాటకలో మత ప్రాతిపదికన చీలికలు పెట్టే ప్రయత్నాన్ని ప్రజలు ఓడించారు. 'ఆపరేషన్‌ కమల్‌'కు కూడా వీలు లేని విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. దక్షిణ భారతదేశం దేశానికి మార్గదర్శకంగా మారుతుందని ఈ పరిణామం తెలియజేస్తోంది.

  • బిజెపి వ్యతిరేక వాతావరణాన్ని పెంచేందుకు కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌, రైతుల సమ్మె దోహదపడ్డాయంటారా?

ఈ వాతావరణాన్ని కాపాడుకుంటూ కలిసికట్టుగా ముందుకు సాగితే దేశంలో శుభవార్త వినవచ్చు.