ఇంగ్లాండ్ వేదికగా ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈసారి ప్రతి టెస్టు సందర్భంగా ఏదొక అంశం వివాదాస్పదమవుతూనే ఉంది. క్యాచ్‌లు, ఔట్ చేసిన తీరు, ఎంసీసీ సభ్యులే ఆసీస్ ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించడం.. ఇక బెయిర్ స్టో ఔట్ వివాదంపై రెండు దేశాల ప్రధానులు కూడా జోక్యం చేసుకున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధమంటే.. ఆసీస్ ప్రధాని ఆంథోని అల్బనీస్ రిషి సునాక్ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. అయితే క్రికెట్ అనేది జెంటిల్‌మెన్ గేమ్ అని.. ఇక్కడితో ఈ వివాదానికి స్వస్తి పలకాలని ఇరు దేశాల ప్రధానులు అభిమానులను కోరారు. తాజాగా మరోసారి ఇంగ్లాండ్ ప్రధాని రిషి సునాక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్ 'నాటో' సమ్మిట్‌లో భాగంగా యాషెస్‌పైనా చర్చించారు. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధాని ట్విటర్ వేదికగా వీడియోను పోస్టు చేశారు.
వీడియోలో తొలుత ఆసీస్ ప్రధాని తమ జట్టు 2-1 ఆధిక్యంలో ఉందంటూ ప్లకార్డును ప్రదర్శించగా.. లీడ్స్ టెస్టులో ఇంగ్లాండ్ గెలిచిందంటూ రిషి సునాక్ ప్రతి స్పందించారు. దీంతో వెంటనే జానీ బెయిర్‌స్టో ఔట్‌ను ప్రస్తావిస్తూ ఆసీస్ ప్రధాని మరో పేపర్‌ను చూపించారు. అయితే, రిషి సునాక్ నవ్వుతూనే 'నేను శాండ్ పేపర్‌ను తీసుకురావడం మరిచిపోయా' అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ఆసీస్ ప్రధాని కూడా సునాక్‌తో కలిసి నవ్వులు చిందించారు. ఆ తర్వాత ఇద్దరూ కరచాలనం చేసుకుని భేటీని ముగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
And of course we discussed the #Ashes pic.twitter.com/FeKESkb062
— Anthony Albanese (@AlboMP) July 11, 2023
- శాండ్‌పేపర్ వివాదం..
ఐదేళ్ల క్రితం సౌతాఫ్రికాతో టెస్టు సందర్భంగా ఆసీస్ ఆటగాడు కామెరాన్ బెన్‌క్రాఫ్ట్ శాండ్‌పేపర్ ముక్కతో బంతిని రుద్దడం అప్పట్లో వైరల్‌గా మారింది. ఇలా చేయడం వల్ల బంతి స్వింగ్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఈ శాండ్‌పేపర్ ఉదంతం వెనుక అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లది కీలకపాత్ర అని తేలడంతో ఏడాది నిషేధం పడింది. బెన్‌క్రాఫ్ట్ తొమ్మిది నెలలు నిషేధానికి గురయ్యాడు. ఈ ఉదంతం అనంతరం స్మిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అయితే ఏడాది తర్వాత స్మిత్, వార్నర్‌లు మళ్లీ జట్టులోకి రాగా.. బెన్‌క్రాఫ్ట్ మాత్రం మళ్లీ అడుగుపెట్టలేకపోయాడు.










