మెల్‌బోర్న్ : దేశంలో కార్మికుల కొరతను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం శాశ్వత వలసదారులకు తలుపులు తెరిచింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నైపుణ్యాల లేమి, కార్మికుల కొరతను పరిష్కరించేందుకు శాశ్వత వలసదారుల సంఖ్యను పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దోపిడీ, వేధింపులను నిరోధించేలా వలస కార్మికుల భద్రతను బలోపేతం చేయాలని పిలుపునిచ్చింది. ఈ ప్రకటనను ట్రేడ్ యూనియన్స్, వ్యాపార వర్గాలు స్వాగతించాయి. అయితే శాశ్వత వలసదారుల సంఖ్యను పెంచడం... కార్మిక కొరతను పరిష్కరించకపోగా, మరింత ప్రమాదకరంగా మారవచ్చని నిపుణులు వాదిస్తున్నారు.
శాశ్వత వలసదారుల సంఖ్యపై ఉన్న ఆంక్షలను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎత్తివేసింది. 2022-23 వార్షిక ఏడాదికి గాను ఆ సంఖ్యను 1,60,000 నుండి 1,95,000కు పెంచుతున్నట్లు ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. స్వేచ్ఛ, వృద్ధికరమైన, ప్రజాస్వామ్య సమాజంతో తమ దేశ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తుందని ఈ మార్పును ప్రకటిస్తూ హోం వ్యవహారాల మంత్రి క్లెయిర్ ఓ నీల్ పేర్కొన్నారు. తాత్కాలిక వీసాదారులు శ్రామిక శక్తిలో అత్యధిక వాటాని కలిగి ఉండనున్నారని మెల్‌బోర్న్‌కి చెందిన వలసకార్మికుల కేంద్రం అధ్యక్షుడు మాట్ కుంకెల్ పేర్కొన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం.. ముగ్గురిలో ఇద్దరు తాత్కాలిక వీసాదారులు పనిప్రదేశాలలో కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అన్నారు. అయితే కార్మికుల లోటును పూడ్చేందుకు శాశ్వత వలసదారులను పెంచడం సమస్య పరిష్కారాన్ని చూపలేదని అన్నారు.
ఇండోనేషియా నుండి వర్కింగ్ హాలిడే వీసా (డబ్ల్యుహెచ్‌వి)పై 2017 ఫిబ్రవరిలో పుత్రి సిడ్నీకి వచ్చారు. తండ్రి మరణించడంతో తన తల్లికి డబ్బు పంపించవచ్చని భావించారు. మరో ఇండోనేషియా వ్యక్తికి చెందిన దుకాణంలో పనిచేయడం ప్రారంభించారు. కనీసవేతనం కంటే తక్కువగా గంటకి నాలుగు ఆస్ట్రేలియన్ డాలర్లు చెల్లిస్తున్నారు. అయితే అక్కడ కనీస వేతనం గంటకు 18.29 ఆస్ట్రేలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటైన సిడ్నీలో తక్కువ వేతనం పొందడంతో ఆమె అపార్ట్‌మెంట్‌లోని రెండు గదుల్లో 16 మంది నివసించాల్సి వస్తోంది. అలాగే పిజ్జా రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నారు. అక్కడ గంటకు 26 ఆస్ట్రేలియన్ డాలర్లు సంపాదిస్తున్నప్పటికీ.. లైంగిక వేధింపులకు ఎదుర్కొంటున్నారు. అక్కడ పనిచేయడం కన్నా చనిపోవాలని భావించానని.. కానీ తన తల్లికి డబ్బు పంపించడం కోసం పనిచేయక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రికార్డు స్థాయిలో ఉద్యోగావకాశాలు
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకముందు, ఆస్ట్రేలియా ఒఇసిడిలో రెండవ అతిపెద్ద తాత్కాలిక వసలకార్మికులను కలిగి వుంది. అమెరికా తర్వాత రెండవది. అయితే కరోనా మహమ్మారితో సరిహద్దుల్లో కఠిన ఆంక్షలు విధించడంతో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారి 2020-21లో వసదారుల సంఖ్యలో ప్రతికూలత నమోదైంది.
ప్రభుత్వేతర సంస్థ అయిన గ్రాటాన్ ఇన్‌స్టిట్యూట్ సంస్థ అంచనా ప్రకారం.. ఆస్ట్రేలియా మొత్తం కార్మికుల సంఖ్య 13.6 మిలియన్లు కాగా.. 2019లో 2 మిలియన్లుగా ఉండగా.. 2022 జనవరి నాటికి తాత్కాలిక వసలదారుల సంఖ్య 1.5 మిలియన్లకు పడిపోయింది. అలాగే 2019లో ఆంక్షలతో శాశ్వత వలసదారుల సంఖ్య కూడా క్షీణించింది. దీంతో ఒక్కసారిగా కార్మికుల కొరత ఏర్పడింది. నైపుణ్యాల కొరతతో పాటు సివిల్ ఇంజనీరింగ్ సంస్థల నుండి హెల్త్ క్లినిక్‌లు, కేర్ హోమ్‌లు, రెస్టారెంట్లు అవసరమైన సిబ్బంది లేకపోవడంతో మూతపడ్డాయి. ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం.. మే 2022 నాటికి దేశంలో రికార్డుస్థాయిలో 4,80,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. మహమ్మారి ప్రారంభ సమయంలో ఖాళీల కన్నా రెట్టింపు ఉన్నట్లు నివేదిక తేల్చింది.










