ప్రజాశక్తి - రేపల్లె : రేడియోలజిస్ట్, గైనేకాలజిస్ట్ రిఫరెన్స్ లేకుండా స్కానింగ్ లు చేయవద్దని, అవసరమైన గర్భిణీ స్త్రీలకు మాత్రమే స్కానింగ్ చేయాలని ఆర్డీవో జగన్నాథం పార్థసారథి చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పి.సి.పి.ఎన్.డి.టి.యాక్ట్ కమిటీ మీటింగ్ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం అమలుపై సలహా మండలి సమావేశం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో జగన్నాథం పార్థసారథి మాట్లాడుతూ... స్కానింగ్ చేసేటప్పుడు గర్భిణి స్త్రీ యొక్క అనుమతి తీసుకోవాలని, అనుమతి ఎట్టి పరిస్థితుల్లో కూడా లింగ నిర్ధారణ చేయవద్దన్నారు. గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగనిర్ధారణ పరీక్షల చట్టం – 1994 (పి.సి.పి.ఎన్.డి.టి.యాక్ట్) ప్రకారం గర్భంలో పెరుగుతున్న పిండం గురించి లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టవిరుద్ధమన్నారు. గర్భస్రావాలను ఆపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పి.సి.పి.ఎన్.డి.టి.యాక్ట్ ను చట్టం చేసిందని, ఈ చట్టం ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే డాక్టరుకు, చేయిస్తే ఆ కుటుంబ సభ్యులకు మూడేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తారని చెప్పారు. డాక్టర్లు, డయాజ్ఞాస్టిక్ సెంటర్లు నైతిక విలువలు, సామాజిక బాధ్యతతో పాటు చట్టాన్ని గౌరవించాలని తెలిపారు. పట్టణంలో 23 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని, ప్రతి స్కానింగ్ సెంటరులో సిసి కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు ఆయా కేంద్రాలపై ప్రోగ్రాం అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. ఆస్పత్రుల్లో అబార్షన్ల వివరాలతో పాటు అందుకు తగిన కారణాలను తమకు సమర్పించాలని స్పష్టం చేశారు. బాలికలపై వివక్ష లేకుండా సమాజంలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యవృత్తి ఎంతో ఉన్నతమైనదని, మనిషి ప్రాణాలను కాపాడే మహత్తర అవకాశం దేవుడు వైద్యులకు, వైద్యశాఖలో పనిచేసే సిబ్బందికి కల్పించారని ఆయన అన్నారు. బాల, బాలికలిద్దరూ సమానమేననే భావం కల్పించాలన్నారు. గర్భిణి స్త్రీలు టెన్షన్ పడవద్దని, ఆరోగ్యం పట్ల, తీసుకోవాల్సిన మందులు, ఆహారం, విశ్రాంతి గురించి డాక్టర్లు మంచి సలహాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రోహిణి డీఎస్పీ మురళీకృష్ణ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ వసంతం వీర రాఘవయ్య డాక్టర్ సురేంద్రనాథ్ డాక్టర్ సుధాకర్ అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.










